పుట:సత్యశోధన.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

207


నొచ్చుకున్నారు. “అయ్యా! నేనెక్కడ! మీరెక్కడ! కాంగ్రెసు సేవలో మీ జుట్టు పండిపోయింది. నాకంటే మీరు పెద్దలు. వృద్ధులు. నేను అనుభవంలేని కుర్రవాణ్ణి. మీరీ పని యిచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. యిక ముందు ముందు కాంగ్రెసులో నేను పనిచేయాల్సి వుంది. పని తెలుసుకునేందుకు దుర్లభమైన అవకాశం మీరు నాకు యిచ్చారు” అని ఆయనను సముదాయించాను.

“నిజంగా నువ్వు భలేవాడివి. ఈ కాలపు కుర్రవాళ్లు నీలా వుండరు. కాంగ్రెసు పుట్టినప్పటినుండి నాకంతా తెలుసు. కాంగ్రెసు స్థాపనలో హ్యూమ్‌గారితో బాటు నాకు కూడా పాలువుంది” అని ఘోషాలుగారన్నారు.

మా కీవిధంగా బాగా పరిచయం అయింది. మధ్యాహ్నభోజనం మేమిద్దరం కలిసి చేశాం. ఘోషాలు బాబుగారి చొక్కాకు గుండీ “బేరా” వచ్చి తగిలించేవాడు. అది చూచి ఆ పని నేనే చేస్తానని చెప్పాను. అలా చేయడం నాకు యిష్టం. పెద్దలంటే నాకు గౌరవం. వారికి నా మనస్సు బాగా తెలిసిపోయింది. అప్పటి నుండి వారు తన పనులన్నీ నాచేత చేయించుకోసాగారు. గుండీలు పెడుతూ వుంటే మూతి బిగించి “చూచావా? కాంగ్రెసు సెక్రటరీకి బొత్తాములు పెట్టుకునేందుకు కూడా తీరిక వుండదు. అప్పుడు కూడా అతనికి అనేక పనులు వుంటాయి” అని అన్నారు.

ఆయన అమాయకత్వానికి నాలో నేను నవ్వుకున్నాను. అయితే ఆయనకు శుశ్రూషచేయడమంటే నాకు అయిష్టత ఏర్పడలేదు. అందువల్ల నాకు ఎంతో లాభం కలిగింది.

కొద్ది కాలానికే కాంగ్రెసు వ్యవహారం అంతా తెలుసుకున్నాను. పెద్దలతో పరిచయం అయింది. గోఖ్లే, సురేంద్రనాథ్ బెనర్జీ మొదలగు యోధులు వస్తూ పోతూ వుండేవారు. వారి వైఖరి తెలుసుకునేందుకు అవకాశం లభించింది. కాంగ్రెస్‌లో కాలం ఎంతగా వృధా అవుతున్నదో బోధ పడింది. ఇంగ్లీషు భాషకు అక్కడగల ఆధిపత్యం గమనించారు. అది చూచి నాకు దుఃఖం కలిగింది. ఒక్కడు చేసే పనికి పదిమంది పరుగెత్తడం, అవసరమైన పనికి ఒక్కడు కూడా రాకపోవడం గమనించాను.

ఈ విషయాలన్నింటిని గురించి నా మనస్సు పనిచేయసాగింది. అయితే యింత కంటే ఎక్కువ సంస్కరణ సాధ్యం కాదేమో అని మనస్సు సమాధానం చెప్పింది. అందువల్ల మనస్సులో దుర్భావన కలుగలేదు.