పుట:సత్యశోధన.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

ప్రిటోరియాలో మొదటి రోజు

తొడుక్కున్నాను, నెక్ టై కట్టుకున్నాను. టీకుటాకుగా వెళ్లి బల్లమీద “కాసు” పెట్టి టిక్కెట్టు యిమ్మని కోరాను. నా వ్యవహారం గమనించి ఆయన జాలిపడ్డాడు. “అయ్యా! నేను ట్రాన్సువాల్ నివాసిని కాను. హాలండు నివాసిని. నాకు మీరు చెప్పిన మాటలు అర్థమైనాయి. మీ ఎడ మాకు సానుభూతి వుంది. మీకు ఫస్టుక్లాసు టిక్కెట్టు యిస్తాను. కాని త్రోవలో గార్డు వచ్చి దిగిపొమ్మంటే మీరు దిగి మూడో తరగతిలో కూర్చోవాలి. అలా అయితేనే టిక్కెట్టు యిస్తాను. ఆ తరువాత మీరు రైల్వే వారి మీద దావా వేయకూడదు.” అని చెప్పి మొదటి తరగతి టిక్కెట్టు నాచేతిలో వుంచాడు. నేను ఆయనకు ధన్యావాదాలు తెలిపి మీ మాటకు బద్ధుణ్ణి అని కూడా చెప్పాను. సేఠ్ అబ్దుల్‌గనీ గారు నన్ను పంపడానికి స్వయంగా స్టేషనుకు వచ్చారు. జరిగినదంతా విని ఆశ్చర్యపడ్డారు. యిలా అన్నారు. “ఇంత వరకు బాగానే వుంది. కాని త్రోవలో గార్డు మిమ్ము చూచి దించివేస్తాడు. ఒకవేళ గార్డు దించకపోతే తోటి తెల్లజాతి ప్రయాణీకులు ఊరుకోరు. దించివేస్తారు.”

నేను మొదటి తరగతి పెట్టె ఎక్కాను. రైలు బయలుదేరింది. జర్నిస్టస్ స్టేషనులో గార్డు టిక్కెట్టు పరిశీలించేందుకై వచ్చాడు. నన్ను చూడగానే మండిపడ్డాడు. వెంటనే లేచి మూడో తరగతి పెట్టెలోకి పొమ్మని వ్రేలితో సౌంజ్ఞ చేశాడు. నేను నా టిక్కెట్టు చూపించాను. “అయితే ఏం? మూడో తరగతి పెట్టెలోకి పో” అంటూ గద్దించాడు.

ఆ పెట్టెలో ఒక్క తెల్లవాడే వున్నాడు. ఆయన గార్డును ప్రతిఘటించి “ఎందుకు పెద్ద మనిషిని బాధిస్తావు? మొదటి తరగతి టిక్కెట్టు కొన్నాడు. కనబడటం లేదా? వారి ప్రక్కన కూర్చునేందుకు నాకు యిబ్బందేమీ లేదు.” అని నావంక చూచి “అక్కడే హాయిగా కూర్చోండి” అని అన్నాడు. “కూలీతో కూర్చునేందుకు మీకే యిబ్బంది లేకపోతే నాకా యిబ్బంది!” అంటూ గొణుగుతూ గార్డు వెళ్లిపోయాడు.

రాత్రి ఎనిమిది గంటలకు రైలు ప్రిటోరియా చేరింది.

10. ప్రిటోరియాలో మొదటి రోజు

దాదా అబ్దుల్లా గారి వకీలు ప్రిటోరియా స్టేషనుకు ఎవరినైనా పంపి నన్ను తీసుకు వెళతారని భావించాను. నన్ను కలుసుకునేందుకు యితర భారతీయులెవ్వరూ రారని నాకు తెలుసు. ఎందుకనగా ప్రిటోరియాలో భారతీయుల యింట్లో బస