ఆగమ శాస్త్రములు
సాంఘిక శ్రేయము చేకూరుననియు ఆక్వినాను సూచించెను. అన్యోన్య శ్రేయమును చేకూర్చుటయే మానవుల ఆశయము, ధర్మము.
ప్రజల హితమును పెంపొందించుట ప్రభుత్వ కర్తవ్యము. అధికారమును ప్రభువు ఒక నిధిగ పరిగణింప దగును. పరిపాలకు లీరీతి ప్రవర్తించినచో ప్రజలకు ఇహపర సుఖములు రెండును లభించును. ఐహిక సుఖములు రాజ్యమునకు సంబంధించినవి. అంతకన్న మహత్త్వముకల పారలౌకిక సుఖములు మతసంస్థకు చెందిన విషయములు. కాని పరిపాలకులు రాజధర్మమును చక్కగ నెరవేర్చినచో ఇహమునుండి పరము కూడ లభించును.
రాజ్యమునందలి అధికారము నైతిక ప్రమాణముల ననుసరించియుండవలెనని ఆక్వినాను స్పష్టపరచెను. వాటికి విరుద్ధముగ ప్రవర్తించు ప్రభుత్వమున కెదురు తిరుగుట ప్రజల హక్కు. కాని ప్రభుత్వోల్లంఘనము వలన తాత్కాలి కోపద్రవముకన్న ఎక్కువకీడు పొందరాదనుట ప్రజలు ముఖ్యముగ గమనింపవలయును. కాని ఈ యంశమును గూర్చి ఆక్వినాను విశదముగ వ్రాయలేదు. న్యాయము ప్రజల హితము కొరకు మానవుని వివేకము నుండి జనించినదనియు, ప్రజాహితమే తమ ధర్మముగ నెంచు ప్రభువులచే నిర్దేశింపబడినదనియు ఆక్వినాను నిర్వచించెను. సృష్టి యంతయు క్రమబద్ధమైనదనియు, మానవ నీతిధర్మములకును, దైవసంకల్పమునకును అత్యంతమైన సంబంధము కలదనియును, ఆక్వినాను యొక్క ఆశయము.
జి. ఎన్. ఎస్.
ఆగమ శాస్త్రములు :- భారతీయ తత్త్వశాస్త్రములలో ఆగమశాస్త్రములు మిక్కిలి ప్రధానములై, ఐహికాముష్మిక సుఖసంపాదకములై యల రారుచున్నవి.
లోకకల్యాణ సంపాదకములగు దేవాలయములయు, దేవతా విగ్రహములయు నిర్మాణప్రక్రియలను, వాని ప్రతిష్ఠలను, దేవతా సాన్నిధ్యము పెంపొందుటకై చేయవలసిన పూజా పురశ్చరణాది ప్రకారములను బోధించు శాస్త్రము - ఆగమ శాస్త్రము. భగవంతుని ఆగమమును గూర్చి తెలుపునదిగాన, దీనికి పేరు వచ్చియుండవచ్చును. ఈ శాస్త్రమునకు అనుబంధములు కానట్టి విద్యలుకాని, కళలుకాని, వీనిచే ప్రతిపాదింపబడని తత్త్వహిత- పురుషార్థములు కాని లేవనుట నిత్య సత్యమగు విషయము. వేదాంతాది శాస్త్రములు - ఆత్మ పరమాత్మలయు, ఇతర జగద్వస్తువులయు స్వరూపాదు లను, పురుషార్థ - తత్సాదనాదులను విశదీకరించుచున్నవి; ఆగమ శాస్త్రములన్ననో, అందరికిని స్వానుభవగోచరమగు నటుల వానిని ప్రదర్శించు చున్నవి. మొదటివి - తత్త్వబోధకములు, కడపటివి - తత్సాక్షాత్కార సంపాదకములు.
మరియు, జలమునం దంతర్ని గూఢమైన విద్యుచ్ఛక్తిని స్ఫుటముగ నావిర్భవింపజేసి, యంత్ర తంత్య్రాది పరికరములచే నిఖిల ప్రజానీకమునకును అందుబాటులొ నుండునటుల జేయుచున్న ఆధునిక విద్యుచ్ఛాస్త్రాదుల వలె పురాతనములగు నీయాగమ శాస్త్రములును పెక్కు సంవత్సరములకు పూర్వమే క్షీర సముద్రాదుల యందు నెలకొనియుండు వ్యూహ స్వరూపాదులనుండి దేవతాశ క్తిని ఆకర్షించి. పూర్ణకుంభమునను, తద్ద్వారమున యంత్రములయందును, దేవతా విగ్రహములయందును ప్రసరింపజేసి, ప్రతిష్ఠించి, పూజా పురశ్చరణాదులచే ఆశక్తిని దినదిన ప్రవర్ధమానముగ నొనరించి నిఖిల ప్రాణులకును, తత్తదభీష్టములను జేకూర్చునట్టి అద్భుత ప్రక్రియలను అనుభవ పురస్సరముగ ప్రసాదించు చున్నవి. విద్యుచ్ఛక్తి కేంద్రములవంటివే దేవతా శక్తి నికేతనములగు దేవాలయములును.
ఆగమ పదవ్యుత్పత్తి : దేవతల ఆగమమును గూర్చి తెలుపుచున్నందున దీనికి ఆగమశాస్త్రమని ప్రసిద్ధి కలిగియుండవచ్చును. లేక, వేదమునకువలె "ఆ - సమన్తాత్ గమ్యంతే నిఖిలాఅపి అర్థా ఇతి ఆగమః" అను వ్యుత్పత్తిచే జ్ఞాతవ్యములగు సమస్త విషయములను సమగ్రముగ దెలుపుచు, అలౌకిక శ్రేయస్సాధనరూపములగు అనేక ధర్మములను బోధించుచు నిత్య నిర్దుష్టములుగ నుండుటచే నిట్టి వ్యవహారము కలిగియుండవచ్చును.
"భావ = రాగ - తాళ" శబ్దముల ఆద్యాక్షర సమ్మేళనమున "భరత" శబ్దము నిష్పన్నమైనటుల, "ఆగత-గత ….మత" శబ్దముల ఆధ్యాక్షర సమ్మేళనమువలన "ఆగమ" శబ్దము నిష్పన్నమైనదని ఆయా ఆగమముల యందే నిర్వచించబడి యున్నది.