Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/830

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయుర్వేద గ్రంథములు


కౌమారభృత్యతంత్రములు :- శిశువుల సంరక్షణమును బోధించు తంత్రములకు కౌమారభృత్యతంత్రము లని పేరు.

జీవకతంత్రము ; పార్వతకతంత్రము ;బంధక తంత్రము:- ఈ మూడు తంత్రములు పూర్వకాలమున ప్రసిద్ధిగ నుండెనని డల్హణుడు సుశ్రుత సంహిత ఉత్తర స్థానములో నుదహరించి యుండెను. కానీ యివి ఇపుడు నామమాత్రావశిష్టములు.

కుమారతంత్రము :- చక్రపాణిచే భానుమతి యను. సుశ్రుత వ్యాఖ్యలో దీని పాఠములు ఉద్దరింపబడినవి. కాని దీని కర్త యెవరో తెలియదు. ఇది ప్రస్తుతము దుర్లభము.

హిరణ్యాక్షతంత్రము :- మాధవనిదాన వ్యాఖ్యలో శ్రీకంఠుడు దీనిపాఠము సుద్దరించెను. దీనినే కొందరు కుమారతంత్రము అందురు. దుర్లభము.

గ్రహచికిత్స :- భూతవిద్యా తంత్రములు ప్రస్తుతకాలమున లుప్తప్రాయముగ నున్నవి. చరకుని కాలమున వీటిని ఉన్మాదాది మానసికరోగముల చికిత్సలలో కొద్దిగ వర్ణించి యున్నారు. ఈ తంత్రములు ప్రస్తుతము దొరకుట లేదు.

అగదతంత్రములు :- స్థావర, జంగమ, కృత్రిమ విషముల స్వరూప, లక్షణ, చికిత్సలను బోధించునవి అగదతంత్రము లని చెప్పబడును. కాశ్యపాదులు వీని ప్రవర్తకులు.

కాశ్యపసంహిత :- డల్హణ, చక్రపాణి, శ్రీకంఠాది వ్యాఖ్యాతలచే నీ తంత్రవచనములు ప్రమాణముగా నుద్ధరింపబడినవి.

ఆలంబాయనసంహిత:- మాధవనిదాన టికలో విషాధికారమున శ్రీకంఠుడు దీని యుద్ధారము నుదహరించెను. దుర్లభము.

ఉశనస్సంహిత :- దీని రచయిత శుక్రాచార్యులని వృద్ధవైద్యులు చెప్పుదురు. శుక్రాచార్య మతానుయాయి యగు కౌటిల్యుడు, తన యర్థశాస్త్రమున కంటక శోధ నాధికరణమున విషాది ప్రతీకారోపదేశము, ఆశుమృతక పరీక్ష యనువాటిని చూపుటచే ఈ సంహిత యున్నట్లు తర్కింపబడుచున్నది.

సనకసంహిత :- దీనికే శౌనక సంహిత యని పేరు కూడ కలదు. ఇది మిక్కిలి ప్రాచీనమైనది. ఇది అరబ్బీ భాషలోనికి తర్జుమా చేయబడినది. ఈ భాషాంతరీకృత గ్రంథములోనున్న విషయములు చరక, సుశ్రుతాది గ్రంథములలో నున్న విషాధికారమునందలి యంశములకు సరిపోవుచున్నట్లు ప్రపుల్ల చంద్ర రాయ్ గారు తమ భారతీయ రసాయనశా స్త్రేతిహాసమున వ్రాసియున్నారు. దీని అరబ్బీ భాషానువాదము లభ్యము.

లాట్యాయనసంహిత :- సుశ్రుతకల్ప స్థానములో డల్హణుడు దీని పాఠములను ఉద్ధరించెను. దుర్లభము.

రసాయన వాజీకరణతంత్రములు:- రసాయన వాజీకరణ తంత్రములలో రసాయనతంత్ర మనునది శరీరము నందు శ్రేష్ఠమగు సప్తధాతు సముదాయము నభివృద్ధి నందించు నుపాయములను బోధించునది యనియును, వ్యాధులను నశింపచేయు నుపాయములను బోధించునది యనియును వ్యవహరించుచున్నారు. చరకాదులు రసాయన సేవా విధానమును, మూలికా ప్రధానమైన రసాయ నౌషధ యోగములను, ఉపదేశించియున్నారు. ఈ రసాయన తంత్రమునకే రసతంత్రమనికూడ వ్యవహారము. ఈ వైద్యులకు రాసాయనికు లని పేరు. దీని ప్రవర్తకులు మహేశ్వర, నాగార్జు నాదులు, వాజీకరణతంత్ర మనునది శుక్రదోషములను పోగొట్టి సత్సంతానముకల్గు నుపాయములను బోధించును. ఈ వైద్యులకు వాజీకరణికు అని పేరు. దీని ప్రవర్తకులు బాభ్రవ్య, కుచుమార, వాత్స్యాయ నాదులు.

రసాయనతంత్రములు; పాతంజలతంత్రము - శివ దాసాది వ్యాఖ్యాతలచే దీని పాఠములు ఉద్ధృతము లైనవి. ఇది దుర్లభము. . వ్యాడితంత్రము; వాసిష్ఠతంత్రము: మాండవ్యతంత్రము. ఇవి మూడును మిక్కిలి ప్రాచీనములైనవి. ఇపుడు దుర్లభములు.

నాగార్జునతంత్రము :- ఈ గ్రంథకర్త మహర్షి యని కొందరు, బౌద్ధపండితు డని కొందరు చెప్పుచున్నారు. కొందరీ నాగార్జునతంత్రమనగా నాగార్జున ప్రణీతమగు రసరత్నాకరమనుచున్నారు. ఇది దుర్లభము. ఈ నాగార్జునుడే కక్షపుటతంత్రము, ఆరోగ్యమంజరి యను మరి