ఆయుర్వేద ధర్మములు
4. "ద్వౌ కాలా వుపస్పృశేత్." దినమును ఉదయ సాయంకాలముల యందు రెండు వేళలను స్నానము చేయ వలయును.
5. “మలాయ నేష్వభీక్షం పాదయో శ్చ వై తుల్య మాదఛ్యాత్.” చంకలు, గజ్జలు, మున్నగు సంధులయంధును, పాదములయందును మలినము (మురికి) చేరనీయక శుభ్రముగా నుంచుకొనవలయును.
6. "త్రిఃపక్షస్య కేశ శ్మశ్రు లోమ నఖాన్ సంహార యేత్" ఐదు దినముల కొకసారి క్షారము చేయించు కొనవలయును.
7. “నిత్య మనుపహాతవాసా స్సుమనా స్సుగంధి స్యాత్." ప్రతిదినము ఉదికిన బట్టలను, సుగంధ ద్రవ్యములను ధరించి ప్రసన్నాత్ముడై యుండవలెను.
8. "సాధు వేషః." సభ్యతను తెలియ జేయు ఉడుపులను ధరించవలెను. “వస్త్రేణ వపుషా వాచా" యన్నట్లు తన మంచి నడవడికను తెలుపునట్టి అలంకారము కల్గియుండవలెనని భావము.
9. "ప్రసాధిత కేశః.” తల శుభ్రముగా దువ్వుకొని యుండవలయును, చింపితలగా వెండ్రుకలు చిక్కు పరచుకొని యుండరాదు.
10. “మూర్ధ శ్రోత్ర ఘ్రాణ పాద తైలనిత్యః" ప్రతి దినము తలకు నూనె రాచుకొనవలయును. చెవులలోను ముక్కులలోను తైలము వేసికొనవలెను. అరికాళ్ళకు తైలము రాచుకొనవలయును.
11. “పూర్వాభిభాషీ." పూజ్యులగు పెద్దలను (సకల జనులను) చూచినపుడు తానుగానే ముందు పలుకరించ వలయును.
12, “సుముఖః." సర్వదా ప్రసన్న వదనుడై యుండవలయును.
13. "దుర్గే ష్వభ్యుపపత్తా.” ఆపదలలో చిక్కినప్పుడు సమయోచిత ప్రజ్ఞచే చిక్కులను తప్పించుకొనునట్టి ధైర్యము గలిగి యుండవలయును,
14. "హోతా." హవిరాదులచే అగ్నిని ఆరాధించ వలయును.
15. “యష్టా" దేశ క్షేమంకరము లగు యజ్ఞముల నొనర్పవలయును.
16. “దాతా.” కలకొలది దానధర్మములను చేయ వలయును.
17. "చతుష్పథానాం నమస్కర్తా." నాలుగు త్రోవలు కలియు ప్రదేశములందు, సావధానుడై నమస్కారము చేయ వలయును.
18. “బలీనా ముపహర్తా." బలి మంగళ పూజాదులచే దేవతల నారాధించవలయును.
19. “అతిథీ నాం పూజకః." అతిథులు నర్చించవలయును.
20. "పితౄణాం పిణ్ణదః.” పితరులకు ఇష్టమృష్టాన్నము లోసంగ వలయును.
21. "కాలే హిత మిత మధురార్ధ వాది." సమయము ననుసరించి హితముగను, మితముగను, సంతోషకరము గను మాట్లాడవలయును.
22. "ధూమపః." సుగంధ ద్రవ్యములచే ధూమ విర ప్రకారము పొగపీల్చవలయును.
23. “వశ్యాత్మా,” వశీకృత చిత్తుడై యుండవలయును.
24. “ధర్మాత్మా.” నియత కర్మాచరణము కలిగి యుండ వలయును.
25. " హేతా వీర్షుః." కార్యసాధన (హేతువు) యందు పట్టుదల కలిగియుండవలయును.
26. “ఫలే నేర్షుః.” ఒకనికి కలిగిన ఫలమందు అసూయ పడరాదు.
27. “నిశ్చింతః - నిశ్చితః." ఎల్లప్పుడు విచారము చేయకూడదు, లేక సంశయరహితమైన ఆత్మ కలిగియుండ వలయును.
28, "నిర్భీకః." భయరహితుడై యుండవలయును
29. "ధీమాన్." వివేక వంతమగు బుద్ధికలిగి యుండవలెను.
30. "హ్రీమాన్." పనికిరాని చెడ్డపనులు చేయుటలొ లజ్జితుడై యుండవలెను. (చేయరాదు)
31. “మహోత్సాహః." మంచిపనులు చేయుటలొ ముందంజ వేయువాడై యుండవలయును.
32. “దక్ష." క్రియా నిర్వహణ సమర్థుడై యుండ వలయును.
33. “క్షమావాన్," ఓరిమి కలవాడై యుండ వలయును.