Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/798

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆనెగొంది

తిని మెరుగుచేయుటకై కల్పిత పద్ధతిలో సంతానోత్పత్తి (artificial breeding) గావించి పలువిధములగు క్రొత్త విషయములను పరిశోధకులు తెలిసికొ గలిగినారు. ఇట్టి పద్ధతులు వ్యవసాయ పరిశోధన కేంద్రములందు పశు అభివృద్ధి కేంద్రములందు విరివిగా ఉపయోగమందున్నవి. మెండెల్ సూత్రముల ననుసరించి రెండు భిన్న గుణములుగల తెగలను తీసికొని వానియందు కావలసిన లాభదాయక గుణము నొకదానినే పెంపొంద జేసి ఆ సంతతినే ఇతరులనుండి వేరుచేసి, లాభదాయకమైన mక్రొత్త జాతిని సంపాదించవచ్చును. జంతువులలో ఎక్కువ పాలుఇచ్చు ఆవుల తెగను లేక ఎక్కువ బలము కలిగి కష్టముచేయు కోడెల తెగలను ఇదేపద్ధతిలో అభివృద్ధి చేయవచ్చును. మానవులలో సయితము వంశపారం పర్యముగావచ్చు చెడుగుణములను వివిధరోగములను నిర్మూలిం పజేయుటకుగాని, లేదా మేధాశక్తి, గాయనము,గణితము, చిత్రలేఖనము మొదలగు వానిని అభివృద్ధి చేయుటకుగాని ఈ సిద్ధాంత మెంతేని సహాయపడును.ఇతర జంతువుల యందువలె మానవులలో కృత్రిమ పద్ధతిలో సంతానము బడయుట సాధ్యముగాని పనియైనను సృజన శాస్త్రమును మానవాభ్యుదయమునకు వర్తింపజేయవచ్చును. దీనిని గురించి చర్చించు శాస్త్రము సృజనన విద్య (యూజనిక్స్- Eugenics) అనబడును. ఈ శాస్త్ర సాహాయ్యమున విద్యమూలమున మానవ తెగలందుగల మంచి గుణములను అభివృద్ధిచేయుటకును, చెడుగుణములను వారించుటకును తగిన చర్యలను తీసికొనవచ్చును. వివాహములందు ఇట్టి నిబంధనలు పాటించుటకు ప్రయత్నములు 'సలుపవచ్చును. మీదు మిక్కిలి నిబంధనలను చట్టబద్దము చేయ వచ్చును. మానవులకు మంచి భోజనము, మంచి వాతావరణము మొదలగు సదుపాయములచే సృజనశక్తియందు తగిన ప్రభావము ప్రసరింప జేయవచ్చును. ఆహారమునకై వధింపబడు పాలిచ్చు జంతువులను అభివృద్ధి కేంద్రము లందుంచి మంచి మంచి తెగలను సృష్టించుటకు యత్నము జరుగుచున్నది. ఆహార ధాన్యములలో ఎక్కువ పంటనిచ్చు జాతుల అభివృద్ధికై కృషి జరుగుచున్నది. ఈ కృషి మూలముననే పశు వైద్యశాలలందు మంచి విత్తనపు కోడెలనుంచి మంచి సంతతిని బడయుటకు ఉపయోగించుటయు వ్యవసాయ శాఖవారు మంచి విత్తనముల ప్రోగుచేసి రైతుల కందించుటయు మనము కాంచుచున్నాము.

వె.జ

ఆనెగొంది  :- తుంగభద్రానదికి ఉత్తర తీరమున నున్న ఇప్పటి శిథిలమగు ఆనెగొంది ఒకప్పు డొక ఆంధ్ర సంస్థానమునకు రాజధానిగా నుండి ఆంధ్ర చరిత్రమున ప్రముఖపాత్రను వహించి యుండెను. కన్నడభాషలో 'ఆనె' యనగ ఏనుగని యర్థము. ఆనెగొంది యనగా ఏనుగులకోన. దీనివలన నా ప్రదేశ మొకప్పుడు కాకులు దూరని కారడవిగా నుండె నని తెలియు చున్నది. ఆనెగొందియే కిష్కింధ యనెడు ఐతిహ్యము కలదు. ఋశ్యమూకము, పంపా సరోవరము, చక్రతీర్థము మున్నగు రామాయణ ప్రసిద్ధ స్థలములు ఆ పరిసరముల నుండుటచేతను, సీతాన్వేషణమున, లంకకు పోవుటకు శ్రీరాముడవలంబించిన మార్గ మదే యగుటచేతను ఆ యైతిహ్యము సమంజనమే కాగలదు.

ఆనెగొంది పూర్వ చరిత్రము అగాధ కాలగర్భమున నిగూఢముగ నున్నది. బౌద్ధమతావలంబకులగు ఓడ్ర యవనులీ ప్రాంతము నాక్రమించుకొని సముద్రతీరముల దనుక నాలుగు శతాబ్దముల వరకు పాలించిరను విషయము యథార్థమని చెప్పుట కవసరమగు చారిత్రక సంపద యింకను దొరక లేదు. క్రీ. శ. ౧౧ వ శతాబ్దము నుండి కొంత చరిత్రము కనుపించును.

క్రీ. శ. 1323 వ సంవత్సరమున ఓరుగల్లు పతనానంతరము అట రాజ ధనాగారాధ్యక్షులుగ పనిచేయు చుండిన హరిహర, బుక్క అను సోదరులు ఆనెగొంది నేలుచున్న జంబు కేశ్వరుని కొలువులో ప్రవేశించిరి. తమ ప్రతిభచే వారచిర కాలముననే మంత్రి, కోశాధ్యక్ష పదవులను సంపాదించుకొనిరి.

జంబుకేశ్వరుడు ముప్పదేడేడులు (క్రీ.శ. 1297-1334) సర్వజనరంజకముగా రాజ్యమేలెను. అతడు సాహసి. విక్రమో పేతుడు, త్యాగి, శరణాగత రక్షణ బద్ధకంకణుడు. 'కంపిలి' నగర మతని రాజధాని, కంపిలికి పడమట రమారమి ఎనిమిది మైళ్ళ దూరమున దుర్గమ పర్వత పంక్తుల మధ్య, శత్రుదుర్భేద్యముగ నిర్మింపబడి యున్నదీ