పుట:సత్యశోధన.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

165

మద్రాసులో స్టాండర్డు పత్రికా సంపాదకులు, కీర్తి శేషులునగు పరమేశ్వరన్ పిళ్లెగారు నాకు అక్కడ ఎంతగానో సాయం చేశారు. వారు విషయాన్ని చక్కగా చదివారు. అనేకసార్లు తమ ఆఫీసుకు నన్ను తీసుకువెళ్లారు. సలహాలు యిచ్చారు. హిందూ పత్రికాధిపతులు జి. సుబ్రహ్మణ్యంగారి దర్శనం చేసుకున్నారు. డాక్టరు సుబ్రహ్మణ్యం గారి దర్శనం, సానుభూతి లభించింది. పరమేశ్వరన్ పిళ్లెగారు తమ పత్రికల్లో వెంటనే రమ్మని పిలుపు, ఈ విషయాన్ని గురించి నా యిష్ట ప్రకారం వ్రాయుటకు అంగీకరించారు. నేను కూడా వారొసంగిన సౌకర్యాన్ని బాగానే వినియోగించుకున్నాను. సభ పచ్చయప్ప హాల్లో జరిగినట్లు డాక్టర్ సుబ్రహ్మణ్యంగారు అధ్యక్షత వహించినట్లు గుర్తు.

ఉపన్యాసం ఎక్కువగా ఇంగ్లీషులో జరిగినా, స్వగృహంలో లభించే ప్రేమ, ఉత్సాహం మద్రాసులో నాకు లభించాయి. ప్రేమ, ఛేదించలేని బంధం ఏమీ ఉండదు గదా?

29. వెంటనే బయలుదేరిరమ్మని పిలుపు

మద్రాసు నుండి కలకత్తా వెళ్లాను. కలకత్తాలో నా కష్టాలకు అంతు లేదంటే నమ్మండి. ఆచట గ్రేట్ ఈస్టరన్ హోటల్లో దిగాను. నేనక్కడ ఎవర్నీ ఎరగను. హోటల్లో డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికా ప్రతినిధి మిస్టర్ ఎల్లర్ థార్పుతో పరిచయం కలిగింది. వారి బస బెంగాల్ క్లబ్బులో. వారు నన్ను అచ్చటికి రమ్మని చెప్పారు. అచటి డ్రాయింగ్ రూములో భారతీయులకు ప్రవేశం లేదను సంగతి వారికి తెలియదు. అప్పుడే వారికి ఆ నిషేధం విషయం తెలిసింది. నన్ను వారు తమ గదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ నల్లవారి మీద తెల్లవారు చూపే ఈర్ష్యకు వారు విచారం వ్యక్తం చేశారు. నన్ను లోపలికి తీసుకొని వెళ్లజాలనందుకు క్షమించమని అన్నారు.

వంగ దైవం సురేంద్రనాధ బెనర్జీగారిని దర్శించాలి. వారి దర్శనానికి వెళ్లాను. అప్పుడు వారి చుట్టూ చాలామంది ఉన్నారు. వారు యిట్లా అన్నారు. “మీ మాట యిక్కడ ఎవ్వరూ వినరని నా భయం. మా పాట్లన్నీ మీరు చూస్తున్నారు గదా! అయినా కొద్దో గొప్పో ప్రయత్నించి చూడాలి. యిందుకు మీకు మహారాజుల మద్దతు అవసరం. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ప్రతినిధిని చూడండి రాజాసర్ ప్యారమోహన్ ముఖర్జీగారిని, మహారాజా టాగోరు గారిని కలవండి. వీరిరువురు ఉదారులు. సార్వజనిక కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటూ వుంటారు.” అని అన్నారు.