శ్రీ ఆనందగజపతి మహారాజు
సంస్థకు చేయదగిన సేవ చాలగలదు. విద్యావ్యాప్తి, వైద్యము, వ్యవసాయము, పరిశ్రమలు, ప్రజాసౌకర్యములు ఇత్యాది సర్వవిషయములయందును ప్రభుత్వము వారు మిక్కిలి శ్రద్ధవహించి, ఎట్లు నిర్వహించుచున్నారో అట్లే సంగీత విషయమందును వారు శ్రద్ధను కలుగ జేసికొనవలసిన అవసరము గలదు. ప్రభుత్వము వారు ప్రతి రాష్ట్రమందును సంగీత నాటక "ఎకాడమీలు” స్థాపన చేయుచుండుట ప్రశంసింప దగినది. కాని ఇంతమాత్రమున ప్రజలలో సంగీత విద్యావ్యాప్తి కలుగనేరదు. ప్రతి నగరమందును, గ్రామమందును, ప్రజలు సంగీత సమాజము లేర్పరచి, సంగీత విద్వాంసులను రావించి సత్కరింపవలెను. ప్రజలెల్లరు. వివాహాది శుభకార్యము లందు ఉత్తమ గాయకుల నాహ్వానించి గౌరవింపవలెను. దేవాలయ ధర్మకర్తలు, మఠాధిపతులు, విరివిగా సంగీత సభలు జరిపించి సంగీతపోషణకు పూసుకొనవలెను. విద్యాలయములలో సంగీతవిద్యకు ఉచితస్థానము కలుగ జేయవలయును. ప్రతి గ్రామమందును సంగీతవిద్యాలయములు నెలకొల్పబడవలయును. ఇట్టి మార్గము లింక ఎన్నియో కలవు. ఇట్లొనర్చినచో సంగీతమునకు పూర్వపు ఔన్నత్యము లభించును. “ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం" అనునట్లు సంగీతమున కాధారమైన నాదము నుపాసించినచో చతుర్వర్గములను పొందగలుగుదురు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, నాదమే స్వరూపముగా గలవారు గాన వారు నాదముచేతనే యుపాసింపబడుచున్నారని
(1) త్రివర్గ ఫలదా స్సర్వే దాన యజ్ఞ జపాదయ ఏత త్సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదమ్. (శివసర్వస్వం)
(2) నాదోపాసనయా దేవా బ్రహ్మా విష్ణు మహేశ్వరౌ భవంత్యుపాసితా నూనం యస్మాదేశే తదాత్మకాః,(సంగీత రత్నాకరము)
అను శ్లోకద్వయముచే విదితమగుచున్నది.
హో. రా.
శ్రీ ఆనందగజపతి మహారాజు :- పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్ధమున సంగీత సాహిత్యాది విద్యలను పోషించిన వారిలో శ్రీ ఆనందగజపతి మహారాజును పేర్కొనవలెను. వీరి పోషణమున ఆంధ్రదేశమున సాహిత్యమునకు చక్కని ప్రాపు లభించినది. వీరు 31.12.1850 న జన్మించి 23. 5. 1897 లో స్వర్గస్థు లైరి.
శ్రీ ఆనందగజపతి మహారాజు జన్మించిన రాజవంశము ఆంధ్ర దేశ మున చివరివరకు ఆంగ్లేయులతో పోరిన గౌరవమును పొందినది. ఈ వంశమునకు మూలపురుషుడైన మాధవవర్మ క్రీ.శ. 591 లో ఉత్తరదేశమునుండి కృష్ణాతీరమునకు తరలివచ్చి రాజ్యమును స్థాపించెనని ఐతిహ్యమొకటి కలదు. వీరి సంతతివారు గోల్కొండ నవాబుకు సహాయకులుగ నుండిరి. వీరిలో నొకరయిన పూసపాటి మాధవవర్మ 1652 లో విశాఖపట్టణ ప్రాంతమున రాజ్యమును స్థాపించెను. ఈతని తరువాత ప్రఖ్యాతికి వచ్చినవారు 1757 లో బొబ్బిలి యుద్ధము చేసిన పెద విజయరామ గజపతి.
శ్రీ ఆనంద గజపతి జనకులగు శ్రీ విజయరామ గజపతి 1852 నుండి సంస్థానమును పాలించిరి. దక్షిణ భారతమున ఆంగ్ల విద్యావ్యాప్తికై కృషిచేసిన వారిలో వీరగ్రగణ్యులు. ఆంగ్ల సంస్కృత కళాశాలలను వీరు విజయనగరమున స్థాపించిరి. వీరి కృషికి మెచ్చి ఆంగ్ల ప్రభుత్వము వీరికి 'మహారాజ' 'కే. సి. యస్. ఐ.' అను బిరుదములిచ్చి గౌరవించెను.
వీరి పుత్రులు ఆనందగజపతి మహారాజు గారు. ఆనందగజపతి తల్లి శ్రీ అలక రాజేశ్వరీ మహారాజ్ఞి. భార్య, జయపూరు రాకుమారియైన శ్రీ వనకుమారి. శ్రీ ఆనంద గజపతి తమకు ఔరసులు లేకుండుటచే, శ్రీ పూసపాటి విజయ రామగజపతి మహారాజులను, దత్తపుత్రునిగ గ్రహించిరి.
శ్రీ ఆనంద గజపతి మహారాజుగారు బహుభాషా కోవిదులు, సంగీత సాహిత్యవేత్తలు; ముందర విగ్రహులు. ఆంగ్లేయు లీతని (Prince Charming) అని కీర్తించిరి. ఆనందగజపతి చూపిన అభిమాన కారణముగా విజయనగరము పండితులకును, శాస్త్రవేత్తలకును, సాహిత్యకులకును కేంద్రమయినది.
శ్రీ ఆనందగజపతి మహారాజు భాగవతుల హరిశాస్త్రి యొద్దను, ముడుంబై నరసింహాచార్యుల యొద్దను, మేజర్ థామస్ కార్ల్తెల్, లింగం లక్ష్మాజీ పండితుల యొద్దను సర్వవిద్యల నభ్యసించిరి. మహారాజుల ఆంగ్ల