Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/710

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రులు - నృత్యకళ (చరిత్ర)


అట్టి శొచనీయపరిస్థితిలో మన నృత్యకక పూర్తిగ నశించిపోకుండ కాపాడుటకు, 'నాట్యమేళములు' మన దేశములో ఉద్భవించినవి. శాస్త్రము నెరిగిన బ్రాహ్మణ పండితులు, ఈ మేళములను సృష్టించిరి. వీనియందు స్త్రీలకు స్థానములేదు సరిగదా, స్త్రీలు నృత్యమాడుట యీ మేళములవారు పూర్తిగా బహిష్కరించిరి. వీరి నాటకములందు స్త్రీ పాత్రమును గూడ పురుషులే ధరించెదరు. వీరు జట్టులుగా తయారయి, దేశములోని మారుమూల పల్లెలుగూడ సంచారముచేసి, ప్రదర్శనము లిచ్చి, నృత్యగీతములద్వారా మన పురాణేతిహాసములలోని రసవంతమైన ఘట్టములను అభినయించి, నాట్యమాడి సామాన్య ప్రజానీకములో మత ప్రచారము చేసెడు వారు. కనుక వీరికి ప్రచార నర్తకులని పేరువచ్చినది. ఆదిలో వీరు శివసంబంధమైన కథలనే నృత్యమాడు చుండిరి. కృష్ణభక్తి దేశములో ప్రబలిన తరువాత కృష్ణపరమైన భాగవత కథల నాడుట మొదలిడిరి. నాటి నుండి వీరిని భాగవతులనియు, వీరు ప్రదర్శించు నాట్యమేళములను భాగవతము లనియు పిలుచుట ఆచారమైనది. ఈ కాలమునుండియే దాసీల నృత్యకళను నట్టువ మేళము లనియు, నాట్య మేళములవారిని భాగవతులనియు, పిలుచుట ప్రారంభమయినది. ఈ భాగవతులలో కూచిపూడివారు ముఖ్యులు. వీరు బ్రాహ్మణులు. సంగీతము. భరతము, మంత్రశాస్త్రముల నెరిగిన వేదాధ్యయన పరులు, కూచిపూడి భాగవతులకు భరతవిద్య నేర్పినవారు యోగి సిద్ధేంద్రులవారు. వీరు 'పారిజాతాపహరణము' అను నాటకమును రచించి కూచిపూడివారికి నేర్పిరి. నాటి కూచిపూడివారు, వారి తరువాత తరములవారు కూడ నృత్యము నారాధించుటకుగాను, గోల్కొండ నేలిన తానీషా యొద్దనుండి కూచిపూడి అగ్రహారమును దానముగా బడసిరి. అంతియేగాక కూచిపూడిలో పుట్టిన ప్రతి బ్రాహ్మణ బాలుడు యుక్త వయస్సు వచ్చినంతనే, నృత్యవిద్య నభ్యసించి, తన జీవితములో నొక్కసారైనను గజ్జెకట్టి, ఆలయములో స్వామి కెదురుగా, భామకలాప మాడవలెనని శాసించిరి. ఆ సంప్రదాయమును నేటికిని కూచిపూడి వా రనుసరించుచున్నారు. కలాపములతో ప్రారంభమైన వీరి విద్య కాలక్రమేణ, వీథి నాటకములలో పరాకాష్ఠ నందు కొన్నది. కథననుసరించి అనేక పాత్రములు ప్రవేశ పెట్టబడి, ఆ పాత్రములచే మాట్లాడించు విధానము వీధి నాటకము లందు గాననగును. అట్లు ప్రవేశించు పాత్రముల సంభాషణములు 'దరువుల' రూపములోను, ద్విపద,సీసార్థము, సీసము, కందార్థము, కందము మొదలైన దేశీయ ఛందస్సులందును, చంపకమాల, ఉత్పలమాల, పంచచామరము, శార్దూలము మొదలైన వృత్తము లందును రచింపబడినవి. ఈ రచనలద్వారా రాగములకు ప్రాముఖ్యము హెచ్చినది. మరియు వృత్త ప్రాధాన్యము తగ్గి, నృత్యము పెంపొందినది.

పై విధముగా భాగవత మేళములవారు కళా సంస్కరణోద్యమమును ఆరంభించి, కళ యొక్క శాస్త్రీయతను, పవిత్రతను కాపాడుటకు పాటుపడుచుండ రాజ దర్భారులలోని నృత్యకళగూడ పెక్కు మార్పులను చెందినది. రాజనర్తకులు యక్షగానములలో - శాస్త్రీయ నృత్త నృత్య అభినయ రీతులను ప్రవేశ పెట్టినను వారు నృత్య నాటకముల ప్రదర్శనములతో సంతృప్తి చెందలేదు. యక్షగాన పద్ధతిలో ప్రదర్శింపబడిన నాటకములోని నృత్త నృత్యములు కథ ననుసరించి చేయబడుటచే ఒక క్రమపద్ధతిలో నుండ వీలులేదు. నాటకము ననుసరించి అందలి పాత్ర పోషణార్థము, దరువు లేర్పరుచబడి యుండుటచే నర్తకి కొన్ని నిబంధనములకు కట్టుబడి యుండవలె గావున నృత్త నృత్యములందు విజృంభించి తన ప్రతిభ వెల్లడించు అవకాశములేదు. ఈ లోటులను దీర్చుటకే రాజాస్థానములలోని సంగీత విద్వాంసులు నాటక కథతో సంబంధము లేకుండ, సంగీత ప్రాధాన్యమై, నృత్తనృత్యములందు పూర్తిగా నర్తకులు తమ పాండిత్యమును ప్రదర్శించుటకు అనువైన రచనలు చేసిరి. అవియే స్వరపల్లవులు, జాతిస్వరములు, శబ్దపల్లవులు, శబ్దములు, కేళికలు, పద కేళికలు, చౌవదకేళికలు, దురువద కేళికలు మొదలైనవి. స్వరపల్లవులు, శబ్దపల్లవులు, జాతిస్వరములు నృత్తమున కనువైనట్టి రచనలు. ఇందు నర్తకి పల్లవి నాధారముగా జేసికొని, వివిధరీతుల రాగమును సంచారము చేసి, వివిధ జాతులలో అడవులు ప్రదర్శించెడిది. నాటినుండే నృత్త 'అడవుల' కూర్పు ప్రారంభమైనది. తత్పూర్వము నృత్తమందు అడుగులే గాని అడవులు