Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/764

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక భారతీయ చిత్రకళారీతులు

ప్రతీకార వాంఛ అనువాటివలన ప్రభవించిన దని చెప్పవచ్చును.

తరువాత ప్రొఫెసరు ఫ్రెండు అనువాని సిద్ధాంతముల నాధారముగ జేసికొని అతివాస్తవికత (Surrealism) అను నూతన విధాన మొకటి చిత్రకళయందు ప్రవేశ పెట్టబడెను. ఈ సిద్ధాంత మీ సామాన్య జాగ్రజ్జగత్తునకు సంబంధించినది కాదు. ఇది మానవుని స్వప్నావస్థకును, స్పృహారహిత స్థితికిని సంబంధించినది. మానవుని మనస్సు అతార్కికముగ పరిభ్రమించినప్పటికిని అది యిట్టి స్థితిలో జాగ్రదవస్థయందు కంటె విశాలముగను, సత్యముగను, ప్రస్ఫుటముగను కనబడునని వాదించి చిత్రోపేతమయిన ప్రదర్శనము మూలమున (pictorial representation) దీని సిద్ధాంతమును వ్యక్తీకరించిరి. ఈ సిద్ధాంతమునకు సంబంధించిన చిత్రకారులగు చిరికో, మార్క్ చేగల్ వారల చిత్రములందు సంభావ్యము అసంభావ్యముగ గన్పట్టుట, కొన్నియాకారములు (Figures) గాలియందు తేలిపోవుట మున్నగువాటిని కవితా సౌందర్యముతో ఆకర్షణీయమయిన పద్ధతిలో (design) ను, రచనా కౌశల్యముతో (draughtsmanships) ను చిత్రించుట గోచరించును.

ఆధునిక చిత్రికారు లందరిలోను తలమానికముగా ఎన్నతగినవాడును, సృజనాత్మకుడును, స్వతంత్రుడును అయిన పికాసో అనువానిని ప్రత్యేకముగ స్మరింపక చిత్రకళా పరమర్శము పూర్తి కాజాలదు. విశాలదృక్పథము కల ఇతని చిత్రకళారంగము చాల భిన్నము విపులము నైనది. ఈ యుగములో తలసూపిన అధికసంఖ్యగల ప్రాయోగిక (experimental) చిత్రకళాఖండములకు కారణభూతుడు అతడే. అతని పేరు 'Abstract'చిత్రకళతో సంబంధముకలదై యున్నప్పటికిని, వాని చరిత్రము తమ కాలమందలి పురోగమించుచున్న కళ యొక్క ముందడుగు. "His history is very much the record of the Forward Art movement in our time” అని విమర్శకులు అభిప్రాయపడిరి. ప్రతిభావంతుడైన ఇతడొక్కొక అపురూపమైన చిత్రమును ఒక్కొక శాఖకు చిహ్నముగా వెలయించి తన సమకాలిక చిత్రకారులును, సాధారణ ప్రజలును అత్యాశ్చర్యపడునట్లు చేసినాడు. అతని ప్రథమ చిత్రమునందు రావేలును, 'ఆకా ఫే'అను చిత్రమునందు పాత్ర చిత్రణ విధానమును "ఫెమ్మె సాల్బార్" అను చిత్రమునందును కొంతవరకు ఛాయావాద రీతులును కొంతవరకు మనకు గోచరించును. ఇదియే అతని ప్రథమదశ (blue period) యొక్క ప్రారంభము. తరువాత నతడు నీగ్రోశిల్పము లందలి స్వతంత్ర భావమును, కళాసౌందర్యమును, కని వాటి ప్రభావమునకు లోనయ్యెను. 'విలేజి ప్రెస్ ఒ టెర్రాగోనె' అను చిత్రమునందు 'సిజానె' యొక్క రచనా సంప్రదాయమును అనుకరించెను. తరువాత ప్రౌఢదశ (Rose period) ప్రారంభమయ్యెను. ఇందు సర్కస్ ప్రదర్శకుల జీవితమును, హెరెలిక్విన్సు యొక్కయు, ఎక్రోబా ట్సు యొక్కయు జీవితముల నితివృత్తములుగా గొని నాడు. ఇందు పికాసో 'బ్లూ పిరియడ్' నందుకంటే పరిపూర్ణత నొందెను. అతడు ఫ్యూచరిజమును మాత్రము ఆమోదింప లేదు. తిరిగి అతడు తనదృష్టిని ప్రదర్శనాత్మక చిత్రకళా సంప్రదాయమునుండి మరలించి ప్రాచీన సంప్రదాయములకు సులభరీతిలో మెరుగులను దిద్దెను. ఫెర్నీస్ ఎఫ్రాయిజన్ బోర్డు డిలా మెర్ అను చిత్రమునందు అతి వాస్తవికత (surrealism) పునరుద్భవించినది. అనంతమైన నూతన రీతులతో వివిధ రంగములలో విహరింపగల ఈ దక్షుని అనంతశక్తులకు ఆధునిక కళాకారులందరు జోహారు లర్పించవలసినదే.

ఆధునికులలో పాల్,క్లీ పాల్ నాష్, రాబర్టు, క్రిస్టఫర్ వుడ్, బెన్నికల్సన్, రోడ్రిగో, మొయని హారిన్, మాథోస్మిత్, వింఢాం మున్నగువారందరు ప్రాచీనాచార్యుల పద్ధతుల ననుసరించి తమకు రుచించిన మార్గమును సాధించిరి. ఈ విధముగ ఆధునిక చిత్ర కళా ప్రవాహము నిలుకడలేక నూతనమార్గముల సంతరించు కొనుచు ప్రవహించుచునే యున్నది. మూస:Rightపి. టి. ఆర్.

ఆధునిక భారతీయ చిత్రకళారీతులు :-భారతీయ చిత్రకళా చరిత్రలో ఆధునికయుగము అందును స్వాతంత్య్రప్రాప్తి తరువాత గడచిన కాలము చాల సారవంతమైనది. వ్యక్తిగత ప్రతిభల సవివర పరిశీలనకు పూనుకొనుటకు ముందు ఒక సర్వంకష సమీక్ష చేయుట అవశ్య