ఆదిభట్ల నారాయణదాసు
బహుళ చతుర్దశి బుధవారమున (1864) ఆదిభట్ల వేంకట చయనులుగారి వలన నరసమాంబగారియందు ఆష్టమ
గర్భమున సంజాతులయి యుండుటవలననే శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవులు ఈ రీతిగా వర్ణించిరి.
అల నారాయణుఁ డప్డు కృష్ణుఁడయి గే
యమ్మందు సంతోషముం
గొలిపెంగాని కవిత్వమందుఁ గొలువన్
కొం తేనియున్నోచుకోఁ
డల లోపమ్మును దీర్చుకోఁ దలచి కా
దా యిట్టి రూపమ్ముతో
నిల నారాయణదాస నామమున ని
ట్లేపారె నాఁ జెల్లదే.
నారాయణదాసుగారు దాదాపు అయిదు సంవత్సరముల వయస్సున తల్లిగారితో కలసి పార్వతీపురము వెళ్లిరి. అక్కడ నొక పుస్తకముల దుకాణములో భాగవతము చూచి తనకు కొని పెట్టు మని తల్లిని నిర్బంధించిరి. తల్లిగారి వద్ద సొమ్ము లేకపోవుటవలన కొని పెట్టలేకపోయెను, కాని నారాయణదాసుగారు చీకాకు పడుట దుకాణదారుడు చూచి ‘అబ్బాయీ! నీవు పద్యములు చదువగలవా? అటులయిన నీకు ఈ భాగవతమును ఉచితముగా నిచ్చెదను' అని పలికెను. అప్పుడు నారాయణదాసుగారు 'అయ్యా! నేను పద్యములు చదువగలను, మా యమ్మ అర్థము చెప్పగలదు' అని పలికి వెంటనే ఆ పుస్తకమును తెరచి రాగ యుక్తముగ పద్యములు చదువుటయు తల్లిగారు చక్కగా అర్థము చెప్పుటయు జరిగెను. నారాయణదాసు గారి కపుడు భాగవతము బహుమతిగా లభించెను.
నారాయణదాసుగారి రెండవ అన్నగారయిన సీతారామయ్యగారు విజయనగరములో నుండెడివారు. వారు నారాయణదాసు గారి తెలివితేటలను గ్రహించి వారికి ఆంగ్లేయవిద్య చెప్పించి, పెద్ద ఉద్యోగమిప్పించవలెనని అభిప్రాయ పడిరి. అందు వలన 13 ఏండ్ల వయస్సులో నారాయణదాసుగారు విజయనగర మహారాజాగారి కాలేజీలో ఆంగ్లేయ భాషను ప్రారంభించి ఆంగ్లేయ భాషయందును, సంస్కృతమందును, సంగీతమందును, విశేషముగ ప్రావీణ్యమును స్వయంకృషి చేతనే సంపా దించుకొనిరి.
శ్రీ నారాయణదాసుగారికి లయ జ్ఞానము పుట్టుకతోనే కలిగెను. వారు మెట్రిక్యులేషను క్లాసు చదువుచుండగా చెన్న పట్టణము నుండి కుప్పుస్వామి నాయుడు గారు అను హరిదాసు విజయనగరమునకు వచ్చి ధ్రువ చరిత్రమును హరికథా రూపమున చెప్పి శ్రోతలను రంజింప జేసిరి. నారాయణదాసుగారు కుప్పుస్వామి నాయుడుగారి హరికథను వినుటవలన, కవిత్వము చెప్పుటకంటెను, సంగీతము పాడుట కంటెను, శాస్త్రార్థము చేయుటకంటెను హరికథను చెప్పుటయే మిన్న యని గ్రహించిరి. గ్రహించుటయ తడవుగ హరికథను చెప్పవలెనను కోరిక వారికి మ్కలిగెను. కలిగి విశాఖపట్టణ వాస్తవ్యులగు ధూళిపాటి కృష్ణయ్యగారు రచించిన ధ్రువ చరిత్రమును ఆధారముగా తీసికొని భాగవతములోని కొన్ని పద్యములను, తాము స్వయముగా రచించిన కొన్ని పద్యములను. కొన్ని కీర్తనలనుచేర్చి సోదరుడగు సీతారామయ్య గారి ఇంటిలో ప్రప్రథమమున హరికథా కాలక్షేపమును చేసిరి.