Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/816

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఫ్రికా ఖండపు భాషలు


వర్గములు పరిశీలన : పై నుదాహరింపబడిన ఐదు ప్రధాన వర్గముల వివరములను ఇప్పుడు సంక్షిప్తముగా పరిశీలింతము :

I బుష్ మన్ వర్గము : ఈ భాషలను తిరిగి మూడు అంతర్విభాగములుగా చేయనగును :

(i) దాక్షిణాత్యము. (ii) మాధ్యమికము, (iii) ఉత్తర దేశీయము.

1. ధ్వనివిషయములో ఈ భాషలు టర్కీ కోళ్ళ 'కటుక్కు” మను ధ్వనుల (Clicks లేక Clucks) ఎక్కువగా కలిగియుండును.

2. స్వరభేదము (Intonation) : ఈ భాషలకు మరొక లక్షణము.

ఈ లక్షణము 'హాటెస్టాట్', 'సూడానిక్' బంటు భాషలలోకూడ సామాన్యముగా కనిపించుచున్నది. ఒక మారుచ్చరింపదగిన అక్షర సముదాయము (Syllable) ను, ఒక్కొక్కప్పుడు ఒకే ధ్వనిగల హల్లును గూడ స్వర భేదమును కలిగియుండును. పదమునకు ధ్వని యెంత ముఖ్యమో ఈ స్వర భేదముకూడ అంత ముఖ్యమైయుండును, ధ్వనులు ఒకేవిధముగానున్న పదము స్వరభేదములు కలిగియుండుటచే ఒక దానితో నొకటి వ్యుత్పత్తి బాంధవ్యము లేమాత్రమును కల్గియుండని క్రొత్తపదములుగా మారును.

బుష్ మన్ భాషల యొక్క అనేక లక్షణములు సూడానిక్ భాషలకు కూడ సామాన్యములై కనబడుచున్నవి. ఇవి : (1) స్వరభేదము (2) ఏకోచ్చారణ వర్ణత్వము (Mono-syllabism) (3) క్రియకును, నామవాచకమునకును రూపభేదము లేకుండుట (4) షష్ఠీ విభక్తి ప్రత్యయము యొక్క స్థానము (5) “వారు" ఉపయోగించి బహువచన రూపము నేర్పరుచుట.

అయినను వ్యుత్పత్తి సంబంధములగు బాంధవ్యము లింతవరకును కల్గొనబడకపోవుటచే బుష్ మన్, సూడాన్ భాష లొకే కుటుంబమునకు చెందినవని చెప్పుట కింకను మనకు తగిన ఆధారము లభింపలేదు.

పిగ్మీభాషలనుగూర్చి మనకు తగిన పరిజ్ఞానము లేదు. అందుచే వీనిని గూర్చి చెప్పుటకు మనకు వివరములు లేవు. అన్నిచోట్లను వారు పొరుగుననున్న నీగ్రో భాషను స్వీకరించి యున్నారు.

II సూడానిక్ వర్గము  :- అట్లాంటిక్ మహాసముద్ర తీరమున ఉన్న 'సెనగాంబియా కేమరూన్సు' నుండి అబి సీనియా పడమటి పీఠభూముల వరకును ఈ భాషలు మాట్లాడబడుచున్నవి.

ఉత్తరమున 'నూబా' (Nuba), 'కునామా' యును, తూర్పు ఆఫ్రికాలో గయా, నీఫా కవిరాన్డో (Nyifwa-Kavirondo) యును పై ప్రదేశములో ఈ భాషలు మాటాడబడని తావులు.

బంటువర్గమువలె ఈ వర్గపు భాషలు అన్యోన్యము, దగ్గరసంబంధము గలవిగా లేవు. ఇందలి కొన్ని భాషలు మిక్కిలి భేదభావమును ప్రదర్శించుచున్నవి.

సూడాన్ అత్యంత ప్రాచీనకాలము నుండియు ఉత్తరము, తూర్పు దిక్కులనుండి దండయాత్రలకు గురియై యుండెను. అందుచే నేటి భాషా పరిస్థితులు ఎడ తెగని యీ కదలిక, మార్పుల యొక్క ఫలితమై యున్నవి. ఈ మార్పులలో పాత భాష లంతరించి, క్రొత్త భాష లేర్పడినవి. క్రొత్తగావచ్చిన భాషల స్వభావమును బట్టి ఈ మార్పులు తరుచు తీవ్రములై ఆదిమలక్షణములను ఎక్కువగా మార్చి వేయుచున్నవి. కనూరీ, ఒలఫ్ (wolof) ఇట్టి తీవ్రములగు మార్పులకు గురియైన భాషల కుదాహరణములు.

సర్వసామాన్య లక్షణములు :- 1. ధ్వని విశేషము. 2. నిర్మాణము. 3. వ్యుత్పత్తి విషయములలో ఈ వర్గ భాషలకు సామాన్య లక్షణములు కనబడుచున్నవి. నీగ్రో ప్రజ లెక్కువగాగల తావులలో ఈ సామ్యము ప్రబల తరముగా నున్నది.

ఈ క్రింది సామాన్య లక్షణము లీభాషలలో కనబడు చున్నవి : (1) స్వరభేదముచే అర్థభేధము : ఉ॥ యు (Ewe) భాషలో : 'దో' (ఉచ్ఛస్వరము )= చెప్పుట; 'దో" (నీచస్వరము) = విచారముగా నుండుట; 'దో'(సమాన స్వరము)= నిద్రపోవుట.

2. ఏకవర్ణ ధాతువులు :- 'యు' (Ewe) భాషలో 'కు' = చావు; 'నుబా' (Nuba) భాషలో': 'టు'=కాలిక,

3. క్రియలనుండి నామవాచకములు సంబోధన (Vocative) ప్రథమావిభక్తి ప్రత్యయము, లేక అనునానికి ప్రత్య యము ముందు చేర్చుటచే ఏర్పడుట :- యోరుబా' భాష: