పుట:సత్యశోధన.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

శాంతి

అదనంగా చెప్పలేదని రుజూచేశాను. కురలేండ్, నాదరి ఓడల్లో వచ్చిన వారితో నాకు ఏవిధమైన సంబంధం లేదని స్పష్టం చేశాను. వారిలో చాలామంది నేటాలులో నివసిస్తున్న వారే. మిగిలిన వారు నేటాల్లో ఆగరు. వారు ట్రాన్సువాలు వెళతారు. ఆ సమయంలో నేటాల్లో పనులు తక్కువ. ట్రాన్సువాల్లో పనులు ఎక్కువ. అక్కడ ఆదాయం అధికంగా లభిస్తున్నది. అందువల్ల ఎక్కువ మంది భారతీయులు అక్కడికి వెళ్ళుతూ వున్నారు.

పత్రికా ప్రతినిధితో జరిగిన నా సంభాషణంతా పత్రికల్లో ప్రకటింపబడింది. నన్ను కొట్టినవారి మీద కేసు పెట్టనని సవివరంగా చెప్పిన మాటలు కూడా పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. దానితో తెల్లవారు తలలు వంచుకున్నారు. పత్రికలు నన్ను నిర్దోషి అని ప్రకటించాయి. దుండగుల దుందుడుకుతనాన్ని ఖండించాయి. చివరికి ఈ విధంగా ఆ ఘట్టం వల్ల నాకు లాభం కలిగిందన్నమాట. దీనివల్ల భారతీయుల గౌరవ ప్రతిష్టలు పెరిగాయి. నా మార్గం సుగమం అయింది. మూడు నాలుగు రోజులకు ఇంటికి చేరాను. నా కార్యక్రమాలు ప్రారంభించాను. ఈ ఘట్టం వల్ల నా వకాలతు కూడా పెరిగింది.

ఒకవైపున భారతీయుల ప్రతిష్ట పెరిగిందే కాని మరో వైపున వారి యెడ తెల్లవారిలో ద్వేషం కూడా పెరిగింది. భారతీయుడు పౌరుషవంతుడని తెల్లవారికి తెలిసింది. దానితో భారతీయులంటే తెల్లవారికి భయం ప్రారంభమైంది. నేటాలు లెజిస్లేటివ్ కౌన్సిల్లో రెండు చట్టాలు ప్యాసయ్యాయి. భారతీయులకు కష్టాలు కలిగించేవిగా అవి వున్నాయి. ఒక చట్టం భారతీయుల వ్యాపారానికి హాని కలిగిస్తుంది. రెండోది వలస వచ్చే వారికి హాని కలిగిస్తుంది. వోటు హక్కు కోసం మేము చేసిన కృషి దేవుని దయవల్ల కొంత ఫలించింది. “భారతీయులకు వ్యతిరేకంగా, అనగా భారతీయుడైనంత మాత్రాన వానికి ఏ చట్టమూ వర్తించబడకూడదు” అంటే “చట్టానికి జాతి భేదం వర్ణభేదం ఉండరాదు” అని నిర్ణయం చేశారు. యీ నిర్ణయం భారతీయులకు కొంత ఊరట కలిగించిందని చెప్పవచ్చు. అయితే పై రెండు చట్టాల్లోను ఉపయోగించబడిన భాష పైకి మెత్తగా వున్నా, లోపల మాత్రం భారతీయుల హక్కుల్ని కుంచింపజేసే విధంగా కరుకుగా వున్నది,

ఈ రెండు చట్టాలు నా పనిని పెంచి వేశాయి. భారతీయుల్లో జాగృతి కలిగించాయి. భారతీయులందరకీ యీ చట్టాల ఉద్దేశ్యం స్పష్టంగా అర్థం కావాలనే ఉద్దేశ్యంతో వాటిని అన్ని భాషల్లోకి అనువదించాము. ఇంగ్లాండుకు అర్జీలు పంపించాము. కాని చట్టాలు మాత్రం మంజూరయ్యాయి.