Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/711

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రులు - నృత్యకళ (చరిత్ర)


ప్రదర్శించే సంప్రదాయము లేదు. 'అడవు' అనగా ఒక నృత్తహస్తమును, దాని కనుగుణముగా పాదవిన్యాసము చేర్చి, వివిధగతుల ప్రస్తారముచేసి ముగించుట. అడుగులకు ఇట్టి క్రమము లేదు. మృదంగగతిని గాని, జతిని గాని అనుకరించి, లయ ప్రాధాన్యముగా పాదసంచలనముచేసి ముగించుట అడుగు. శబ్దములు, పద కేళికలు, దరువులు నృత్యమున కనువైన రచనలు. ఈ వర్ణనాత్మక రచనలకు ఆంగికాభినయము (ముద్రాభినయము) ప్రదర్శించుచుండెడు వారు.

పై తరగతి రచనలన్నింటియందును నృత్త నృత్యములకు అవకాశమున్నను, భారతీయనృత్యకళకు తలమానికమైన సాత్వికాభినయమునకు ఈ రచనలు ఉపయోగించవు. కావున నర్తకులు నృత్త నృత్యములతో తృప్తిచెందవలసి వచ్చినది. ఆ లోటును గూడ తీర్చి, మన నృత్యకళకు సంపూర్ణత్వముచేకూర్చుటకేగాబోలు క్షేత్రయ్య పద రచన చేసెను. ఈ పదములు విలంబిత లయను గలిగి, శృంగార రస ప్రాధాన్యమై, నాయికానాయకులకు సంబంధించి యుండుటచే దేవదాసీలు పదాభినయముద్వార సాత్వికాభినయమును ప్రదర్శించి తమ కళకు సంపూర్ణత్వము చేకూర్చుకొన్నారు. నాటివరకు దరువుల కిచ్చిన అగ్రస్థానము ఇపుడు పదములకు లభించినది. భాగవత మేళములవారు గూడ తమ నాటకములలో రసవర్ఘట్టముల నభినయించవలసినపుడు, దరువులతోపాటు పదరచనలను గూడ అభినయించుట ప్రారంభించిరి. ఈ రీతిని ఆలయములలో ఆరాధనకళగా ప్రారంభమైన దాసీల నృత్త ప్రధానమగు కళ, క్రమముగా రాజదర్బారులలో నృత్త నృత్య అభినయాదులలో వికాసముజెంది, పరిపూర్ణత నొంది, సంపూర్ణకళగా విరాజిల్లినది. కురవంజి రూపములో నుండిన దేశీయకళ, భాగవత మేళ పండితులచే సంస్కరింపబడి వీధి నాటకములుగా ప్రఖ్యాతిగాంచినది. బ్రాహ్మణమేళములవారు అనేకవిధములైన శాస్త్రీయ విధానములను యక్షగానములందు ప్రవేశ పెట్టినను, జక్కులవారి విద్య మాత్రము ఇంకను ప్రాచీన దేశి సంప్రదాయము ననుసరించియే ప్రదర్శింపబడుచున్నది. వీరి కథ నడుపువిధముగాని, దరువుపట్టుగాని అతి ప్రాచీనముగా నుండును. వీధి నాటకముల పూర్వపు 'దేశి' స్వరూపమును మనము తెలంగాణములోని 'బహురూపుల' కళయందును, ఆంధ్రప్రాంతములోని జక్కుల, యానాది, దాసరి భాగవతుల నాట్యములందును చూడగలము.

ఇవి గాక తోలుబొమ్మలాట, బొమ్మలాటగూడ మన దేశములోని ప్రచార నృత్యకళలలో ప్రాముఖ్యము వహించిన విద్యలు, తోలుబొమ్మలాట అతి ప్రాచీనమైన విద్య. క్రీస్తు పూర్వము శాతవాహనుని కాలమునుండియు తోలుబొమ్మలాట తెలుగు దేశములో ప్రచారములో నున్నట్లు చరిత్రలు చాటుచున్నవి. ఆంధ్రదేశమునుండియే యీ విద్య, మన నృత్యకళతోపాటు బలి, జావా ద్వీపములకు ప్రాకినది. హరికథ, బుర్రకథ, పంబలకథ మొదలైన వినోదములుగూడ పురాతన యక్షగాన విద్యనుండి చీలి, ప్రత్యేక కళలుగా ఏర్పడిన విద్యలు.

ఈ నృత్యరీతులేగాక నారాయణతీర్థయతీంద్రుల వారిచే రచింపబడిన 'కృష్ణలీలా తరంగిణి' లోని తరంగముల నృత్యమాడు ప్రత్యేక నర్తకులు గూడ ఆంధ్రదేశములో నుండిరి. తరంగముల నృత్య యొక ప్రత్యేక కళ. తరంగ నర్తకులకు తాళ లయలు స్వాధీనమందున్నట్లు మరొకరి యందు గానము, తాళమును విన్యానము చేయుచు నృత్యము చేయుట చూచినప్పుడు, వారు 'లయతో ఆడు కొనుచున్నారా ?' అనిపించును.

బోగమువారి కచ్చేరి విద్య మూడు విధములుగా విడిపోయినది. మేళములు, మేజువాణి, ఏక పాత్రనృత్యము. బోగము మేళములందు సుమారు పండ్రెండు మంది స్త్రీ లుందురు. వారిలో శాస్త్రము నెరిగిన నర్తకి పెద్దగా (నాయకురాలుగా) నుండును. మేళములందు నృత్త, నృత్యములు మాత్రమే ప్రదర్శింపబడును. సాధారణముగా ఈ నృత్యరీతి ఊరేగింపులకు ఎక్కువగా నుపయోగించును. మేజువాణియందు ప్రతి నర్తకి తన యొక్క విద్యను ప్రదర్శించుటకు అవకాశముండును. పదములు, వర్ణములు, శ్లోకములు మొదలైన ప్రసిద్ధ రచనలు ముఖ్యముగా అభినయించెదరు. అభినయమే ప్రత్యేకముగా మేజువాణిలో చూడవలసిన విశేషము. అలంకార శాస్త్రము, భరతశాస్త్రము నెరిగి, కావ్యపురాణేతి హాసములందు పాండిత్యముగల్గిన నాయకురాలు సాధారణముగా మేజువాణీలో 'పదము' నభినయించును.