Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/777

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక వాస్తువాదములు


ప్రయోజనాత్మక మైనదియు అగు మార్గ మేర్పరచెను. "రూపము ప్రయోజ్యత ననుసరించును" అనున దీతని సూత్రము. ఒక కట్టడమునందు ఉపయోగించు బుద్ధి కుశలత, భావదీప్తి, భౌతిక, ఆధ్యాత్మిక క్రియాకలాపము వీటిసముచ్చయమే 'ప్రయోజకత' అని అతని మతము. ఈ ఆదర్శమును ఫ్రాంక్ లాయడ్ రైట్ మరింత యభివృద్ధిపరచెను. మనమొక రూపమును కల్పించునపుడు అతిముఖ్య జీవిత సూత్రమైన పరివర్తన సూత్రమును విస్మరించరాదని యీతడు హెచ్చరించెను. ఒక నమూనా లేక ఒరవడి యేర్పరచునప్పు డది స్వతంత్రముగాను, ప్రవృద్ధినొందుట కనుకూలించునది గాను జీవితవికాసమును ప్రోత్సహించి దోహద మొసంగునదిగాను ఉండవలెను. ఈతని తరువాతి పెక్కురు యువక వాస్తుకారు లీతని కృతులనుండి అనేక ముఖ్య సూత్రములను గ్రహించి జీర్ణించుకొనిరి. తమకు నచ్చని విషయములకు బదులుగా కొన్నిటిని క్రొత్తగా కల్పించుకొనిరి.

కిటికీలు వరుసలలో నుపయోగించు పద్ధతిని మొట్టమొదట ప్రవేశ పెట్టినవాడు ఫ్రాంక్ లాయడ్' రైటు.కాని సామాన్యముగా నీతడధిక కాంతిని కాంక్షించు వాడుకాడు. తరువాత వచ్చిన యువక వాస్తుకారులు వాతాయనములను అంతకెక్కువగా వాడిరి. అతడు తరచు అలంకరణముల నుపయోగించువాడు.యువక వాస్తు కారులు దీనిని సంపూర్ణముగ పరిత్యజించిరి. నునుపు తీర్చని రాతిగోడలను, సంస్కార హీనమై యథేచ్ఛముగా పెరిగిన ఆటవిక ప్రకృతిని అత డభిమానించెను. ఇవి పందొమ్మిదవ శతాబ్దపు కాల్పనికోద్యమము యొక్క అవశిష్ట చిహ్నములు. ఐరోపా వాసులకు ప్రకృతిపై గల చిన్నచూపు నాతడా క్షేపించెను. సంస్కార రహితమైన యీ ఆటవిక ప్రకృతికి మారుగా తరువాతి యువక వాస్తుకారులు ఉద్యానవన కళాప్రీతిని ప్రవేశ పెట్టిరి. ఇంటిని నిలువ నీడగా సంభావించు అభిప్రాయమును సూచించుటకు కాబోలు అతడు భవనములు కప్పులు చూరులు సుదూరము చొచ్చుకొని వచ్చునట్లు నిర్మించెను. తరువాతి వాస్తుకారులు ఇట్టి ఫలితమునే సాధించినను పై పద్దతి వల్లగాక వేరు విధములైన యుపాయముల నవలంబించిరి. రైట్ ఎప్పుడును ఆసనములు మొదలగు గృహోవ

కరణములను గూర్చి ఆలోచించినవాడుకాడు. ఆతడు నిర్మించిన భవనములలో వీనికి ప్రసక్తి అత్యల్పము. యువక వాస్తు కారులు ప్రయోజనాత్మక గృహోపకరణములపై అధిక శ్రద్ధను ప్రకటించిరి. అత డొక్కొక్కప్పుడు అలంకరణ ప్రాయమైన యొ కే యొక కృతిని సాధించుటకు పట్టుబట్టి, ఇతర విషయములను దానికి గౌణముగా చేసి, సౌకర్యమువంటి యత్యవసర విషయమును గూడ విస్మరించువాడు. కాలిఫోర్నియాలోని పాల్ హాన్ అను నాతని 'తేనెపట్టు భవనమున' 60°, 120° కోణముల నిర్మాణము, నక్షాలోను (plan) ఆసనోపకరణములలోను కూడ ఒత్తి చూపబడినది. యువక వాస్తుకారులు ఇంత దూరము పోకుండగనే, భవనాకృతి రచనలో పొందికను సాధించిరి. వీరు సాంప్రదాయిక విభాగమును తిరస్కరించి యత్యవసరాంశములను మాత్రము స్వీకరించిరి. గృహాంతర్భాగము విశాలముగా నుండు ఆవశ్యకత, నక్షా గీయుటలో స్వాతంత్య్రము, భవనము ఉద్యానములోనికి చొచ్చియుండుట, ప్రకృతి పై నాధారపడుట, వెచ్చదనము గలిగి, సహజములు,స్థానికముగా లభ్యములు అగు పరికరములనే విస్తారముగా వాడుట ఇవి వారాదరించిన యంశములు, వీరు పూర్వసిద్ధములైన పద్ధతులతో తృప్తిపడక, ప్రయోగాత్మక పరిశోధనచే సమస్యలకు క్రొత్త సమాధానములు కనుగొనుట అన్నిటికన్న ముఖ్యమైన విశేషము. ఇదియంతయు అమెరికాలో నివాస మేర్పరచుకొన్న ఐరోపా వాస్తుకారుల ప్రభావమే. వాస్తు శాస్త్రజ్ఞుల యొక్కయు, విమర్శకుల యొక్కయు విభిన్నాభిప్రాయములు సమకాలిక వాస్తువునందలి ప్రస్తుతాభి ప్రాయమును తెలియజేయును. ఇది యొకవిధముగా అమెరికా చైతన్య వాస్తువును ఐరోపావాస్తు ఆదర్శములతో సమన్వయ పరచుటే యగును.

"మానవునకును, ప్రకృతికిని లేక అతని పరిసరములకును గల సంబంధమును గూర్చిన భావమే భేదకారణము. లూయీసల్లివాన్, ఫ్రాంక్ లాయ్డ్ రైట్ అనువారి సంప్రదాయములలో ఉపకరణ ద్రవ్యములు వాని స్వాభావిక గుణముల ననుసరించి గౌరవింపబడుచున్నవి. "ఇక ఐరోపాలో నన్ననో ద్రవ్యములు అభావమే కనబడు