పుట:సత్యశోధన.pdf/152

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
129
 

కూడా ఇట్టి తంతినే మరొకదాన్ని పంపాము. మరో తంతి అబ్దుల్లా సేఠ్‌గారి మిత్రుడు ఎస్కాంబీగారికి పంపాము. అసెంబ్లీ ప్రెసిడెంటు మా తంతికి జవాబు పంపుతూ బిల్లుపై చర్చ రెండురోజులు ఆపబడిందని తెలియజేశాడు. అది చూచి మాకందరికీ ఆనందం కలిగింది.

శాసనసభకు పంపవలసిన పిటీషను వెంటనే తయారుచేశాము. దానికి మూడు నకళ్లు అవసరమైనాయి. పత్రికలకు పంపడానికి మరో ప్రతి కావలసి వచ్చింది. ఈ ప్రతులన్నిటిపైన వీలైనన్ని సంతకాలు చేయించాలని నిర్ణయించాం. ఇదంతా ఒక్క రాత్రిలో జరగాలి. ఇంగ్లీషు తెలిసిన స్వయం సేవకులు రాత్రంతా కూర్చొని నకళ్ళు వ్రాయసాగారు. నకళ్ళు వ్రాయడంలో మంచి నేర్పరియగు ఆర్ధర్ అను వృద్దుడు మొదటి పిటీషన్ ప్రతి సిద్ధం చేశాడు. దాన్ని ఒకరు చదువుతూ వుంటే ఒకేసారి అయిదుగురు అయిదు ప్రతులు వ్రాశారు. ఇలా అయిదు ప్రతులు తయారయ్యాయి. ఈ అర్జీ మీద అందరి సంతకాలు చేయించేందుకై చాలామంది తమ స్వంత బండ్లలోను, కిరాయిబండ్లలోను బయలుదేరి వెళ్లారు. త్వరగా యీ పని పూర్తి అయింది. వెంటనే అర్జీలు బట్వాడా చేయబడ్డాయి. పత్రికలలో సాభిప్రాయాలతో సహా అర్జీ ప్రకటించబడింది. శాసన సభలో చర్చ జరిగింది. శాసనాన్ని సమర్ధిస్తున్న వాళ్లు అర్జీ యందలి విషయాలకు సమాధానాలు యిచ్చారు. అవి కుంటి సమాధానాలు. ఏమి చెబితే ఏం? చివరికి బిల్లు ప్యాసయింది

ఇట్లా జరుగుతుందని మేము ముందే అనుకున్నాం. కాని యీ ఆందోళన నల్ల భారతీయుల్లో ఒక నూతన జీవం ఆవిర్భవించింది. మనమంతా ఒక్కటే. వ్యాపార విషయాలలో కొద్దిహక్కులు సాధించి రాజకీయంగా కూడా కొన్ని హక్కులు సాధించాలనే తహతహ భారతీయుల్లో బయలుదేరింది.

ఆ కాలంలో రిప్పన్‌గారు కాలనీల సెక్రటరీ. ఒక పెద్ద అర్జీ ఆయనకు పంపవలెనని నిర్ణయం గైకొనబడింది. అది అంత తేలికైన పనికాదు. ఒక్క రోజులో జరిగే పని కూడా కాదు. స్వచ్ఛంద సేవకులు మా దళంలో చేర్చుకోబడ్డారు. అందరూ తమకు చేతనైనంత సహాయం చేశారు.

అర్జీని తయారు చేయుటకు నేను చాలా శ్రమ పడవలసి వచ్చింది. అందుకు సంబంధించిన కాగితాలు, పుస్తకాలు పూర్తిగా చదివాను. హిందూ దేశంలో మాకు ఒక విధమైన ఓటు హక్కు వుంది కనుక నేటాలులో కూడా వోటు హక్కు ఉండితీరాలని నా వాదం. ఈ ఓటు హక్కును ఉపయోగించగల భారతీయుల జనాభా తక్కువేగనుక దాని నివ్వడం తేలికయే అని కూడా నా వాదం. ఈ విషయాన్ని మధ్య బిందువు చేశాను.