పుట:సత్యశోధన.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

107

చేయనని నేను అబ్దుల్లా గారికి వాగ్దానం చేసి వచ్చాను. ఆదివారం గనుక ఎవ్వరినీ స్టేషనుకు పంపడానికి వీలుపడలేదని వకీలు ఆ తరువాత చెప్పాడు. అప్పుడు మాత్రం నాకేమీ తోచలేదు. ఎక్కడికి వెళ్లడం? హోటళ్లలో నన్ను ఉండనీయరు.

1893 నాటి ప్రిటోరియా స్టేషను 1914 నాటి ప్రిటోరియా స్టేషను కాదు. దీపాలు మసక మసకగా వున్నాయి. ప్రయాణీకులు కూడా ఎక్కువమంది లేరు. అందరూ వెళ్లాక టిక్కెట్టు కలెక్టరు దగ్గరకు వెళ్లి టిక్కెట్టు యిచ్చి ఎక్కడ బసచేయవచ్చునో అడుగుదామని ఆగాను. ఎక్కడా కుదరకపోతే ఆ రాత్రి రైలు స్టేషనులోనే వుందామని భావించాను. యీ విషయం అడిగితే అవమానిస్తాడేమోనని భయం పట్టుకున్నది. స్టేషను శూన్యం అయింది. చివరికి నా టిక్కెట్టు యిచ్చి అదీ యిదీ మాట్లాడసాగాను. అతడు వినయంతో సమాధానం యిచ్చాడు, కాని ప్రయోజనం శూన్యం. యింతలో మా ప్రక్కనే నిలబడియున్న ఒక అమెరికా నీగ్రో మా మాటలు విని యిలా అన్నాడు . “మీరీ వూరికి క్రొత్తవారిలా వున్నారు. యిక్కడ మీకు మిత్రులెవ్వరూ లేనట్లుంది. నాతో రండి. మిమ్ము ఒక చిన్న హోటలుకు తీసుకువెళతాను. హోటలు యజమాని అమెరికావాడు. వారిని నేను బాగా ఎరుగుదును. అతడు మీకు వసతి కల్పిస్తాడు రండి.”

ఈ పిలవని పేరంటం చూచి మొదట నేను సందేహించాను. కాని తరువాత అతనికి ధన్యవాదాలు చెప్పి అంగీకరించాను. అతడు నన్ను జాన్సటన్ గారి హోటలుకు తీసుకువెళ్లాడు. అతణ్ణి చాటుకు తీసుకుపోయి నా సంగతి చెప్పాడు. జాన్‌స్టన్ అంగీకరించాడు. కాని ఒక్క నియమం పెట్టాడు. అందరితో గాక నా భోజనం నా గదిలోనే చేయాలన్నది అతడు పెట్టిన నియమం. “నలుపు తెలుపు భేదాలు నేను పాటించను. కాని మా హోటలుకు వచ్చే వాళ్లంతా తెల్లవాళ్లే. మిమ్మల్ని వాళ్లతోబాటు కూచోబెడితే వాళ్లు అవమానంగా భావిస్తారేమో. వాళ్లు లేచిపోతారేమో. అది ప్రమాదం. అందుకని యిలా అంటున్నాను.” అని జాన్‌స్టన్ స్పష్టం చేశాడు.

“ఈ రాత్రి ఉండనిచ్చినందుకు ధన్యవాదాలు. యీదేశ పరిస్థితులు కొద్ది కొద్దిగా తెలిశాయి. మీ కష్టం ఏమిటో బోధపడింది. నాగదిలో భోజనం చేసేందుకు నాకు యిబ్బంది లేదు, రేపు మరోచోట ఏర్పాటు చేసుకుంటాను” అని అన్నాను. గది చూపించాడు. లోపలికి వెళ్లాను. ఒక్కడినే వున్నాను. ఏదో ఆలోచిస్తున్నాను. భోజనం కోసం ఎదురు చూస్తుంటే జాన్‌స్టన్ స్వయంగా వచ్చి “మిమ్మల్ని గదిలోనే భోజనం చేయమని చెప్పినందుకు విచారిస్తున్నాను. భోజనశాలకు అంతా వచ్చారు. వారితో మీ విషయం చెప్పాను. మాకేమీ అభ్యంతరం లేదని వారంతా చెప్పారు. రండి భోజనశాలలో