ఆయుర్వేద గ్రంథములు
ప్రవర్తకుడు ధన్వంతరి. ఇతని విషయమును గూర్చి లోగడ వర్ణింపబడియున్నది.
సౌశ్రుతతంత్రము :- దీనికి వృద్ధసుశ్రుత సంహిత అని పేరు. ఇది మనకు ఉపలభ్యమానమగు సుశ్రుత సంహితకు మూలమని తెలియుచున్నది. ఇది ప్రస్తుతము దొరకుట లేదు.
సుశ్రుతసంహిత :- దీనినిగూర్చి లోగడ వర్ణింపబడి యున్నది.
ఔపధేనవతంత్రము; ఔరభ్రతంత్రము :- ఇవి రెండును నామమాత్రావశిష్టములు. సుశ్రుత వ్యాఖ్యాతయగు డల్హనుడు తన వాఖ్యానములో నొకటి రెండుచోట్ల వీనిని స్మరించెను.
పౌష్కలావతతంత్రము :- చక్రపాణి యనునాతడు భానుమతి యను తన సుశ్రుత వ్యాఖ్యలో దీని నుదహరించి యున్నాడు. ఇది దుర్లభము.
వైతరణతంత్రము :- ప్రాచీన వ్యాఖ్యలలో దీని యుద్దారములు కానవచ్చుచున్నవి. కాని యిది దుర్లభము.
భోజతంత్రము :- దీనినే భోజ సంహిత యందురు. ఈ సంహితాకారుడగు భోజుడు, సుశ్రుతునికి సమకాలికుడగు ఋషియని డల్హణుడు తన వ్యాఖ్యలో వ్రాసి యున్నాడు. వీనికి వృద్ధభోజుడని గూడ వ్యవహారము కలదు. ఇది చాల ప్రమాణ గ్రంథము. దీని ప్రమాణము ననేక వ్యాఖ్యాతలు ఉల్లేఖించిరి.
కరవీర్యతంత్రము :- దీనిని వాఖ్యాత లరుదుగ వాడి యున్నారు. వారి కాలమునకే యిది లభ్యము కాలేదని తోచుచున్నది.
గోపురరక్షితతంత్రము:- ఇదియు నామమాత్రావ శేషముగనే యున్నది.
భాలుకితంత్రము :- ఇదియును వ్యాఖ్యాతలచే అరుదుగ స్మరింపబడుచున్నది. విజయ రక్షితుడు ఈతంత్రము నుండి జ్వర ప్రకరణములో కొన్ని శ్లోకములను ఉదాహరించియున్నాడు. ఇది దుర్లభము.
కపిలతంత్రము; గౌతమతంత్రము: ఈ రెండుగూడ దుర్లభములే. వీనియందలి వచనము అచ్చటచ్చట వ్యాఖ్యానములలో కానవచ్చుచున్నవి.
శాలాక్య తంత్రములు:- ఊర్ధ్వాంగ చికిత్సలను బోధించు తంత్రమునకు శాలాక్యతంత్రమని పేరు. శలాకలతో నిది నిర్వర్తింప బడునుగాన శాలాక్యమని పేరుకల్గినది. దీనిని నిమిసాంప్రదాయ మనియెదరు. ఈ వైద్యులకు శాలాకిను అని పేరు. ఈ తంత్ర ప్రవర్తకులు కాంకాయన, గార్గ్య, గాలవ ప్రభృతులు.
విదేహతంత్రము :- ఇదియును సుశ్రుతము వలెనే సర్వాంగములతో కూడిన గొప్ప తంత్రము. ఇందు నేత్రము, శ్రోత్రము మొ. ఊర్ధ్వాంగ జనిత రోగ చికిత్స ముఖ్యముగా నున్నది. ఇదియును ప్రస్తుతము దుర్లభము. వ్యాఖ్యాతలచే చాల ప్రమాణ గ్రంథముగా గౌరవింపబడు చుండెను.
నిమితంత్రము :- ఇది మరియొక శాలాక్య తంత్రము ఇదియును దుర్లభము.
కాంకాయనతంత్రము :- ఈ తంత్రకారుడు బాహ్లిక దేశస్థుడని మాత్రము తెలియుచున్నది. ఇదియును దొరకుటలేదు.
గార్ద్యతంత్రము; గాలవతంత్రము :- డల్హణ వ్యాఖ్యలో ఈ తంత్రముల నామములు మాత్రము స్మరింపబడినవి. కాని లభ్యమగుట లేదు.
సాత్యకి తంత్రము :- ఇది అరుదుగా వ్యాఖ్యాతలచే స్మరింపబడినది; దుర్లభము,
శౌనకతంత్రము :- దీని పాఠములు డల్హణ, చక్రపాణి, దత్తులచే బహుప్రదేశములందు గ్రహింపబడినవి. సర్వాంగ పూర్ణమైన గొప్పగ్రంథము. ప్రస్తుతము లభ్యముకాదు.
మద్రశౌనకతంత్రము :- ఇది శాలాక్యతంత్ర భాగము మాత్రము గలిగియున్నది. దీనిని మదశౌనక తంత్ర మనియు వ్యవహరింతురు. దుర్లభము.
కరాళతంత్రము :- ఇది కరాళభట్టుచే రచింపబడినది. ఇది ఆర్షము కాకపోయినను అతిప్రాచీన మగుటచే నిట నుదహరింపబడినది. ఇదియును దుర్లభము.
చక్షుష్యతంత్రము :- దీనిని చక్షు షేణ్య తంత్రమనియు అందురు.
కృష్ణాత్రేయతంత్రము :- కృష్ణాత్రేయుడన్నను, పునర్వసురాత్రేయుడన్నను ఒక వ్యక్తియే యని కొందరు, భిన్నులని కొందరును చెప్పుచున్నారు. ఇదియు దుర్లభము.