పుట:సత్యశోధన.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

179

నా సమయమంతా సార్వజనిక కార్యక్రమాలకే సరిపోతున్నది. మన్‌సుఖలాల్ నాజర్ గారు నేటాల్లో వున్నారని గతంలో తెలియజేశాను. వారు మా ఇంట్లో ఉండేందుకై వచ్చి ఆ పనుల్ని చూడటం ప్రారంభించారు. అందువల్ల నా పని భారం కొద్దిగా తగ్గినది.

నేను దక్షిణ - ఆఫ్రికాలో లేనప్పుడు ఆదంజీ మియాఖాన్ గారు తమ విధిని సక్రమంగా నిర్వహించారు. వారి సమయంలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య బాగా పెరిగింది. యాత్రీకుల్ని రానీయకుండా చేసే యత్నాన్ని, భారతీయుల వ్యతిరేక చట్టాల్ని ఎదుర్కునేందుకు ఎక్కువ ధనం సమకూర్చాలని నిర్ణయించాం. తత్ఫలితంగా 5000 పౌండ్ల ధనం వసూలైంది. కాంగ్రెస్ కోశానికి స్థిరత్వం చేకూరితే ఆ సొమ్ముతో కొంత ఆస్థి కొని, దాని వల్ల వచ్చే ఆదాయంతో కాంగ్రెస్‌ను ఆర్ధికంగా తీర్చిదిద్దాలని నాకు లోభం కలిగింది. సార్వజనిక సంస్థల్ని నడిపే వ్యవహారంలో నాకు కలిగిన మొదటి అనుభవం యిది. నా అభిప్రాయం తోటి మెంబర్లకు చెప్పాను. వారంతా అందుకు అంగీకరించారు. కొంత ఆస్థి కొన్నాం. అద్దెకిచ్చాం. దానితో కాంగ్రెస్ వ్యయం సరిపోసాగింది. అందు నిమిత్తం ధర్మకర్తల్ని ఏర్పాటు చేశాం. ఆ ఆస్తి యిప్పటికీ వున్నది. కాని తరువాత అది అంతః కలహాలకు దారితీసింది. అద్దె సొమ్ము కోర్టులో జమచేయబడుతూ వున్నది. నేను దక్షిణ - ఆఫ్రికా వదలి వచ్చేసిన తరువాత అలా జరిగింది.

అసలు సార్వజనిక సంస్థలకు మూలధనం ఏర్పాటు చేయడం విషయంలో నా అభిప్రాయంలో చాలా మార్పు వచ్చింది. నేను అక్కడ వున్నపుడు చాలా సార్వజనిక సంస్థల్ని స్థాపించాను. వాటిని నడిపించాను. వాటికి అండగా వున్నాను. వాటివల్ల కలిగిన అనుభవాన్ని పురస్కరించుకొని ఏ సార్వజనిక సంస్థకూ మూలధనం సమకూర్చి పెట్టే ప్రయత్నం చేయకూడదనే దృఢ నిర్ణయానికి వచ్చాను. మూలధనం సమకూర్చి పెట్టగానే దానికి నైతికంగా అధోగతి ప్రారంభం అవుతుంది. అందుకు అవసరమైన బీజాలు మూలధనంలోనే వున్నాయి.

సార్వజనిక సంస్థ అంటే ఏమిటి? సర్వజనుల అనుమతితో, సర్వజనుల ధనంతో, నడుపబడు సంస్థ అని అర్థం. ప్రజల సహకారం అట్టి సంస్థకు లేకుండా పోయినప్పుడు యిక ఆ సంస్థ అనవసరం. మూలధనంతో నడపబడే సంస్థలు ప్రజల అభిప్రాయాలకంటే స్వతంత్రంగాను, అనేకసార్లు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగాను కూడా నడుస్తూ వుంటాయి. మన దేశంలో యిట్టి సంస్థల్ని ప్రతిచోట చూస్తున్నాం.