పుట:సత్యశోధన.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

167

కానేరదు. వారు తమ శక్తి కొద్దీ నాకు సాయం చేస్తామని మాట యిచ్చారు. దక్షిణ - ఆఫ్రికాకు వెళ్ళిన తరువాత కూడా తమకు జాబు వ్రాయమని చెప్పారు. నాకు చేతనైనంత చేస్తాను. అని వారు మాట యిచ్చారు. తమ మాటను తుచ తప్పకుండా పాటించారు. ఆరోగ్యం చెడిపోనంతవరకు నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే వున్నారు. నా జీవితంలో అనుకోకుండా ఏర్పడిన ఇటువంటి తీయని స్నేహాలు ఎన్నో వున్నాయి. నా మాటల్లో అతిశయోక్తులు లేకపోవడం, సత్యపరాయణత్వం నిండివుండటం సాండర్సు గారి స్నేహానికి కారణం. వారు నన్ను శల్య పరీక్ష చేశారు. దక్షిణ - ఆఫ్రికాలోని తెల్లవారి దోషాలు ఖండించడంలోను, సుగుణాలు చెప్పడంలోను కూడా నేను వెనుకాడలేదని వారికి బోధపడింది.

ప్రతి పక్షికి న్యాయం చేయడం వల్ల మనం త్వరగా న్యాయం పొందగలమని నా అనుభవం చెబుతూ వున్నది. ఇట్లా తలవని తలంపుగా సాయం చేకూరడం వల్ల కలకత్తాలో కూడా సభ జరుపవచ్చుననే ఆశ కలిగింది. అందుకోసం కృషి చేస్తుండగా దర్బను నుండి ఒక టెలిగ్రాం వచ్చింది. “జనవరిలో పార్లమెంటు సమావేశం జరుగుతున్నది వెంటనే బయలుదేరి రండి” అని ఆ టెలిగ్రాంలో వుంది. ఆ కారణం వల్ల వెంటనే దక్షిణ - ఆఫ్రికా వెళ్లవలసి వున్నదని పత్రికలో ప్రకటించి కలకత్తా విడిచి పెట్టాను. మొదటి స్టీమరులో నాకు ప్రయాణ సౌకర్యం కల్పించమని దాదా అబ్దుల్లా గారి ఏజంటుకు బొంబాయికి తంతి యిచ్చాను. దాదా అబ్దుల్లా గారు “కుర్‌లేండ్” అను స్టీమరు కొన్నారు. దానిలో కిరాయి లేకుండా నన్ను నా కుటుంబ సభ్యుల్ని తీసుకు పోతామని పట్టుపట్టారు. నేను ధన్యవాదాలు చెప్పి అందుకు అంగీకరించాను. కుర్‌లేండ్‌లో నా ధర్మపత్నిని, నాయిద్దరు పిల్లల్ని కీర్తిశేషుడగు మా బావగారి కుమారుణ్ణి తీసుకొని రెండవసారి దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరాను. యీ స్టీమరుతో బాటు “నాదరీ” అను మరో స్టీమరు దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరింది. దీనికి కూడా ఏజంటు దాదా అబ్దుల్లాయే. ఈ రెండు స్టీమర్లలో మొత్తం ఎనిమిది వందల మంది యాత్రికులు వున్నారు. అంతా ట్రాన్సువాలు వెళ్లేవారే.


* * *