పుట:సత్యభామాసాంత్వనము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

11

     సమ్ముఖమ్ముఁ జేరఁ గ్రమ్ము కలభమ్ముల కాంచనఘంటికాఘణఘణమ్ము
     లును, తనయెదుట వేషధారులై వచ్చు శైలూషుల వినర్దమానమర్దల
     తాళసముత్తాలధణంధణంబులును గ్రందుకొన నందు.

మ. హితులున్ రాజు లమాత్యు లూడిగములుం హేజీబు లార్యుల్ పురో
     హితులున్ జ్యౌతిషికుల్ నటుల్ భటులు సాహిత్యప్రవీణుల్ కవుల్
     మతిమంతుల్ జయకాళ్లు పాఠకజనుల్ మాష్టీలు వజ్రీలు నూ
     ర్జితభక్తిం గొలువన్ మహావిభవముల్ చెల్వొంద నందంబుగాన్.

సీ. నునుసరిగెనకసీపని సూరెపుటపు మి
                    న్నలు గ్రమ్ముసమ్మాళిగలను జిమ్మి
     చే నున్ననున్నని చికిలిపైఁడి మొలామ
                    చికటారి సుడిగమ్ము చేతి కొసఁగి
     మ్రోలఁ జిత్తరుపటంబునఁ బొల్చు శ్రీరాము
                    చరణాబ్జములకు నంజలి ఘటించి
     బాలీసుబటువులు క్కదిళ్లును మేలు
                    కట్టుపూజల్లులఁ గలయఁ జూచి
తే. స్తోమముగ పైఁడిపావడల్ చామరమ్ము
     లాడ జిగినింపు రతనంపుటరిదికట్టు
     గద్దెపై నంత ముద్దులళ్ఘరివిభుండు
     నిండుకొలువుండెఁ గన్నులపండు వమర.

శా. ఆరీతిన్ సభ ముద్దులళ్ఘరిధరాధ్యక్షుండు కొల్వుండి తా
     హేరాళంబుగ నయ్యెడన్ నడుచు సాహిత్యప్రసంగంబు గం
     భీరప్రౌఢిమ మించ నన్ బిలిచి నెమ్మిం బల్కె వీణాకన
     ద్గౌరీపాణి సువర్ణకంకణఝణత్కారానుబంధోక్తులన్.

చ. అనువుగ రుక్మిణీపరిణయంబును మున్ హవణించి యార్యు లౌ
     ననఁ దనియించినావు మము నప్రతిమంబుగ నవ్యకావ్యమిం
     పున రచియించుమీ సొగసు పోఁడిమి మీఱఁగ సత్యభామసాం
     త్వన మనఁ గప్పురంపుచలువన్ గెలువన్ దిరుకామసత్కవీ.