Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/709

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రులు - నృత్యకళ (చరిత్ర)


దేవళములోని మూర్తి ననుసరించి, స్వామికి ప్రీతిని కలిగించునట్టి కరణాంగహారములతో కూర్చబడిన నృత్యములు మాత్రమే ప్రదర్శింపబడెడివి. అంతియేగాక ప్రాతః కాలమున కొన్ని నృత్యరీతులు, ప్రదోష కాలమన కొన్ని నృత్యరీతు లుండెడివి. అట్టివే శివాలయములలో ప్రదర్శించెడు సంధ్యానృత్యము - భుజంగత్రాస. ఆలయనృత్యము లన్నియు, నృత్తప్రాధాన్యమైనట్టివి. ఇందు రేచకములు, కరణములు, అంగహారములు, మండలములు, శాస్త్రీయ క్రమము ననుసరించి ప్రదర్శించుటయేగాక, ఈ నృత్యములలో నుపయోగించిన తాళములుగూడ గణపతి, ఇంద్ర, విష్ణు, రుద్ర మొదలయిన అపూర్వ తాళములు, నృత్తము ఆయా తాళముల క్రియల ననుసరించి కూర్చెడివారు,

ఆలయము వెలుపల వినోదార్థము ప్రదర్శింపబడిన నృత్యరీతులే కురవంజి, యక్షగానములు. ఈ నృత్యములకు శాస్త్రముతో సంబంధము లేదు. 'నాట్యధర్శి' కన్న 'లోకధర్మి' యే యిందు విశేషముగా ప్రాముఖ్యము వహించును. ఇది దేశీయ విద్య. ఆలయ నృత్యములను 'మార్గ' నృత్యరీతులుగా, కురవంజి నృత్యములను 'దేశి' నృత్యరీతులుగా పేర్కొనవచ్చును. లయ ప్రాధాన్యమైన అంగచలనము ఈ నృత్యములలోని విశేషము. ఒక పురాణ గాథ ననుసరించి వీరు నృత్యముసల్పినను, కథను పాడుచు మధ్యమధ్యన ఉత్సాహముగా నుండుటకుగాను, ఆ గీతము యొక్క లయకు తగినట్లు అడుగులు వేయుదురు. హస్త విన్యాసము (ముద్రాభినయము) వీరికి తెలియదు. ఈ నృత్యరీతిలో తాళము కంటెను, లయ కెక్కువ ప్రాధాన్యము ఉండెడిది. కురవంజి అనగా 'కురవలు' మొదలైన ఆటవికుల 'అంజి' నృత్త విశేషము. దీనినే 'చిందు' అనిగూడా పిలుచుట కద్దు. అట్లే యక్షగానము-యక్షుల (జక్కుల) గాన పద్ధతియై యున్నది.

కురవంజి, యక్షగానములందు ఆదిలో ఒక్కరే నృత్య మాడుచు కథచెప్పెడు వారు (నేటి కాలపు హరికథల వలె). అటుపై సింగి, సింగడు అను పాత్రలు సృష్టింపబడినవి. వీరిద్దరును కథలోని వివిధ పాత్రలుగా మారి నృత్య మాడెడువారు. తరువాత కొంతకాలమునకు కథను నడుపుటకుగాను కోణంగి (చోడిగాడు) అనుపాత్ర ప్రవేశ పెట్టబడినది, ఈ మూడుపాత్రలే కథనంతయు నడపెడు వారు. నృత్యమందు వీరు పాడెడు సంగీతరచనలు -త్రిపుటలు, అర్థ చంద్రికలు, జంపెలు, ధవళములు, శోభనములు, ద్విపదలు, కందము మొదలైనవి, లయ ప్రాధాన్యము కలవై, నృత్తమునకు మాత్రము అనువైనట్టి రచనలు, గరుడాచల యక్షగానము (చెంచులక్ష్మినాటకము) శ్రీగిరికురవంజి, సుగ్రీవ విజయము ఈ తరగతికి చెందిన ప్రాచీన యక్షగానములు.

నృత్యమందు పూర్వకథ ననుసరించి అనేక పాత్రములను ప్రవేశపెట్టి, ఆ పాత్రములచే మాట్లాడించు విధానము తరువాత వచ్చిన వీధినాటకములందు గాననగును.

కాలక్రమేణ దాసీల నృత్యము ఆలయము దాటి ఆలయ ప్రాంగణము ప్రవేశించినది. ఉత్సవమూర్తిని ఊరేగించి కళ్యాణమంటముపై అధిష్ఠింపజేసి, ఆ స్వామి కెదురుగా నృత్యము సలుపబడెడిది. ఆ నృత్యము అభినయ ప్రాధాన్యమై, ఆరాధన ప్రాధాన్యము తగ్గి అచ్చట చేరిన ప్రేక్షకుల వినోదమునకు చేయబడెడు ప్రదర్శనముగా తయారైనది. ఆలయములో మాత్రము, మూల విరాట్టున కెదురుగా దాసీలు శాస్త్రీయ నృత్యములనే ప్రదర్శించేడు వారు. పిమ్మట కొంతకాలమునకు దాసీల నృత్యకళ, గణికలద్వారా, రాజాంతఃపురము ప్రవేశించినది. దర్బారు విద్య శాస్త్రీయ కళయైనను, ఆధ్యాత్మిక భావముల కంతగా విలువ నివ్వక, రాజసభలలోని పండిత, రసిక జనులకు విజ్ఞానముతోగూడిన వినోదము నిచ్చెడిది. పామర జన రంజకముగా నుండి, ప్రకృతిపై ఆధారపడుచుండిన 'దేశికథ' యగు కురవంజి, యక్షగానములకు గూడ శాస్త్రము నెరిగిన పండితుల ఆదరము లభించినది. రాజ సభలలో ఈ విద్యకు ఆదరము లభించినంతనే భరతవిద్య యందు పాండిత్యముగల ఆచార్యులు యక్షగానములను రచింప మొదలిడిరి. ఈ యక్ష గానములను రాజమందిరములలోను, పల్లెపట్టణములందును భరతమును, అభినయమును తెలిసిన వేశ్యలు ప్రదర్శించెడువారు. కాని ప్రభువుల రంజింప జేయుటయే వీరి ప్రథమ కర్తవ్యమగుటచే, వీరి యొక్క కళయందు శాస్త్రభాగము నానాటికి క్షీణింపజొచ్చినది. ఆ విద్యతోపాటు, వేశ్యల జీవిత విధానము గూడ ఈ కళకు కళంకము తెచ్చినది.