Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/749

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిభట్ల నారాయణదాసు

వచ్చుచు, వెనుకకు వెళ్ళుచు, వంగుచు నృత్యమాడుదురు. బైగాలు' ఆటవిక జాతుల వారి పూజారులు.

ఆటవికుల నృత్యరీతు లన్నింటిలోను ముఖ్యమైనట్టివి 'ఒరియనుల' నృత్య జాతరలు. ఇట్టి నృత్యజాతరలు మన దేశమునందును, ప్రపంచములో మరెచ్చటను లేవేమో? కొన్ని వేల మంది ప్రజలు - స్త్రీలు, పురుషులు, వృద్ధులు, యువకులు — అందరును ఒక చోట జేరి నృత్యజాతరయందు పాల్గొందురు. ప్రాతమామిడితోటలు వీరి జాతరస్థలములు తెల్ల వారు సమయమున నృత్యజాతర ప్రారంభమగును. సుమారు పదిమంది బాలురు మామిడితోటకు పోవుదారిలో నాటబడిన జండాలను జూచి, ఆనందముతో వెట్టిగా కేక లిడుచు పల్లెలోనికి పరుగెత్తుదురు. ఆ చుట్టుప్రక్కల నున్న అన్ని గ్రామముల వారికి తెలియుటకుగాను, పల్లెల జెండాలను దెచ్చి నృత్యము జరుగు ప్రదేశమునకు పోవు దారిలో నాటుదురు.

జాతర వార్తయు, నృత్యజాతర వార్తయు పల్లెలలోకి ప్రాకిపోవును. కొన్ని క్షణముల క్రింద నిశ్శబ్దముగానున్న పల్లె లన్నియును జాతర = జాతర - జాతర అను శబ్దములతో ప్రతిధ్వనించును.

అందు గుంపులు గుంపులుగా జనులు అన్ని పల్లెల నుండియు జాతరజరుగుతోటకు చేరెదరు. సుమారు మధ్యాహ్నము రెండు గంటలకు వారలంకరించుకొందురు.

'డాయిడె డడా -డా రెడడా - డా రెడడా -డా'

అనురీతి మద్దెలలు మ్రోగ మొదలిడునవి. కొమ్ము వాద్యములు ధ్వనించును.

ఒక్కొక్క పల్లెవారు ఊరేగింపుతో నృత్యస్థలమునకు తరలి వచ్చెదరు. ముందు యువకులు కత్తులు, డాలులు మున్నగు ఆయుధములను, తమ పల్లెలకు చెందిన పతాకములను పట్టుకొని నడుతురు. చిన్న చిన్న బాలురు వింజామరలను, పెద్ద పొడుగుపాటి కఱ్ఱలను పూలమాలలు మున్నగువానితో అలంకరించి, పూర్వము రాజులకు పట్టబడు గొడుగులవలె పట్టుకొందురు. ఒక పల్లెనుండి వచ్చినవారిలో ఒకడు రాజుగారి అలంకరణముతో కఱ్ఱ గుఱ్ఱమును స్వారిచేయును. మరికొందరు యువకులు ఆ గుఱ్ఱముతోచేర్చి అతనినిగూడ తమ భుజములపై మోయుదురు. వారిముందు కొందరు వేటజంతువులవలె అలంకరించుకొని నడుతురు. వారి వెనుక స్త్రీలు,పురుషులు బారులుదీరి నడతురు. మామిడితోటకు జేరి వారందరు కలిసి ముందుకు వంగుచు వెనుకకు వెళ్లుచు, సముద్ర తరంగములవలె అందరు ఒకేసారి కాళ్ళనెత్తి అడుగులు వేయుచు చక్రాకారముగా తిరుగుచు నృత్యము చేసి మరల నిలబడుదురు. (అతిరమణీయముగా శరీరములను కదిలించుచు కొంతతడవు నృత్యమాడిరి.) ఇదియే 'ఖరియా' నృత్యము. సుమారు రెండువేల జనులు - స్త్రీలు, పురుషులు, వృద్ధులు వరుసగా నిలువబడి అందరు ఒకేసారి మృదంగ తాళముల ననుసరించి కాళ్ళనెత్తి భూమిపై కొట్టెదరు. తరువాత నృత్యములో వారికి వాద్యములతో పనిలేదు. వేలకొలదిజనులు ఏకకంఠముతో పాడుచు, కాళ్ళతో తాళలయలను జూపుచు, ఒకరినొకరు అంటుకొని నిలువబడి, గుండ్రముగా తిరుగుచు నృత్య మాడెదరు. కొంతసేపు నృత్యమాడి అలసిపోయినంతనే అందరు 'హుర్ ర్.... అని నినాదము చేయుదురు. వెంటనే అందరు శిరస్సులను ముందుకువంచి, రెండు కాళ్ళనుచేర్చి, పై కెగిరి భూమి దద్దరిల్లునట్లు అడుగువేసి కూర్చుందురు. ఒక నిమిషకాలము విశ్రాంతి కలుగగా, ఒక మూలనుండి పురుషకంఠము ఉద్రేకపూరితముగా ఓ... అని పిలిచినట్లు పాడును. ఆ రాగము నందుకొని మరల అందరు నృత్యమున కుపక్రమింతురు. ఇట్లు వారు అలసిపోవునంతవరకు నృత్యమాడి, సంధ్యవేళకు అన్ని పల్లెల వారు విడిపోయి నృత్యమాడుచు, తమ ఇండ్లకు పోవుదురు. ఇదియే 'ఒరియనుల' నృత్యజాతర.

స. రా.

ఆదిభట్ల నారాయణదాసు : ఆజానుబాహు విరాజితుడయి, బలిష్ఠమైన శరీరము, విశాల నేత్రములు, గొప్ప ఠీవి కలిగి హరికథ చెప్పు నవసరమున సిరిబొజ్జ నృత్యమునకు వింతగొలుప ఆడుచు, పాడుచు, సమయస్ఫూర్తిగా సభాసదులను కొనియాడుచు, ఆక్షేపించుచు, రంజింప జేయుచు‘హరిక థాపితామహు'డనుఖ్యాతి వహించినమహా విద్వాంసులు కీ. శే. శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు.

శ్రీ నారాయణదాసుగారు శ్రీకాకుళము జిల్లా పార్వతీపుర సమీపములో సువర్ణముఖి తీరమున నున్న అజ్జాడయను గ్రామములో రక్తాక్షి సంవత్సర శ్రావణ