పుట:సత్యశోధన.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

అక్కడే ఉన్నాను

పదిహేను రోజుల్లో పదివేల సంతకాలు చేయించాము. ఈ విధంగా జనం చేత సంతకాలు చేయించడం స్వయం సేవకులకు క్రొత్త. వాళ్లు రాష్ట్ర మంతట తిరిగి యింతమంది చేత సంతకాలు చేయించడం చిన్న విషయం కాదు “అర్జీలో గల విషయం తెలుసుకోకుండా సంతకం చేయకూడదు” అను నిబంధన మేము పెట్టినందున అర్జీలో గల విషయాన్ని విడమర్చి చెప్పగల స్వయం సేవకులనే యీ కార్యానికి ఎన్నిక చేసి పంపవలసి వచ్చింది. అక్కడ గ్రామాలు దూర దూరాన వున్నాయి. వెళ్లి సంతకాలు చేయించాలంటే ఎంతో శ్రమపడాలి. అట్టి శ్రమకు పూనుకునే స్వయం సేవకులు లభించారు. వారంతా తమకు అప్పగించిన కార్యాన్ని ఉత్సాహంతో పూర్తిచేశారు. ఈ పంక్తులు వ్రాస్తున్నప్పుడు నా కండ్ల ఎదుట దావూద్ మహమ్మద్, సేఠ్ రుస్తుంజీ, అదంజీమియాఖాన్, ఆమోదజీవ మొదలగువారు కనబడుతున్నారు. అందరి కన్న ఎక్కువ సంతకాలు చేయించుకొని వచ్చిన దావూద్ సేఠ్ రోజంతా సంతకాల కోసం బండిలోనే ప్రయాణం చేశారు. ఇది అమూల్యమైన సేవ. దీనికోసం ఒక్కరు కూడా దమ్మిడీ పుచ్చుకోలేదు. అంతా తమ ఖర్చులు తామే భరించారు. దాదా అబ్దుల్లా గారి గృహం కార్యస్థానమే గాక ధర్మసత్రం కూడా అయింది. నాకు సహకరించిన మిత్రులందరి భోజనం వారి యింట్లోనే, మొత్తం మీద అందరూ ఎన్నో వ్యయప్రయాసలకు వోర్చి కార్యాన్ని సాధించారు.

చివరికి అర్జీ దాఖలు చేశాం. వెయ్యి ప్రతులు ముద్రించి పంచి పెట్టాం. భారతదేశ ప్రజలకు యీ దరఖాస్తు వల్ల నేటాలుతో ప్రధమ పరిచయ కలిగింది. నాకు తెలిసిన పత్రికలకు, ప్రసిద్ధులకు పత్రికా విలేఖరులకు కూడా ఆ అర్జీ ప్రతులు పంపించాను.

టైమ్సు ఆఫ్ ఇండియా పత్రిక భారతీయుల కోరికలను సమర్ధిస్తూ సంపాదకీయ వ్యాసం వ్రాసింది. ఇంగ్లాండులో అన్ని తెగల పత్రికలకు నకళ్లు పంపాం. లండన్ టైమ్సు పత్రిక కూడా మా వాదాన్ని సమర్థిస్తూ వ్రాసింది. ఇక బిల్లు మంజూరు కాదని మాకు ఆశ కలిగింది.

నేను నేటాలు నుండి కదలడానికి వీలు లేకపోయింది. భారతీయ మిత్రులంతా మీరు యిక్కడే వుండమని ప్రార్ధించారు. నాకు గల కష్టాలు వారికి వివరించి చెప్పాను. ఇతరుల ఖర్చుల మీద ఆధారపడి వుండకూడదని నిర్ణయానికి వచ్చాను. ప్రత్యేకంగా వుండడానికి ఇల్లు అవసరమని భావించాను. మంచి చోట ఒక ఇల్లు తీసుకోవాలని, బారిస్టరు హోదాకు తగినట్లుగా ఇల్లు వుండాలనీ, అప్పుడే నా సంఘానికి గౌరవం