Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/783

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆనందగజపతి మహారాజు


భాషా కోవిదత్వమును మెచ్చుకొని ఆంగ్లేయులు వీరికి చిన్నతనముననే గౌరవ డాక్టరు పట్ట ప్రదానము గావించిరి. వీరికి వీణావాదనమందు అధికమైన కౌశల్యాభిమానము లుండెడివి. పారసీ కాది భాషలలో వీరికి పాండిత్యము కలదు. 'అద్యతనాంధ్రకవి ప్రపంచ నిర్మాత' లైన తిరుపతి వేంకట కవులు 'ఏము చూచిన రాజులం దెల్ల నొక్క విజయనగర మహారాజు వేత్త' యని వీరిని ప్రశంసించి స్వీయ కవితావధూటిని సమర్పించిరి. వీరి ఆస్థానములో మహాపండితులు, కవులు, గాయకులు, క్రీడా నిపుణులు, నటులు, ఎందరో మహానుభావు లుండెడివారు. ఆ తారాగణ మధ్యస్థుడయి ఈ రాజచంద్రుడు ప్రకాశించువాడు.

ఆనంద గజపతి మహారాజునకు రూపకముల నభినయింప జేయుట యన్న మిక్కిలి యిష్టము, సంసృత రూపకముల నెన్నిటినో వారు ఆదరించి అభినయింప జేసిరి. అభిజ్ఞాన శాకుంతలము, రత్నావళి మొదలగు నాటకము లిందు గలవు. నటుడుగా, నాటక కర్తగా. విద్వాంసుడుగా శ్రీ గోమఠం శ్రీనివాసాచార్యులు ఈ రాజుగారి యాశ్రయమున ప్రఖ్యాతివహించిరి. వీరి పోషణమున నటకులు, నర్తకులు ఎందరో వృద్ధినొందిరి.

శ్రీ ఆనందగజపతి మహారాజు పోషించిన పండితులలో కిళాంబి రామానుజాచార్యులు, చొదిమెళ్ళ రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావు పంతులు మొదలైన ప్రతిభావంతులై న ప్రాజ్ఞులు కలరు. హరికథా పితామహులైన ఆదిభట్ల నారాయణదాసుగారి ప్రతిభను చూచి మహారాజు ముగ్ధు డగుచుండెడివాడు.

ఆనందగజపతి మహారాజు హిందూసంఘ సంస్కరణమునందు గూడ కృషిచేసెను. హిందువులలో కన్యాశుల్కమను దురాచారము వ్యాపించియున్న కాలమది. ఈ మహారాజీ దురాచారమును రూపుమాపుటకు కన్యాశుల్కమును గురించిన లెక్కలను తన యాధ్వర్యవమున సిద్ధముచేయించి తన సాంఘిక చైతన్యమును ప్రకటించుకొనెను. మహారాజుగారి ఈ కృషి గురజాడ అప్పారావుగారి కన్యాశుల్క నాటకరచనకు దోహద మొసగినది. అప్పారావుగారి ఈ నాటకమునకు మహారాజు కృతిభర్త గా నుండి దానిని అభిమానించెను. 1897 లో మహారాజు యొక్క అకాల మృతివలన వారి సంఘ సంస్కరణ కృషి తగినంతగా ఫలించ లేదు. ఆనందగజపతి మహారాజు యొక్క పోషణమున 'తెలుగుహార్ప్' అను ఆంధ్ర ఆంగ్ల వారపత్రిక యొకటి ఆనాడు విజయనగరమునుండి వెలువడు చుండెడిది. ఇందు మహారాజా వారి ఆస్థాన పండితులు ఆంధ్రాంగ్ల భాషలలో రచనలను ప్రకటించువారు.

ఆనందగజపతి మహారాజునకు సమస్యాపూరణ మన్న మిక్కిలి ఇష్టము. తమ విద్వత్కవులచే, కష్టమైన సమస్యలను పూరింపించుట, చమత్కారములైన సంస్కృత శ్లోకముల నాంధ్రీకరింప జేయుట, తెలుగు పద్యములను సంస్కృతీకరించుట మహారాజుగారి నిత్యవ్యాసంగములు. తాముకూడ నెన్ని యో సమస్యలను పూరించిరి. సంసృత శ్లోకములను, తెలుగు పద్యములు నెన్నింటినో రచించిరి. వీరి యీ రచనలు హృదయంగమముగా నుండును.

నాడు సాహిత్యాదులలో కృషి జరిగినను, పరిశోధనలు జరిగినను, ఎవరికైనను ఆనంద గజపతీంద్రుల సాహా