Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/751

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిభట్ల నారాయణదాసు


సీతారామయ్యగారు ఆతని నృత్యమును వీక్షించి లెస్సగా మెచ్చి, హరికథ చెప్పునపుడు గజ్జెలు కట్టుకొని నృత్యము చేయుమని వారిని ప్రోత్సహించిరి. ఈ రీతిగా ప్రప్రథమమున తెలుగు దేశములో శ్రీ నారాయణదాసుగారు హరికథా కాలక్షేపము చేయుట జరిగెను. వారు మొదట హరిదాసులగుట యేగాక, హరికథా పితామహుడనియు ప్రసిద్ధి నొందిరి.

అప్పటినుండియు నారాయణదాసుగారు హరికథలు యక్షగానములుగా రచించి హరికథా కాలక్షేపములను ప్రారంభించిరి. నారాయణదాసుగారును వారి మరియొక అన్నగారగు పేరన్నగారును చిన్ననాటినుండియు కవలల వలె పెరిగిరి. పేరన్నగారు సంగీతములో మంచి ప్రావీణ్యమును, శ్రావ్యమగు కంఠధ్వనియు కలవారు. అందుచే వారు వెనుక పాట పాడుచు నారాయణదాసుగారి హరికథకు వన్నె తెచ్చెడివారు. నారాయణదాసుగారు మెట్రిక్యులేషను పరీక్షలో కృతార్థులయి ఎఫ్. ఏ. క్లాసులో చేరి మొదటి సంవత్సరము విజయనగరములో చదివిరి. ఆ తరుణములో వారి సంగీత సాహిత్యములు విశాఖపట్టణము కాలేజీలో ప్రిన్సిపాల్ డబ్ల్యు. రామయ్యగారిని ఆకర్షించెను.అందుచే ప్రిన్సిపాలుగారి కోరికపై దాసుగారు వారిగృహ మందుండి రెండవసంవత్సరము విశాఖపట్టణములో చదివిరి.

నారాయణదాసుగారు ఆంధ్రదేశములో అనేకపట్టణములలో 'హరికథా కాలక్షేపములు చేసి ప్రజల ఆదరాభిమానములకు పాత్రులైరి. మైసూరు మహారాజు వారి యాస్థానములో హరికథలు చెప్పి వీణవాయించి గొప్ప గౌరవమును పొందిరి. మలయాళ దేశములో హరికథలు చెప్పి కేరళపండితుల మన్ననలకు పాత్రులయిరి. కలకత్తాలో సంస్కృతములోను హిందీలోను హరికథా కాలక్షేపము లొనర్చి రవీంద్రనాథ ఠాగూరు మొదలగు వారిచే కొనియాడబడిరి. అట్లు ప్రసిద్ధిగాంచిన నారాయణదాసు గారినిగూర్చి పెక్కురు కవులు, పండితులు కావించి యున్న ప్రశంసల నన్నిటిని కూర్చినచో నవి యొక మహా గ్రంథముగా పరిణమింపగలవు. శ్రీ రాంభట్ల జగన్నాథ శాస్త్రిగారు నారాయణదాసుగారి నిట్లు ప్రశంసించిరి.

శ్లో. అనన్య సాధారణ శక్తి యుక్త
       స్స్వయం తు నారాయణదాస ఏకః
అన్యేతు సాధారణ శక్తియుక్తా
       స్పర్వేపి నారాయణదాసదాసాః,

నారాయణ దాసుగారి హరికథా కథనశక్తి అనన్య సాధారణ మైనది. అట్టి శక్తికలవారు వారొక్కరే కలరు. సాధారణ శక్తితోకూడిన శేషించిన హరికథా కథకు లందరు ఆ నారాయణదాసునకు భృత్యులవంటి వారే, అని పై శ్లోకమందలి భావము.

1919 వ సంవత్సరములో విజయనగరపు మహారాజా వారు సంగీత కళాశాలను స్థాపించి శ్రీ నారాయణదాసు గారిని అందు ప్రిన్సిపాలుగా నియమించిరి. నారాయణదాసుగారు ప్రిన్సిపాలుగా నుండిన కాలమున కళాశాలలో ఇతర శాఖలతోపాటు 'హరికథ' నొకశాఖగా ఏర్పాటుచేసి ఎందరో హరిదాసులను తయారుచేసిరి. వారు డెబ్బది మూడు సంవత్సరములు పూర్తియయినతోడనే 1936 వ సంవత్సరమున తమ ప్రిన్సిపాలు పదవినుండి విరమించు కొనిరి. దాసుగారి అసాధారణ ప్రజ్ఞను గుర్తించి ప్రభుత్వమువారు వారి కంతకు ముందున్న జీతమునే ఉపకారవేతనముగా నొసగిరి.

నారాయణదాసుగారు హరిదాసుగా గొప్ప పేరు పొందియుండిరి. అందుచే వారి హరికథా కథన కౌశల్య తేజస్సు వారి యందలి యితర ప్రజ్ఞలను గప్పివై చెను. వారు తమ ఇరువది నాల్గవయేటనే 'బాటసారి' యను ఆంగ్ల కావ్యము ననువదించిరి, పారసీక భాషలో గొప్ప కృషి చేసిరి; ఉమర్ ఖయ్యాం రచించిన 'రుబాయతు” లను సంస్కృతము లోనికిని అచ్చ తెనుగులోనికిని అనువదించిరి. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణపండితులు సయితము ఈ గ్రంథమును చాల మెచ్చుకొనిరి. ఆంగ్ల మహాకవి యగు షేక్స్పియరు రచించిన నాటకములలోను కాళిదాస మహాకవి వ్రాసిన గ్రంథములలోను గల నవరసములను మధించి తీసి వాటిలోని గంభీరభావములను తెలుగులోనికి మార్చి 'నవరస తరంగిణి' అనునొక మహాగ్రంథమును నారాయణదాసుగారు రచించిరి. వారు అచ్చ తెలుగులో గొప్ప ప్రావీణ్యము కలవారు. 'నూరుగంటి' అను పేరుతో ఈసప్ కథలను, 'వేల్పుమాట' యను నామముతో భగవద్గీతను, 'వెన్నుని వేయి పేర్ల వినుకలి' యను నామముతో విష్ణుసహస్రనామములను,