Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/735

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆకృతి రచనా సూత్రములు


ఐక్యమునకు భంగము కలుగనివిధముగా రచనలోని అన్ని ముఖ్యాంశములును, విభాగములును విని వేశితములు కావలెను.

ఆలేఖకుడు (designer) జాగ్రత వహించి, విసుగు పుట్టని విధముగా తన రచనను మనోహరముగ చేయవలెను. నేర్పుతో తారతమ్యములను లేక వైవిధ్యములను ప్రవేశ పెట్టుటచే ఇది సాధ్యపడును. నిర్మాణము నందలి యుక్తమగు తారతమ్యములచే యుక్త ప్రమాణములు చేకూరును. దాని ఐక్యముకూడ భంగమునొందదు. చక్కని ప్రణాళిక గల గ్రీకు, రోమను భవన భిత్తిశృంగముల (Cornices) ఆకారములు వైవిధ్య ప్రయోగమునకు చక్కని ఉదాహరణములు.

భవన భిత్తిశృంగములో దగ్గరదగ్గరగా వివిధములైన బాహ్య రేఖల అకృతులు ఉపయోగింపబడును. గోడ యొక్క ఉపరి భాగమున ఘనపదార్థములను, "కాళీలను సక్రమముగా నుపయోగించుట దీనికి మరియొక ఉదాహరణము, వాస్తు రచనలోని వివిధ అంశముల యొక్క పరిమాణము లందును, రూపములందును వైవిధ్యము (లేక తారతమ్యము) చూపుట దానిని ఆకర్షణీయముగా చేయుటకు మిక్కిలి అవసరము. వాస్తు సంబంధములైన అలంకారములు వాస్తు నిర్మాణములను, సజీవములనుగా చేయుటకై ఏదోవిధమైన వైవిధ్యముతో నిండియుండును. మంచి అలంకారములు ఎల్లప్పుడును నిర్మాణాత్మక రూపమును పెంపుచేయునవిగా నుండవలెను. అవి కేవలము ఇచ్ఛుచొప్పున తగిలించుటకు గాని, తొలగించుటకు గాని వీలగునట్లు అనుబంధములుగా నుండరాదు. నిర్మాణమునందు ఐక్యమును పదిలపరచుటకు వైవిధ్యము విశేష ప్రకటనము అను రెండు విషయములు ఆవశ్యకములు. కేవలము (1) పదార్థ స్థూలత చేతను, (2) అలంకారసంపద యొక్క కేంద్రీకరణము చేతను, (3) రంగు యొక్కయు, చాయ (tone) యొక్కయు, సౌష్ఠవము చేతను, (4) రేఖ యొక్క అభిరుచి చేతగాని సూచనను లేక ఊహను స్ఫురింపజేయు సూక్ష్మతర విధానాంతరము చేతగాని అధికతర ప్రాముఖ్యమును సంపాదింపవచ్చును.

చక్కని పరిమాణములును, మాపశ్రేణి (scale) యును మంచి ఆలేఖ్యాకృతికి కావలసిన, మరి రెండు అత్యవసర విషయములు. కొన్ని పరిమాణములు మిక్కిలి తృప్తికరములుగా నున్నట్లు కనుగొనబడినవి. అందుచే ఈ పరిమాణములును, నిష్పత్తులును జ్యామితితోడను, మొత్తము మీద గణితశాస్త్రము తోడను కొంత సంబంధమును కలిగి యున్నవను విషయమును కొందరు సూచించిరి. కొన్ని సుప్రసిద్ధములైన కట్టడముల యొక్కయు, అలంకారముల యొక్కయు పరిమాణములను ఏర్పరుచుటలో త్రిభుజము, చతురస్రము లేక వృత్తముల వంటి కొన్ని రేఖాగణితవు ఆకృతులతో స్పష్టమైన సంబంధము కనబడు చున్నదని రూఢిచేయబడియున్నది. సంగీతములోని సంగీతపద రచన (Musical phrasing) యొక్క నిర్మాణమునకును, వాస్తువునకును గొప్ప పోలిక కలదని కొందరు భావించుచున్నారు. ఏమనగా, రెండును గూడ సమ్మేళనము (Harmony) యొక్కయు, విరామముల (Intervals)యొక్కయు, లయ (Rythm) యొక్కయు సూత్రములతో సంబంధము కలిగియున్నవి. సంగీతములో వేగమునకు సంబంధించిన ప్రమాణ మున్నట్లు గనే, వాస్తుకళా వేత్తకూడ పరిమాణమునకు సంబంధించిన ఒక ప్రమాణము నుపయోగించును. పరిమాణ సంబంధము (proportion) ఎప్పుడును "కొలత" (scale) కు సంబంధించియే యోచించవలసి యుండును. చక్కని కొలత వివిధ భాగములకును, ఒండొంటితోడను, మొత్తముతోడను పరిమాణ విషయములో క్రమమైన సంబంధము” అని నిర్వచింప బడియున్నది. ఈ నిర్వచనము పరిమాణ సంబంధమునకుగూడ ప్రత్యక్షముగా అన్వయించును. పరిమాణము (size) యొక్క ప్రమాణము పరిస్థితులపై నాధారపడి యుండును. కాని సామాన్యముగా అది పురుష ప్రమాణముచే క్రమబద్ధము గావింపబడునదిగా నుండును. అనగా సరాసరి మానవుని పరిమాణమును, పరిమాణము విషయములో దానితో సంబంధించియున్న వస్తువులును అని అర్థము. 'కొలత' ను పాటింపక కట్టడముల ప్రణాళికాకృతి రచన సాగించిన యెడల కొలత యొక్క అసత్యభావ మేర్పడు గొప్ప ప్రమాద మెప్పటికిని కలదు. అట్లుచేసినచో కట్టడములు అవి నిజముగా ఉన్న వానికంటె పెద్దవిగా కాని, చిన్నవిగాకాని కనబడును. ఇది కొన్ని సుప్రసిద్ధ భవనముల విషయములోకూడ తటస్థించినది.