ఆంధ్రులు - వాణిజ్యము
ముఖ్యముగా చూడదగ్గది. ఈ నృత్యము బాగుగా తిలకించిన సంగీత రత్నాకరములోని సారంగదేవుని పిండోత్పత్తి నృత్య క్రమమును జ్ఞప్తికి తెచ్చును.
ఆలయము లందు దేవ దాసీలు నృత్యపూజ యందు పాల్గొనినను వీరశైవము మన దేశములో ప్రబలముగా నున్నప్పుడు శైవ మతస్థులలో పురుషులు గూడ ఆరాధన నృత్యములు చేసెడివారు. ఆ నృత్యములకే 'వీరనాట్యమ'ని పేరు. చేతఖడ్గము, డాలు ధరించి ఖడ్గము లనెడు రచనలను గానము చేయుచు, గంభీరముగా వీరంగము పలుకుచుండగా వీరావేశముతో వీరముష్టి నర్తకులు నాట్యమాడెడు వారు. ఈ నృత్యము తాండవ పద్ధతికి చెందినట్టిది. ఇట్టివే అమ్మవారు పూజలందు ప్రదర్శింపబడు గరగల నృత్యములు, సింహాచల స్వామి ప్రీత్యర్థము చేయబడు సేవ, పల్నాటిసీమలో వీరుల కొలుపులందు ప్రదర్శింపబడు కొలుపు నృత్యములు. " ఈ నృత్యరీతులుగాక ఆంధ్ర దేశములోని అరణ్యములలో నివసించెడు ఆటవికుల - (కోయలు, చెంచులు, గోండులు, సుగాలి, సవరలు మొదలైనవారు) నృత్యము లనేకములున్నవి. ఇందు ప్రకృతి ఆరాధన నృత్యములు, ఋతువుల నృత్యములు ముఖ్యము. ఇవన్నియును బృంద నృత్యములు. పర్వదినములందు కొన్ని వందలమంది స్త్రీలు పురుషులు ఒకచోటగూడి యీ నృత్యములందు పాల్గొందురు, వీరి నృత్యము లయ ప్రధానమయి, సాధారణముగా త్రిశ్రగతిలోనుండును.
ఇంతవరకు రాత్రులందు దీపాల వెలుగులో ప్రదర్శించెడు నృత్యకళను గూర్చి మాత్ర ముచ్చరింపబడినది. అట్లు గాక దినమందే వివిధ వేషములు ధరించి ప్రజలను రంజింప జేసెడు పగటి వేషములవారు గూడ మనదేశములో నున్నారు. ఈ పగటి వేషములవారు అతిపురాతన కాలము నుండి మన దేశములో నుండిరి. కళింగ గంగరాజు పగటి వేషముల వారితో జేరి శత్రువులను జంపినట్లు ఒక కథ ప్రచారములో నున్నది. భాగవత మేళములవారివలెనే వీరుగూడ తమ విద్యను దేశకళ్యాణమునకు ఉపయోగించిరి.
ఆంధ్రుల నృత్యకళకు-తంజపురినేలిన నాయక రాజుల కాలము స్వర్ణయుగముగా పేర్కొనవచ్చును. ఆ కాలము నందే యక్షగానము ప్రభువుల ఆదరణములో శాస్త్రీయ నృత్య సంప్రదాయముగా వృద్ధిపొందినది. నాయక రాజులు కళా పోషకులేగాక, స్వయముగా అనేక యక్షగానములను రచించిరి. ఆకాలములో చౌపదకేళిక, దురుపద కేళిక, పద కేళిక', నవపదము, జక్కిణి, కొరము, పేరిణి, దేశి, మదన బలద్యూతము, కందుక క్రీడ, గుజ్జరి, దండ లాస్య, కోపు, చిందు, వాల్విచి, విల్వేడు, గుజరాతి దేశి, శుభలీల, కొరవంజి _ అను 19 రకముల నృత్యరీతులు రాజదర్బారులోని నర్తకిణులు ప్రదర్శించెడువారు. ఆ కాలమందే కచ్చేరి నాట్యము క్రమపద్ధతిని ప్రదర్శించు విధానము ఏర్పరుపబడినది. తరువాత వచ్చిన మహారాష్ట్ర రాజులుగూడ అనేక యక్షగానముల రచనను జేసి నృత్య కళను పోషించిరి. రాయల కాలములో రాణివాసము వారు నృత్యకళ నారాధించినట్లు చరిత్రలవలన తెలియుచున్నను, నాటి నృత్యరీతుల స్వరూపము మాత్రము తెలియవచ్చుటలేదు. కాకతీయ ప్రభువుల కాలములో ఆరాధన నృత్యకళ ప్రసిద్ధిగాంచినది. కాకతీయుల నాటి ఆలయములను తిలకించిన గర్భగుడి కెదురుగా, నందికి వెనుకనే దేవదాసీలు నృత్యమాడుటకు సుమారు ఎనిమిదడుగుల వ్యాసముగల్గిన వలయాకారపు చదునైన రాతి నమర్చెడువారు. నర్తకి ఆరాతిపై నృత్యము చేసెడిది. ఇట్టి ఏర్పాటు హిందూ దేశములోని మరి ఏ ఆలయము నందును గానరాదు, కాకతీయులు నిర్మించిన ఆలయము లందు మాత్రమే యిట్టి నృత్య వేదికల యేర్పాట్లున్నవి.
ఆనాటినుండి నేటివరకు ఆంధ్రదేశములో నృత్యకళ పెంపొందిన విధమునుగూర్చి యిందు సూత్రప్రాయముగ చర్చించబడినది. ఇచ్చట పేర్కొనిన నృత్యరీతులను గూర్చియు ఆయాపద్ధతులను గూర్చియు విపులముగా నిచ్చట వివరించుట కవకాశము లేదు.
స.రా.
ఆంధ్రులు - వాణిజ్యము :- క్రీస్తుకు పూర్వకాలమున ఆంధ్రదేశము అరణ్యములతో నిండియుండి, చిరుత పులులు, పెద్దపులులు, ఏనుగులు, పాములు మొదలగువానికి ఆకరమై అక్కడక్కడ నివాసము లేర్పరచు కొన్న జాతులతో జనపదములతో విలసిల్లి యున్నట్లు