ఆఫ్రికా ఖండపు భాషలు
లోను ఒక దానినుండి మరొకదానిలోనికి మార్పును సూచించుచున్నవి.
మధ్యటోగో (Middle Togo) వర్గము: ఇవి చాల వరకును 7°-8° అక్షాంశముల మధ్య ఉన్నవి. వీనిలో కొన్ని అంతరించీ 'యు' (Ewe) 'ఆ కాన్' (Akan) భాషలలో లీనమగుచున్నవి. ఇవి (1), (4) వర్గముల మధ్యనుండి వానితో సుస్పష్ట సంబంధములు కల్గియున్నవి.
4. గుర్-గూర్ భాషలు (Gur-Goor) :- ఇవరీ గోల్డ్ కొస్ట్, టోగో, దహోంల ఉత్తరభాగము నందును; హౌటివోల్టా (Houti Volta) పరిసరములయందును; ఈ భాషలు మాటాడబడుచున్నవి. ఇవి తిరిగి ఎనిమిది అంతర్విభాగములుగా చేయబడినవి.
5. పడమటి అట్లాంటిక్ భాషలు:- సెనిగాల్ - అట్లాంటిక్ లమధ్య కొంత భాగములో ఇవి మాటాడబడుచున్నవి. ఇవి తిరిగి (ఏడు) అంతర్విభాగములుగా చేయనగును.
6. మాడిన్గో, లేక మన్డీ భాషలు : పడమటి సూడాన్ లో నున్న ఈ భాషలు 4,5 వర్గములమధ్య నున్నవి. ఇవి తిరిగి రెండు అంతర్విభాగములుగా చేయబడినవి.
III బంటు భాషలు :- ఇవి ఆఫ్రికాఖండపు దక్షిణార్ధ భాగమున మాటాడబడుచున్నవి. ఇవి సన్నిహిత బాం ధవ్యములు పరస్పరమును గల కుటుంబమై సుస్పష్ట లక్షణములను కలిగి యున్నవి. ముందు చేర్చబడు ఉపసర్గలచే (Prefixes) నామవాచకములు జాతి భేద మేర్పరుచుట వీనినిర్మాణములో ప్రధాన లక్షణముగా ఉన్నది. సూడాసిక్ భాషలలో ఈ లక్షణము కనబడుచున్నను, బంటు భాషలలో ఇది అధికతర వికాసదశను పొందియున్నది. ఈ ఉపసర్గలు బహువచనములను గూడ ఏర్పరుచును. ఉ॥ స్వాహిల్లీ భాష (Swahilli) లో :- కి - సు. కి హల్లీ కి -మోజా కి -మే పొటియా". (ఒక పదునైన కత్తి పోయినది) 'సు' అనగా కత్తి; 'కి' దానికి వర్గోపసర్గ ఇది ' - సు' తో సంబంధించి యున్న ప్రతి పదమునకు ముందుగా వచ్చుచుండును, 'కి' కి సంబంధించిన బహు వచనోపసర్గ 'వి'. ఇట్లు వెనుక వాక్యము బహువచన రూపములో ఇట్లుండును. “వి - సు వి - కాలీ వి - నానే-వి - మే పొటియా' (= ఎనిమిది పదునైన కత్తులు పోయినవి.) టర్కీ కోళ్ళ 'కటుక్కు' మను కంఠధ్వనులును (Lateral Sounds) కొన్ని దక్షిణ ఆఫ్రికా భాషలలో కనబడు చున్నవి. స్వరభేద మంత ముఖ్యముకాదు. 'ఒత్తుడు' (Stress) సూడానిక్ భాషలలోకంటే అభివృద్ధి చేయబడినది. రెండు వర్ణములుగల ధాతువులు విస్తారముగా ఉన్నవి. వ్యాకరణ `సంబంధమగు లింగములేదు. విభక్తి ప్రత్యయములవలని మార్పులులేవు. క్రియకు అనేకములగు వ్యుత్పత్తి రూపములున్నవి. ఇందుచే ఒక విషయమును వెల్లడించుటలో వైవిధ్యమున కవకాశము కలుగుచున్నది.
హాంబర్గర్ (Homburger) ఈ భాషలను పది వర్గములుగా విడదీసి యున్నాడు:
(1) దక్షిణ లేక గండావర్గము (2) రు ఆన్డా (Ruanda) వర్గము (3) ఈశాన్య లేక కిలిమంజార్ వర్గము (4).తూర్పుతీరపు ఉత్తరవర్గము (5) కాగురుకొండె, యాఓ మొ॥ భాషలు (6) ఆగ్నేయవర్గము (7) జులూవర్గము (8-a) మధ్యవర్గము (8-b) పడమటివర్గము (9) కాంగో వర్గము (10) వాయవ్య వర్గము.
IV సెమిటిక్ వర్గము :- దక్షిణ అరేబియానుండి వచ్చిన వలసప్రభావముచే కాబోలు ఈ భాషలు అబిసీనియాలో మాటాడబడుచున్నవి. అబిసీనియా ప్రాచీన భాషయగు గీజ్ (geez) నశించినది. దీనినుండి ఏర్పడిన 'టైగ్రీ' (Tigre) ఎఱ్ఱసముద్ర రాష్ట్రములో మాటాడబడుచున్నది. 'ఆమ్ హారిక్' గీజ్ యొక్క నేటి కాలమునకు అవశేషముగా నున్న అబిసీనియాలోని ప్రాచీన లిఖిత భాష. ఇందుండి ఏర్పడిన రెండుభాషలు గురాగ్ (Gurague), హరార్ (Harar) అరబిక్ భాష ఈ వర్గ భాషలలో ముఖ్యమైనది. ఉత్తర ఆఫ్రికా, తూర్పు సూడాన్ భాగములందు ఇది ముఖ్యభాష. ఇస్లాం ప్రభావముచే తూర్పు ఆఫ్రికా, సూడాన్ లలో ఇది వాఙ్మయ వ్యక్తీకరణ గల భాషయై యున్నది.
V హెమిటిక్ వర్గము :- సెమిటిక్ భాషలతో తక్కిన ఆఫ్రికాభాషలకంటే ఈ వర్గభాషలు దగ్గర సంబంధమును కలిగియున్నవి. అరబిక్ భాషాజన్యములని ఈ హెమిటిక్, సెమిటిక్ భాషలు భావింపబడుచున్నవి. "హెమిటో- సెమిటిక్" అని ఈ రెండు వర్గముల యొక్కయు మూల భాష పేర్కొనబడుచున్నది.