Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/784

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆనందవర్ధనాచార్యుడు

య్యము లభించుచుండెడిది. మాక్పు ముల్లరు పండితుడు తల పెట్టిన ఋగ్వేద సంహితా ముద్రణమునకును, సంస్కృత వాచస్పత్య ముద్రణమునకును, ఎందరో కాశీ పండితుల గ్రంథ ముద్రణమునకును, మున్నీ మహమ్మద్ పాచ్ఛామియా సాహెబు యొక్క "ఫరహం గే ఆనంద రాజ్" అను ఉర్దూ నిఘంటువు ముద్రణమునకును, మహారాజు కారణభూతుడు. గురజాడ శ్రీరామమూర్తి గారు రచించిన "కవి జీవితములు" అను కవుల చరిత్రకు మహారాజు యొక్క సంపూర్ణ ప్రోత్సాహము లభించినది.

మహారాజునకు సంస్కృతాంధ్ర భాషలతోబాటు లాటిన్, ఫార్సీ, ఉర్దూ, ఫ్రెంచి భాషలలోకూడ మంచి ప్రవేశము గలదట. ఈ మహారాజు వరదరాజ కృతమగు లఘు కౌముదిని కొంతవరకు తెనిగించెను. వీరి కాంగ్ల రచయితలలో జాన్ స్టూవర్టుమిల్, హెర్బర్టు స్పెన్ నర్, పోప్ మొదలగు వారియం దభిమానము. వీరాంగ్లమునను చాల రచనలు చేసినారు.

ఇన్ని ప్రతిభలుకల మహాప్రభువైనను ఆయనలో నాడంబరముగాని, ఔద్ధత్యముగాని లేకుండెను. వారు పండిత పామరులయం దభిమానదృష్టి కలవారు. వారి సుగుణ సంపదను గురజాడ అప్పారావుగారు తమ డైరీలలో సముచితముగ స్తుతించినారు.

ఆనందగజపతి మహారాజు తమ తండ్రివలె వైస్రాయి కౌన్సిల్ సభ్యులును, జి. సి. ఐ. ఇ. బిరుదాంకితులు నై యల రారిరి.

కొ. వీ.

ఆనందవర్ధనాచార్యుడు  :- కాలము సమకాలికులు :- భారతీయ సాహిత్యశాస్త్రము శాఖోపశాఖలుగా విస్తరిల్లినది. సుప్రసిద్ధులైన సాహిత్య శాస్త్రకారులల శ్రీ ఆనందవర్ధనాచార్యుడు పేరెన్నికగన్న వాడు. ఈతడు కాశ్మీర దేశీయుడు. 855-884 క్రీ. శ. లో కాశ్మీరదేశము నేలిన యవంతివర్మ యాస్థానము నీ విద్వన్మణి యలంకరించి యుండెను. ఆనాడు ప్రఖ్యాత పండిత కవులకు కాశ్మీరము కాణాచియై యుండెను. సుప్రసిద్ధులయిన విద్వాంసులలో ముక్తాకణుడు, శివస్వామి, రత్నాకరుడు మున్నగువా రానంద వర్ధనునితో పాటుగా అవంతివర్మ సభను భూషించియుండిరని రాజ తరంగిణి చెప్పుచున్నది. సమకాలిక మహాకవులలో నాయకమణి యనదగు ఆనందవర్ధనుడు క్రీ. శ. 800 ప్రాంతమందున్న ఉద్భటుని పేర్కొనెను. క్రీ. శ. 900 ప్రాంతమందుండిన రాజ శేఖరునిచే తాను ప్రశంసింపబడెను. కావున నీతడు తొమ్మిది పది శతాబ్దముల నడిమి వాడై యుండు ననియు, ఈతని కావ్యరచనా కాలము క్రీ. శ. 840-870 వరకును అయియుండు ననియు చారిత్రకులు తలంచుచున్నారు.

వంశము  :- ఆనంద వర్ధనాచార్యునిది రాజానక వంశము. కాశ్మీర పండిత వంశములలో రాజానక వంశము మిక్కిలి ప్రతిష్ఠ గన్నది. మహా విద్వాంసులు, రచయితలు ఎందఱెందరో ఈ వంశమున నుద్భవించిరి. రుయ్యక మమ్మటాదులగు నాలంకారిక శ్రేష్ఠులి కోవలోనివారే. mఆనందవర్ధమని తండ్రి నోణపండితుడైనట్లు దేవీ శతకము వలన తెలియుచున్నది.

ఆనందవర్ధనుని కృతులు  :- ఈ మహాకవి రచించి గ్రంథములలో దేవీశతకము, విషమబాణలీల, అర్జున చరితము, ధర్మో త్తమ వివృతి, ధ్వన్యాలోకము ముఖ్యములు. విషమబాణలీల, అర్జున చరితములు ప్రాకృత కావ్యములు. దేవీశతకము యమకాది శబ్దాలం కారములతోను, గోమూత్రికాది చిత్రబంధములతోను విలసిల్లుచు 'ఆనందవర్ధనుడు మహితధ్వని కర్తయేకాదు, చిత్రకవితా ధురీణుడు' నగునని యా కవీంద్రుని సవ్యసాచిత్వమును వెల్లడించుచున్నది. దీనికి కయ్యటుడను కాశ్మీరపండితు డొక వ్యాఖ్యను వ్రాసెను. ధర్మకీర్తి రచించిన ప్రమాణ నిశ్చయమను గ్రంథమునకు వ్యాఖ్య ధర్మోత్తమ యనునది. దానికి ఆనందవర్ధనుడు రచించిన వివరణ మే ధర్మోత్తమ వివృతి.


ధ్వన్యాలోకము  :- ఆనందవర్ధనుని విస్తార యశస్సు నకు మూలకారణమయినది యాతని ధ్వన్యాలోకము. అలంకార శాస్త్రమునకెల్ల శిరోభూషణమన నొప్పిన దీ గ్రంథరాజము. కావుననే వేదాంతశాస్త్రమునకు వ్యాస మహర్షి బ్రహ్మసూత్రము లెట్లో, వ్యాకరణమునకు పాణిన్యాచార్యుని యష్టాధ్యాయియెట్లో సాహిత్య శాస్త్రమునకు శ్రీమదానందవర్ధనుని ధ్వన్యాలోక మళ్లే యని విమర్శకు లుగ్గడించినారు. లలితమైన కావ్యతత్వమును