పుట:సత్యశోధన.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

కాశీలో

అతిక్రమించకూడదు. ఈ విధంగా చేస్తే జనానికి కొద్దో గొప్పో సంస్కారం కలుగుతుందని అనుభవం వల్ల చెబుతున్నాను. నేను జబ్బుపడినందువల్ల 1920 నుండి మూడోతరగతి ప్రయాణం మానుకున్నాను. ఇందుకు నాకు సిగ్గు వేసింది. విచారం కలిగింది. మూడో తరగతి ప్రయాణీకుల ఇక్కట్లు కొద్దికొద్దిగా తగ్గి దారికి వస్తున్న తరుణంలో నాకు జబ్బు చేసి అట్టి అదృష్టం తప్పిపోయింది. రైళ్లలోను, ఓడల్లోను ప్రయాణం చేసే బీదవాళ్ళకు కలిగే చిక్కుల్ని, అసౌకర్యాలను తొలగించేందుకు అంతా కృషి చేయాలి. యిది అందరికీ సంబంధించిన ఒక స్వతంత్ర విషయం. అందుకు ఒకరిద్దరు సమర్ధులు పూనుకుంటే మేలు జరుగుతుంది.

ఇక యీ విషయం మాని కాశీ కథ చెబుతాను. ప్రాతః కాలసమయంలో కాశీలో కాలు పెట్టాను. పండా ఇంట దిగుదామని అనుకున్నాను. చాలామంది బ్రాహ్మణులు నా చుట్టూ మూగారు. వారందరిలో శుచిగా యున్న పండా యింటికి వెళదామని అనుకున్నాను. అట్టి పండాను చూచి వారి యింటికి వెళ్ళాను. ఆ పండా ఇల్లు శుచిగా వుంది. ముంగిట్లో గోవు కట్టివేయబడి వుంది. యిల్లు పరిశుభ్రంగా వుంది. మేడ మీద నా బస. యధావిధిగా గంగా స్నానం చేయాలని భావించాను. అంతవరకు అన్నం తినకుండా వుండాలని అనుకున్నాను. అవసరమైన ప్రయత్నమంతా పండా చేశాడు. ఒక రూపాయి పావలా కంటే ఎక్కువ దక్షిణ యివ్వలేనని మొదటనే పండాకు చెప్పాను. దానికి తగినట్లే చేయమని చెప్పాను. అతడు ఏమాత్రం జగడం పెట్టుకోలేదు. “ఫకీర్లకైనా పాదుషాలకైనా పూజ ఒకే రీతిగా చేయిస్తాను. యాత్రికులు వారి వారి శక్త్యానుసారం యిస్తారు. దాని కేమిటి?” అని పండా అన్నాడు. పూజా సమయంలో అతడు మంత్రాలు మింగినట్లు అనిపించలేదు. పన్నెండు గంటలకు పూజా స్నానాదులు ముగించుకొని కాశీ విశ్వనాధుని దర్శనం కోసం వెళ్ళాను. అక్కడ చూచిన విషయాలు వాకు ఎంతో దుఃఖం కలిగించాయి.

1891వ ఏట నేను బొంబాయిలో బారిస్టరీ చేస్తున్నప్పుడు ప్రార్ధనా సమాజ మందిరంలో కాశీ యాత్రను గురించి ఒక ఉపన్యాసం విన్నాను. ఆ ప్రసంగం విని నిరాశ పడ్డాను. కాశీ వెళ్ళాను. కానీ ప్రత్యక్ష దర్శనం చేసుకొని అనుకున్న దాని కంటే అధికంగా నిరాశపడ్డాను.

జారుడుగా వున్న ఒక ఇరుకు సందులో నుండి ఆలయం లోపలికి వెళ్లాలి. అక్కడ శాంతి అనే మాటకు తావులేదు. ఎక్కడ చూచినా ఈగలు గుయ్ అంటున్నాయి. యాత్రికుల రొదకు, దుకాణాల వాళ్ల రగడకు అంతేలేదు.