Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/799

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆనెగొంది.


ఆనెగొంది కోట. ఆపత్సమయములందు కంపిలి రాజులు అందు ప్రవేశించి ఆత్మరక్షణము చేసికొనుచుండిరి.

బహాపుద్దీన్ ఘప్తావ్ అనునతడు ఢిల్లీ చక్రవర్తియగు మహమ్మదు తుగ్లకునకు మేనల్లుడు. ఆతడు తన మామపై తిరుగుబాటు చేసెను. ఆతనికి ఉత్తర హిందూస్థానమందు తలదాచుకొనుటకు వీలుకలుగలేదు. కనుక అతడు తురకల కందుబాటులో లేని కంపిలి నగరమున కేతెంచి జంబుకేశ్వరుని శరణు చొచ్చెను. కాని అతనిని తరుముచు మహాసేన లతో చక్రవర్తియు కంపిలిని సమీపించెను.

జంబు కేశ్వరుడు. మెరికలవంటి ఐదువేల జోదులతో ఆనెగొంది దుర్గమున ప్రవేశించెను. ఆ కోటను మొగలులు ముట్టడించిరి. శరణాగతుడగు బహావుద్దీనును జంబుకేశ్వరుడు ద్వారసముద్రపు హోయసల రాజగు వీరబల్లాలుని కడకు 'తానూరు' కు సురక్షితముగ పంపివై చెను. చక్రవర్తి యొక్క సామదాన భేదములు జంబుకేశ్వరుని ప్రలోభ పరచజాలకుం డెను. జంబుకేశ్వరుడు తనకు జయము దుర్లభమని తెలిసికొని కోటలో గొప్ప చితి వేర్పాటు చేయించెను. అందు అంతఃపుర స్త్రీలును, ఇతర సాధ్వీమణులును ఆహుతియైరి. అసంఖ్యాకులగు స్త్రీలు, శిశువులు, తురకలకు చిక్కకుండుటకుగాను తమ ఖడ్గములకు తామే బలియైరి. కోటలోని వస్తుసామగ్రి కొలది దినములలో వ్యయమై పోయినది. తన ఐదువేల సైనికులతో జంబుకేశ్వరుడు యుద్ధరంగమున ప్రవేశించి శత్రు నాశన మొనర్చుచు వీరస్వర్గ మందెను.

ఈ విధముగా క్రీ.శ. 1334 లో ఆనెగొంది ముసల్మానులకు వశమయ్యెను. కోటలో ప్రవేశించిన చక్రవర్తికి ఆర్గురు అధికారులును, పదునొకండుగురు రాజకుమారులును, సజీవముగ చేజిక్కిరి, చక్రవర్తి యనుమతిని జంబుకేశ్వరుని భౌతిక దేహమునకు వైభవోపేతముగ దహన సంస్కారము జరిగెను. జనసామాన్యము నేటికిని అతని దేవతాంశునిగ నెంచి పూజింతురు. చక్రవర్తి జంబుకేశ్వరుని శీలమునకు సంతసించి, ఆతని కుమారులను గౌరవమర్యాదలతో చూచెను. చక్రవర్తి అనెగొందిలో మల్లిక్ నాయబును తన ప్రతినిధిగ నిల్పి రాజకుమారులను మంత్రి మున్నగు నితర బందీలను తోడ్కొని ఢిల్లీ నగరమునకు తిరిగిపోయెను.

చక్రవర్తి తిరిగిపోయిన తరువాత స్వాతంత్య్ర పిపాసువులగు ఆనెగొంది ప్రజలు తిరుగుబాటు చేసిరి. వారి నణచుటకు నాయబునకు సాధ్యము కాలేదు. ఢిల్లీ చక్రవర్తి సాయ మొనర్పజాలక పోయెను. తన మంత్రుల హితోపదేశము ననుసరించి ఢిల్లీ చక్రవర్తి తన బందీ యందున్న ఆనెగొంది మంత్రియగు హరిహరుని ఆనెగొంది రాజుగను, అతని సోదరుడగు బుక్కని మంత్రిగను నియమించి, వారు తనకు లోబడి యుండునట్లొడబరచి, తగు బలముతో వారిని ఆనెగొందికి పంపించెను. ఆ సోదరు లట శాంతి నెలకొల్పిరి.

జంబు కేశ్వరుని కుమారులు ఇస్లాము మతము నవలంబించుటచే వారు ఆనెగొంది రాజ్యార్హతను గోల్పోయిరి. సుప్రసిద్ధ యాత్రికుడగు ఇబెన్ బతోతా, మతాంతరులైన ఈ రాజకుమారులకు అత్యంత సన్నిహితుడగు స్నేహితుడుగ నుండెను. వీరి సద్గుణములను గురించియు, చక్రవర్తికి వీరియెడగల గౌరవ ప్రేమలను గురించియు, అతడు తన గ్రంథములో వర్ణించినాడు. ' కీ. శ. 1336 లో విజయనగరము స్థాపిత మైనది. హరిహరుని రాజధాని ఆనెగొందినుండి విజయనగరమునకు మారినది. అప్పటినుండి క్రీ. శ. 1565 వ సంవత్సరమువరకు ఆనెగొంది విజయనగరపు దండనాయకుల పాలనమున నుండెను. తాళికోట పరాజయము తరువాత కొంతకాలమునకు మరల నిచ్చట ఒక చిన్న రాజ్య మేర్పడెను. ఆ రాజులు విజయనగర సమ్రాట్టుల వంశీకులని తెలియుచున్నది.

తాళికోట యుద్ధము తరువాత ముసల్మాను సుల్తానులు విజయనగర సామ్రాజ్యాంతర్భాగములు పంచుకొన్నప్పుడు ఈ యానెగొంది గోల్కొండ నవాబులకు భుక్తమైనట్లగుపడుచున్నది. క్రీ. శ. 1686 లో గోల్కొండతో పాటు ఆనెగొందియు మొగలులకు వశమైనది. క్రీ. శ. 1776 లో టిప్పుసుల్తాను ఆనెగొంది తిమ్మప్పరాజును సింహాసన భ్రష్టునిజేసి పట్టణమును ధ్వంసమొనర్చెను. క్రీ. శ. 1799 లో శ్రీరంగపట్టణపు యుద్ధమందు ఇంగ్లీషువారు టిప్పును చంపి ఆనెగొంది రాజును మరల ప్రతిష్ఠించి, అతనికి 1300 రూప్యముల మాసభృతి నేర్పాటు చేసిరి. మైసూరు రాజ్యభాగముల పంపిణి