Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/765

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక భారతీయ చిత్రకళారీతులు


కర్తవ్యమై యున్నది. అట్లు చేయనిచో కళాప్రచలన విధానమును సరియైన సాంఘిక సందర్భములో మనము గ్రహింపజాలము.

అజంతా ప్రథమ కుడ్య చిత్రములతో రెండు వేల సంవత్సరముల పూర్వమునుండి వచ్చుచున్న భారతీయ చిత్రకళా సంప్రదాయము హిందూ దేశమున క్రీ. శ. 19 వ శతాబ్ది యంతమునకు అవసానదశ పొందినది.

చిత్రకళా సంప్రదాయము యొక్క చరమ వికాసము హిమాచల ప్రదేశమునందలి చారిత్రకమైన త్రిగర్తమున (మూడు లోయలలో) ప్రత్యక్షమైనది. హిమాలయ పాదములందలి మైదానములు నానుకొని రాజపుత్ర వర్గములచే స్థాపింపబడిన ఈ మూడు చిన్న రాజ్యములలో రాజస్థాన చిత్రకళా సంప్రదాయాదర్శము పర్వత వాయు నైర్మల్యము యొక్కయు, కొండ సెలయేరుల స్వచ్ఛతయొక్కయు అంశములను పుణికి పుచ్చుకొనుటచే మరింత సుందరమై ఒప్పారినది. కంగ్రా, బసోహ్లి, సుకేత, మంజి, చంబ మున్నగు ప్రదేశములందలి చిత్రకళ పోషకుల సంఖ్య తగ్గుటచే క్రమముగా సన్నగిల్లెను. 1905 లో కలిగిన ధర్మశాలలోని భూకంపము ఈ మండలము నందలి కళకు స్వరూప ధ్వంసము కావించెను.

పాశ్చాత్య సంప్రదాయ ప్రభావితమును, భూస్వాముల చిత్రించు సంప్రదాయముతో కూడినదియు అగు ఒక సంకీర్ణ చిత్రకళా పద్దతి భారతదేశమునందలి కొన్ని ప్రదేశములలో కొంచెము కొంచెముగా సాగుచుండెను. లక్నో పాట్నాలయందును, దక్షిణమున మైసూరునందును దక్షతతోకూడిన చిత్రకళ నిర్వహింపబడుచుండెను. కాని పహరి చిత్రకళయందలి రసవత్తరమును ఆత్మీయాంశ భూయిష్ఠమునైన పద్ధతి యొక్క జాడకూడ కనిపించుట లేదు.

క్రీ.శ. 1854లో వై దేశిక సంస్కృతి ప్రభావముచే కలకత్తా కళాపాఠశాల (Calcutta School of Arts) ఆరంభమాయెను, ఈ పాఠశాల బ్రిటనును ఆదర్శముగా గ్రహించెను. ఈ యుగమున బ్రిటిష్ వారికళ అనావశ్యక వివరములతో కూడిన భారవత్వమునకును, వైజ్ఞానికమైన ఉదా త్తతకును గల భేదమును వివేచింపలేక మిక్కిలి హీనస్థితిలో ఉండుటచే ఆ పరిస్థితి మిక్కిలి విషాదకరముగా పరిణమించెను. అపవిత్రాదర్శములు ఆంగ్లేయ కళను తద్వారా భారతదేశమునందలి కళాశిక్షణమును మలినీకరించుట సంభవించెను.

ఈ పద్ధతికి చెందిన మధ్యరకపు ప్రతిభగల పలువురు వ్యక్తులలో పరిమిత రంగముననే ఐనను స్థిరమైన సిద్ధి నొందెనని చెప్పుటకు తగినవా డొక్కడున్నాడు. అతడు రవివర్మ. వంగదేశమునందలి పునరుద్ధరణ కాలమునకు చెందిన కళాకారులును, తరువాతి యుగమునకు చెందిన ఆధునికులును పెక్కు కారణములచే అతనిని లాఘవముతో పరికించుచుందురు. కాని రవివర్మ చిత్రలేఖనమునందలి గౌరవమును నిల్పెననుట మాత్రము యథార్థము, ఆధునిక యువకులం దిది ప్రధానలక్షణముగా కనిపింపదు. ఆతడు తన చిత్రముల అమ్మకము దృష్టియం దిడుకొనుటచే కేవల పండితాదరమునకే యధికమైన ప్రాధాన్యమిచ్చి యుండలేదు. ఆతడు పురాణములందలి అసంఖ్యాకములైన కథలకే చిత్రరూపము నొసంగెననుట నిజమే. కాని అవి లేఖన (చిత్రణ) వర్ణనవిషయములందు మిక్కిలి దక్షతతో నిర్వహింపబడినవి. అతని చిత్రములందలి సారస్వతాశ్రయత్వముమాట యెట్లున్నను అందలి పరిపూర్ణమైన నిష్ఠమాత్రము తరువాతి వారికి ఆదర్శము కాదగియున్నది.

భారతదేశమునందలి ఆంగ్లేయులు బలవత్తరమయిన సామ్రాజ్యవర్ధన విధానము నడుమ వైదేశికా క్రమణము వలన దేశీయ సంస్కృతికి కలిగిన హానికి ఇద్దరు ఆంగ్లేయులు పరిహారము చేకూర్చిరనుట మిక్కిలి ఆశ్వాసదాయకముగా ఉండును. వీరు కర్జను ప్రభువు, ఇ. బి.హావెల్ అనువారు. కర్జను ప్రభువు ఈ దేశమునందలి వాస్తుశిల్పముల' గొప్ప సంప్రదాయమునకు అలరి, వాటి రక్షణమునకై చట్టములు కావించెను. భారతీయ కళాకారులకు అమూల్యమును పై విధ్యముతో కూడినదియు అగు సొంత సంప్రదాయము ఉండగా వారిని వై దేశికా దర్శమును అనుకరింప ప్రోత్సహించుట వ్యర్థమును, విషాదకరమును అని కలకత్తా కళా పాఠశాల కధ్యక్షుడైన హావెల్ గుర్తించెను.అందుచే కళావిషయమున పొందబడిన సాంప్రదాయిక సిద్ధుల పరిశీలనము ఒనరింప వలెనని ఆతడు వాదించెను. విదేశము లందు డాక్టరు