Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/737

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆక్వినాస్ థామస్

ముఖ్యభాగములు ఎంత వరకు దృశ్యవ్యక్తీకరణమునుకలిగి యుండవలెనో ప్రణాళికా రచయిత నిర్ణయింపవలయును. కట్టడమునకు అవసరమైన వ్యక్తీకరణమును బట్టియు, ముఖ్యభాగముల (Elements) ఔచిత్యమును బట్టియు,ఈ యంశము నిర్ణయింపబడవలెను. ఎత్తులు ఉద్దేశ్యము యొక్క స్పష్టమైన వ్యక్తీకరణమును ద్యోతకము చేయునట్లుగా ప్రణాళికా రచన గావింపబడవలెను.

ఈ ఉద్దేశ్యము యొక్క వ్యక్తీకరణము రూప సౌందర్యమును రచించుకృషితో సమ్మేళన గావింపబడవలెను.ప్రయోజనము (function) ప్రధానముగా ప్రణాళిక ఎట్లు రచింపబడవలెనో నిర్దేశించును.

ఉదాహరణమునకు :- ఒకానొక ఎత్తులో కిటికీలు లేని యెడల దాని అంతర్భాగము, పైనుండి వెలుతురు వచ్చునట్లు చేయబడినది, లేదా మానవనిర్మిత సాధనములచే వెలిగింపబడినది, అని మనము సులభముగా నూహింపగలము; అందుచే ఆ కట్టడము ఈ విధమైన వెలుగు అవసరమైన జాతికి జెందియున్నదని మనము తెలిసికొనవచ్చును.

లభ్యమయ్యెడి నిర్మాణ ద్రవ్యములను బట్టియు, వ్యయము యొక్క పరిమితులను బట్టియు, వాస్తువేత్త యొక్క ప్రణాళిక సాధారణముగా మార్పుచెందు చుండును. కాని అతని ప్రణాళికల యొక్క సాఫల్యము ప్రణాళికాకృతి రచనకు సంబంధించిన ఈ మూలాధారక సూత్రముల ననుసరించుటపై చాలవరకు ఆధారపడి యుండును.

డి. డి. బి.

ఆక్వినాస్ థామస్  :- ఇతడు ఇటలీ దేశస్థుడు. స్కౌలాన్టిసిసమ్ (scholasticism) అను తత్వశాస్త్రశాఖకు చెందినవాడు. ఆక్వినోయను సుప్రసిద్ధ వంశమువాడు. నేపిల్సు పట్టణమున జన్మించెను. మాంటి క్యాసినో నేపిల్సు లలో విద్య నభ్యసించి, డామినికన్ మతసంస్థలో చేరెమ. ఆల్బర్టప్ మ్యాగ్నస్ అను ప్రఖ్యాత పురుషు డితని గురువు. ఆరిస్టాటిల్ మతపంథకు చెందినవారిలో ఆక్వినాసు అగ్రగణ్యుడనదగును. చాల కాలము ఇతని గ్రంథముల కెక్కువ ప్రచారము లేకపోయెను. కాని 19వ శతాబ్దము నుండి వీటికి అత్యంతమైన ప్రాముఖ్యము లభించినది.

మధ్యయుగపు క్రైస్తవ మతాచార్యులలోను, విద్వాంసులలోను ఆక్వినాను అగ్రగణ్యుడు. జీవితము నందలి సమస్త విషయములను సమన్వయించి సృష్టిక ర్తకును, మానవునికిని, ప్రకృతికినిగల అంతరంగిక సంబంధమును వెలి బరచుటయే మధ్య యుగపు పండితుల ఆశయ మన వచ్చును. ఈ సమన్వయమును ఆక్వినాను కన్న సంపూర్ణముగ నేవ రును సాధించలేదనుట అతిశయోక్తి కానేరదు.

ఉత్కృష్టతను సాధించుట జీవితము యొక్క ధర్మమనియు, ప్రతి జీవియు తన స్వభావముచే ప్రేరేపింపబడి ఉత్కృష్టతను సాధించుననియు ఆక్వినాను బోధించెను. సృష్టి యందలి జీవులలో శ్రేష్ఠతర కక్ష్యయనియు, శ్రేష్ఠతమ కక్ష్యయనియు, రెండు కక్ష్యలను ఏర్పరచవలెననిన, జీవులు తమ ధర్మములను ఎంతవరకు సాధింపగలుగుదురో యనునదియే మనకు ప్రమాణము. ఈ రీతిగా జూచినచో సృష్టికర్తనుండి జీవకణము వరకును గల ఆంతరంగిక సంబంధమును, పరంపరయును గుర్తింపనగును. ఈ సృష్టి పరంపరయందు మానవుని స్థానము ముఖ్యమైనది. ఎందుకన అతనికి కేవలము భౌతిక లక్షణములేగాక ఆధ్యాత్మిక లక్షణములును కలవు. వివేకము అతని ప్రత్యేక లక్షణము.

ప్రకృతికిని, మానవ సంఘమునకును పోలిక గలదు. ప్రకృతియం దెట్లో అట్లే సంఘమునందును ఆశయములును, తదనుగుణములైన సాధనములును గలవు. ఆశయముల నెక్కువగ సాధింపగలవా రితరులకు మార్గదర్శకులై వారిని ఏలవచ్చును. సంఘము మానవవాంఛల సంతృప్తి కొరకు ఏర్పడినదనియు, సంఘమునందు ప్రతి వ్యక్తి కిని ప్రత్యేక లక్షణములును, సామర్థ్యములును గలవనియును, ప్రతియొకరును తమ తమ ప్రత్యేక కార్యములను, ధర్మములను ఆచరించుచు ఇతరులతో సహకరించిననే