ఆర్షభూగోళము
భూమధ్య రేఖమీదుగా పోవును. ఈ రేఖకు ఉత్తరమున నున్న భాగమునకు సౌమ్యగోళమని పేరు. దక్షిణమున నున్న భాగమునకు యామ్యగోళమని పేరు. సౌమ్యగోళ మంతయు జంబూ ద్వీపము.
భూమధ్య వలయ రేఖకు విషువన్మండల రేఖయని పేరు. ఈ రేఖమీద లంక కలదు. ఇది నేటి సింహళము కాదు. ఏనాడో లవణ సముద్రములో మునిగిపోయినదీ లంక. ఉజ్జయిని నుండి ఒక లంబరేఖ గీచినచో అది నిరక్షరేఖ నంటి యున్న యీ లంకనుతాకును. ఈ రేఖ మీదనే లంకకు తూర్పున యమ(వ)కోటియను పత్తనము గలదు. లంక కును యమ (వ) కోటికిని 1265 యోజనముల దవ్వు (వృ. వ. సిద్ధాంతము). ఇది భూమి యడ్డు కొలతలో నాలుగవ వంతు. యమ (వ) కోటికి తూర్పుగా 1265 యోజనముల దూరమున ఆ రేఖమీదనే సిద్ధ పురి యున్నది. అటనుండి ఆరేఖ మీదనే రోమకము అను ప త్త న ము గలదు. ఈ నాలుగుపత్తనములకును సుమేరు 'కుమేరువులు 1265 యోజనముల దూరముననే యున్నవి. నిరక్ష దేశముననుండు వారికి రెండు మేరువులును, రెండు ధ్రువములును క్షితిజమున కనిపించును.
యామ్య గోళము :- భూగోళమధ్య వలయమునకు దక్షిణమున లవణ సముద్ర మున్నది. ఆటనుండి యొక దానికొకటి దక్షిణముగా (1) క్షీర (2) దధి (3) ఘృత, (4) ఇక్షురస (5) మద్య (6) స్వాదునీర సముద్రములు గలవు. ఈ లవణ సముద్రమున కొకదాని కొకటి దక్షిణముగా (1) శాక (2) శాల్మల (3) కుశ (4) క్రౌంచ్ (5) గోమేధ (6) పుష్కరము లను ఆరు ద్వీపములు గలవు. ఈ యారు ద్వీపములును, లవణ సముద్రమునకు ఉత్తరముగా నున్న జంబూ ద్వీపమును గలిసి యేడు ద్వీపములు. కావుననే 'సప్త ద్వీపా వసుంధరా' అను సూక్తి సరియగుచున్నది.
కొన్ని పురాణములలో ప్లక్ష, శాల్మల, కుళ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపము లొకదాని కొకటి దక్షిణముగా నున్నవని కలదు. మరికొన్ని పురాణములలో నివి కొంత వ్యత్యస్తముగా నున్నవి. యోగసూత్ర భాష్యములో శ్రీ వ్యాసులు శాక, కుశ, క్రౌంచ, శాల్మల, మగధ(గోమేధ), పుష్కర ద్వీపములను చెప్పిరి.
యామ్య గోళము నందిపుడు మనకు ఆస్ట్రేలియా యును, ఆఫ్రికాలో కొంత భాగమును, అమెరికాలో సగభాగమును కానిపించు చున్నవి. మలయా మొదలగునవి భరత వర్షమున అనుద్వీపములని పురాణములలో గలదు. ఈ యామ్య గోళము నందు ఈ ద్వీప షట్కము లోని కొంత భూమి మునిగిపోయి యుండును. అట్లే జంబూ ద్వీపమునందును కొంత భూమి మునిగి యచట సముద్రము లేర్పడి యుండును.
కుల పర్వతములు :- భారత వర్షములో మహేంద్రః మలయ, సహ్య, శక్తి మత్, ఋక్ష, వింధ్యః, పారియాత్రము అను ఏడు కులపర్వతము లున్నవని వాయు పురాణము పేర్కొన్నది (57 అధ్యాయము). ఉత్తరమున గంగ పుట్టిన చోటినుండి దక్షిణమున కన్యాకుమారి వరకును వేయి యోజనములు వ్యాపించియున్న భూమినే భారత వర్షము లేక భరత ఖండము అనిరి.