Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/708

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రులు - నృత్యకళ (చరిత్ర)


మొదలయినవారు చాల గట్టివారు. తిరుమల రెడ్డి ఆ కళాశాలలో ఛార్లెసు జిరార్డు (Gerard) ప్రిన్సిపాలుగా ఉన్నప్పుడు వారిచెంత కళ నుపాసించిరి. ఆయన ప్రచురించిన 'చిత్రవృంతము' (Album) చూచినప్పుడు ఆ కళాశాలలో ఇయ్యబడిన ఉత్తమ శిక్షణము బోధపడుచున్నది. గురుశిష్యులకు ఎట్టి సంబంధము ఉండేడిదో జిరార్డుగారు వ్రాసిన తొలిపలుకులో తెలియుచున్నది. రెడ్డి, పాశ్చాత్య ఇంప్రషనిష్టుల వర్ణ విన్యాసమును అలవర్చుకొన్నాడు. బొంబాయిలో ఇప్పుడు ప్రసిద్ధులైన హస్సేన్, ఆరా మొదలయిన చిత్రకారుల కృషి బిజాలు వీరి చిత్రాలలో కలవు. వీరి స్టిల్ లైఫ్ చిత్రములు చాల హృదయం గమముగా ఉన్నవి. దీనదయాళ్ సుమారు 70 సంవత్సరాల వయస్కుడు. ఐనను యువకునివలె నేటికిని చిత్రకల్పన చేయుచునే ఉండును. ఆయన దారుమూర్తులను సృజించుటలొ అందెవేసిన చేయి.

అనుశ్రుతమయిన దక్కను కలమునకు చెందిన చిత్రకార కుటుంబమువారు వెంకటరామయ్య, బాణయ్య అనువారు. వీరు నిజామలీఖాన్ దర్బారులో ప్రఖ్యాతి గాంచిన వెంకటాచలం అను చిత్రకారుని వంశమునకు చెందినవారు. వారి చిత్రములు అచ్చముగా పూర్వపు చిత్రములను పోలి ఉండును. సాలార్ జంగు మ్యూజియములోను, విదేశీయుల సంకలనములలోను ఆ చిత్రములు గలవు.

ప్రస్తుతము ఢిల్లీలో ఉన్న కుమారిలస్వామి తెలంగాణమునకు చెందిన చిత్రకారుడే, దేశము స్వతంత్రమై చిత్రకళ ఒక క్రొత్త తేజము వెలయించుచున్న యీ సమయములో హైదరాబాదు నగరము ఆంధ్రదేశమునకేగాక దక్షిణాపథమున కంతటికిని కళాకేంద్రము కాగల అవకాశము లెన్నో కలవు.

మొ. కృ.

ఆంధ్రులు - నృత్యకళ (చరిత్ర)  :- నృత్యకళ ప్రారంభదశలో రెండు విధములుగా నుండెను.

1. ఆరాధన నృత్యములు :- ఇవి ఆలయము లలో జరుగును.
2. వినోద నృత్యములు :- ఇవి ఆలయముల వెలుపల జరుగుమ

రెండవదశలో నృత్యకళ నాల్గు విధములయ్యెను. 1. ఆరాధన నృత్యకళ :- ఇందు దేవదాసీల నృత్యములు, గరగల నృత్యము, సేవ, కొలుపు, వీర నాట్యము - మొదలయినవి చేరియుండును.

2. ప్రచార నృత్యకళ  :- ఇందు కూచిపూడి భాగవతులు, గొల్లభాగవతులు, జక్కులభాగవతులు, బహురూపులు, యానాది భాగవతులు, మాలదాసరులు మున్నగువారి నృత్యరీతులు, కలాపనాట్యమేళములు, తోలుబొమ్మలు, బొమ్మలాట, పగటి వేషములు చేరును.

3. కచ్చేరి నాట్యము  :- ఇందు భోగము మేళము, మేజువాణి, భరతనాట్యము చేరును.

4. జానపద నృత్యకళ  :- ఇందు గొబ్బి, కోలాటము, తప్పెటగుండు, చిరుతల భజన, బుట్టబొమ్మలు, మాయ గుఱ్ఱములు, డోగాట, ఒతకమ్మలాట మొనలైనవి చేరును.

ప్రాచీనాంధ్రదేశములో నృత్యకళ రెండు విధములుగా ప్రచారములో నుండినది. 1. ఆలయములలో దేవదాసీలచే చేయబడిన ఆరాధన నృత్యములు. 2. ఆలయ ఆవరణముదాటి, ఆరాధనకై వచ్చిన యాత్రికులను రంజింప జేసి, ద్రవ్యార్జనకై జేయబడెడు 'కురవంజీ' ఆటవిక నృత్యములు.

దేవదాసీలు - వీరు విష్ణుదాసీలు, శివదాసీలని రెండు విధములుగా నుండెడివారు. అట్లే వారి నృత్యకళ విష్ణు దాసీలకళ 'లాస్య' (అభినయ) ప్రాధాన్యమై, శివదాసీల కళ తాండవ (నృత్య) ప్రాధాన్యమై యుండినది.

నృత్యకళను దైవారాధనములో ఒక భాగముగా మన పూర్వులు పరిగణించిరి. ప్రభాత సమయమున స్వామికి మేల్కొలుపు మొదలుకొని రాత్రి పవళింపు సేవ వరకు జరిగెడు వివిధ పూజలందు, ఉపచారములందు, ఆయాసమయములకు తగినట్లు దాసీలు నృత్యగీతాలతో భగవంతు నారాధించెడువారు. పుష్పాంజలి, మేళప్రాప్తి, పేరిణి, కౌస్తుభము, నవసంధి, సమపాద, భుజంగ, శుభ లీల మొదలైనవి వారిచే ప్రదర్శింపబడు ప్రత్యేక నృత్యములు. ఈ నృత్యములన్నియును భరతశాస్త్రము ననుసరించి, శాస్త్రీయపద్ధతిలో పెంపొందించ బడినవి. ఇందు 'లోకధర్మి' కి తావులేదు. వివిధ ఆలయములలో ఆ