Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/734

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆకృతి రచనా సూత్రములు


మొదటి ముఖ్యలక్షణము కళారచన. అది కళావేత్త యొక్క ప్రత్యేకతచే ముద్రితమైయుండవలెను. రెండవ ముఖ్య లక్షణము కట్టడము యొక్క ఉద్దేశమును స్పష్టముగా వెల్లడిచేయవలెను. కళావేత్త సంపూర్ణమైన నిష్కాపట్యముతో ప్రయత్నము చేసినప్పుడే చక్కని కళాసృష్టి ఘటిల్లును. అట్టి సృష్టి ఎల్లప్పుడును కళావేత్త యొక్క వ్యక్తిత్వ విశేషమును ప్రతిఫలించుచుండును. అది రచన యొక్క చైతన్యమును, శక్తిని పెంపొందించును. కళావేత్త ఇతర కళారచనలనుండి ఉత్తేజమును పొందినను, లేక వాటిని అనుకరించినను, సావధానుడయి తన కళా రచనమును స్వీయశక్తిత్వములో మేళవింపవలయును. కేవలము ఇతరులనుండి ఎరువు తెచ్చుకొనుటగాని, అన్యులను అనుకరించుట గాని కళారచనమును చైతన్యవిహీనము గావించును.

భవన నిర్మాణమువలన దాని ఉద్దేశము వ్యక్తము కావలయునన్నచో అన్ని విషయములయందును ఆ యుద్దేశము ప్రస్ఫుటమగునట్లు జాగరూకతతోను, విమర్శ పూర్వకముగాను తయారుచేయబడిన ప్రణాళిక ననుసరించి ఆ భవనమును నిర్మించవలయును.

అకుటిలత్వము, అసందిగ్ధత అనునవి మూడవ ముఖ్య లక్షణమునకు చెందును. వ్యక్తీకరణములో ఎట్టి సంశయాత్మ కతయు ఉండరాదు; అంతేగాక, వ్యక్తీకరణము స్పష్టతతో గూడియుండవలెను, డొంకతిరుగుడు పద్ధతిలో వెల్లడించుటకు ఎట్టి ప్రయత్నమును చేయరాదు.

నాల్గవ ముఖ్యలక్షణము సరళత: చూచువారికి గాని చదువువారికి గాని సులభముగా అర్థముకాని వివరములు ఏ కళా రచనయందును ఉండరాదు. అనవసరములైన వివరము లుండరాదు. వివరములను తగ్గించుటవలన సరళత చేకూరును.

టాల్ స్టాయి ఈ విషయమును చాల రమణీయముగా ఇట్లు చెప్పియున్నాడు: “ఏ కొందరకు మాత్రమో అందుబాటులో నుండు భావానుభవము యొక్క ప్రత్యేకత శ్రేష్ఠత్వము యొక్క ఆదర్శముకాదు, విశ్వజనీనత యే దాని లక్షణము. పరిమాణాధిక్యము, దుర్గాహ్యత, రూపజటిలత - ఇవి నేటి లెక్కప్రకారము శ్రేష్ఠతాదర్శమునకు లక్షణములు కావు. అట్లుకాక సంక్షిప్తత, స్పష్టత, సరళవ్య క్తీకరణము - ఇవి దానికి లక్షణములై యున్నవి.” అత్యుత్తమ రచనకు చేర్చబడునదిగాని దానినుMడి తొలగింపబడునదికాని ఉండజాలదు. అనువిషయము ఎల్లప్పుడును జ్ఞాపకముంచుకొన దగినది.

బాగరూకతతో కూడిన ఆలోచనాపూర్ణత ప్రతి కళారచనకు వలసిన ఐదవదియు, కడపటిదియునగు ఆవశ్యకాంకము,

కళారచనమును శోభావంతముగా చేసెడి అలంకారములు, లేక వివరములు ఏరుకొనుటయందును, వాటిని అవలంబించుట యందును జాగరూకతయు సంపూర్ణాలోచనయు కావలసియున్నవి. అలంకారములు చాల నిగ్రహముతో నుపయోగింపబడవలెను. అవి అలంకార్య వస్తువునకు తగియుండవలయును. భూష్య వస్తువునకును, దానిధర్మమునకును అవి సరిపడనివిగా నుండరాదు; పొసగని స్థానములో వాటిని ఉంచరాదు.

ఎట్టికళారచనకు అయినను పైలక్షణములు అత్యంతావశ్యకములైయున్నవి. ఇవికాక వాస్తుకళావేత్త తనకట్టడము యొక్క ప్రణాళికాకృతిని రచించుటకు సాయపడు కొన్ని ప్రధాన సూత్రములను పరిశీలింపవలసియున్నాడు.

ఒక కట్టడము సాధారణముగ అనేకములగు భాగములతో గూడి యుండును. అవి వేర్వేరు పరిమాణములను, ఆకృతులను కలిగియుండవచ్చును. రచన సుందరముగా కనబడునట్లును, ఉద్దిష్టమైన ప్రయోజనమును కూడ నెరవేర్చునట్లును, కళావేత్త వాటిని యోగ్యముగా కూర్పు చేయవలయును. రచనలోని అంశము లన్నియు అనురూపత, సమత కలవిగ ఉండవలయును. అనేక భిన్న భాగములు క్రమ రహితముగా కేవలము గుదిగుచ్చినట్లు కనబడరాదు. రచన మొత్తము మీద ఏకీకృతమయిన సమష్టి వస్తువు అను అభిప్రాయమును కలిగింపవలయును. రచనలో ఒక 'ప్రధాన భావము"ను సృష్టించుట వలన ఇది సాధ్యపడును.

ఒక అంశముతో గాని భిన్న పరిమాణములుగల ఆనేక అంశములతోగాని అది ఏర్పడియుండవచ్చును. మొత్తము రచనలో అది కీలక స్థానముగా నుండవలెను. ఒకటికంటే ఎక్కువ స్థానములట్టివి (focal points) ఉన్నచో రచన యొక్క ఐక్యమునకు భంగము వాటిల్లును. రచన యొక్క