పుట:సత్యభామాసాంత్వనము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

సత్యభామాసాంత్వనము

     నిరూఢవిటపివిటపాఢౌకమానబాలప్రవాళజాలలీలం దెలుప వేడుకల
     నీను వైడూర్యంపుపొడి జిగి బెడగగు నిడుదపొడి పనినడరుకొడిగె తుదిమొద
     లుకడానిగంటలపలుకు నిగుడ నికటతటమృగయావిధానసావధానకిరాత
     వరారోహకరాష్టధనుష్టంకారంబుల యలంకారంబు నెరప, నారాడ
     నెసంగు నింగిలీకపుగచ్చు హెచ్చుగోడల నీడలరంగు మీఱు నేకరంగీపట్టు
     మేల్ కట్టుబిగిలింత నిరంతరవిహరమాణైరావణకరవిధూతకటకతట
     భాసమానకాసారసారసపరాగభరంబులు తిరంబు గొలుపఁ గదుపులు
     గొని యుదుటవన్నెల ముంగిటనుండు వేదండమండలంబు లున్నతశృంగ
     రంగత్తరంగితసంచారనీరదబృందంబులయందంబు జూప నొయ్యనొయ్యన
     మవ్వంపు లాగడంపు సోరణగండ్లగొండ్లి సలుపు జాళువాకీలుబొమ్మల
     యొరపు కుసుమశరసాంపరాయసంపద్యమానచాతుర్యధుర్యకిన్నరదంపతీ
     విలాసంబులు మెలయింప నుదయధరాధరంబు విధంబున డంబు మీఱి
     మెఱయు నమరావతి గతి నాకిలితసుమనస్సంతానసురభియు, రామవన
     ప్రస్థానంబుగతి చిత్రకూటస్థిత్యభిరామంబును, చంద్రమండలంబు
     బాగున సుధాధవళతంబును, రావణసైన్యంబు వడువున నతికాయమా
     నాశ్రయంబును సుగ్రీవసమ్ముఖంబుడంబున నవారితసంచారమారుత
     కిశోరనీలగవాక్షకుముదాభిరామంబును, సుధర్మాస్థానంబు చందంబున
     రంభావిరాజమానంబును, శుక్రసదనంబు[1]ఠేవ నగురువాసనావాసితంబును,
     నగుకొలువుకూటంబున బాలసూర్యునింబలెఁ జేరి తనకు మేలు గోరు
     ధరణీసురుల మంగళాశీర్వాదంబులును, తవకుఁ బరాకు దెలిపి బరాబరి
     సేయ సంభ్రమించు కంచుకివ్యూహంబుల సాహోనినాదంబును, తన
     ముఖసందర్శనంబునకు సందడించు సామంతధరణీకాంతుల మిథస్సంఘృష్ట
     మణిమకుటవిటంకటంకారంబులును, తన గెలుపుపద్యంబు లుగ్గడించు
     వందిబృందంబుల విజయహోంకారంబులును, తన చరణారవిందవందనము
     లకు ముందుముందుగా సాగలి దండంబిడు [2]గిరువులున్న చెండి మన్ని
     కొమాళ్ళ కలకలంబులును, తన నవ్వుపువ్వుసోనలకు మవ్వంబు నివ్వటిల్లఁ
     గొలువు మ్రొక్కులు ఘటించు వారవనితల కిలకిలల యలబలంబును, తన

  1. వగను
  2. గిరువులును