పుట:సత్యశోధన.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

వెంటనే బయలుదేరి రమ్మని పిలుపు

నేను ఆసజ్జనుల్ని సందర్శించాను. కాని అక్కడ పప్పులుడకలేదు. యిద్దరూ కలకత్తాలో సభ చేయడం సులభసాధ్యం కాదనీ, ఏమైనా చేయగలిగితే శ్రీ సురేంద్రనాధ బెనర్జీ గారే చేయగలరని చెప్పారు. నా పని కష్టతరం కాసాగింది. అమృత బజార్ పత్రిక ఆఫీసుకు వెళ్లాను. అక్కడ నన్ను చూచిన సజ్జనులంతా నేనొక దేశ దిమ్మరినని భావించారు. వంగవాసి ప్రతికాధిపతి ఇంకో మెట్టు పైకెక్కాడు. అక్కడ ఒక గంట సేపు వేచి వుండవలసి వచ్చింది. ఆయనతో మాట్లాడటానికి చాలామంది వచ్చారు. వాళ్లనందరినీ పంపించిన తరువాత కూడా వారు నన్ను కన్నెత్తి చూడలేదు. ఒక గంట సేపు ఆవిధంగా గడిపాను. చివరికి గత్యంతరం కనబడక నా విషయం చెప్పివేద్దామని ఉద్యుక్తుడనయ్యాను. వెంటనే ఆయన అందుకొని “నాకు ఎన్ని పనులున్నాయో మీకు కనిపించడం లేదా? మీవంటి వాళ్లు యిక్కడ వేలకు వేలు. మీరిక్కడ నుండి వెళ్లిపోవడం చాలా మంచిది. మీ మాట నేను వినదలుచుకోలేదు” అని అన్నాడు. నాకు కొంచెం కోపం వచ్చింది. కాని ఆ సంపాదకుని అవస్థ అర్ధం చేసుకున్నాను. వంగవాసి పత్రికా ఖ్యాతిని గురించి విన్నాను. అక్కడికి వచ్చి పోయే జన ప్రవాహాన్ని కూడా చూచాను. ఆ వచ్చిపోయేవారంతా ఆయనకు పరిచితులు. వారి పత్రికకు వార్తల లోపం లేదు. ఆరోజుల్లో దక్షిణ ఆఫ్రికాను గురించి చాలామంది వినియుండలేదు కూడా. ప్రతిరోజు చాలామంది వచ్చి తమ తమ కష్టాల్ని వారికి వినిపిస్తూ వుండేవారు. ఎవరి కష్టం వారికి ముఖ్యంగదా! వచ్చిన వారంతా సంపాదకునికి ఎదురుగా కూర్చుంటారు. వాళ్లందరినీ ఊరడించడం ఎలా? వారు పత్రికా సంపాదకుని మాటకు గొప్పశక్తి కలదని భావిస్తారు. కాని గడపదాటితే తన మాట చలామణి కాదని ఆ పత్రికా సంపాదకునికి బాగా తెలుసు.

నేను అధైర్యపడలేదు. యితర పత్రిక సంపాదకుల్ని వెళ్లి కలిశాను. నా అలవాటు ప్రకారం ఆంగ్లో ఇండియన్ పత్రికా సంపాదకుల్ని కూడా కలిశాను. నేను వారితో చాలా సేపు మాట్లాడాను. నేను మాట్లాడిందంతా వారు తమ పత్రికలలో ప్రకటించారు. ఇంగ్లీషుమన్ పత్రికా సంపాదకుడు సాండర్సు గారు నన్ను తన మనిషిగా చూచుకున్నారు. తన ఆఫీసును, తన పత్రికను నా వశం చేశారు. దక్షిణ - ఆఫ్రికాను గూర్చి ప్రధాన వ్యాసాల్లో నా యిష్టం వచ్చినట్లు మార్పులు చేయుటకు అంగీకరించారు. వారికి నాకు గొప్ప స్నేహం కుదిరిందని చెప్పడం అతిశయోక్తి