Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/684

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర విశ్వవిద్యాలయము


వారు మేధావులు, అనుభవజ్ఞులు అగు శ్రీ కట్టమంచి రామలింగా రెడ్డిగారిని ఆ పదవికి నియమించిరి. శ్రీ సి.డి. యన్. చెట్టిగారు మొదటి రెజిస్ట్రారు. 1926 సం. ఆగష్టు 30 వ తేదీన బెజవాడ మ్యూజియమ్ హాలుబో సెనేట్, అకాడమిక్ కౌన్సిలు మున్నగు కార్యవర్గములకు ప్రారంభోత్సవమైనది. సంస్కృతాంధ్ర భాషాపోషణమునకు గాను శ్రీ బొబ్బిలి మహారాజావారు ఒకలక్ష రూపాయల భూరివిరాళ మొసంగిరి, నాటికి విశ్వవిద్యాలయాధికారము క్రింద రాజమహేంద్రవరములోని టీచర్సు ట్రయినింగు కాలేజి, విశాఖపట్టణములోని మెడికల్ కాలేజి కాక 12 కంటే తక్కువ కళాశాలలు మాత్రమే ఉన్నవి. మొదటి సంవత్సరములోనే కొన్ని క్రొత్త కళాశాలలను స్థాపించుటకు, ప్రాత కళాశాలలను ఉన్నత స్థాయికి తీసికొనివచ్చుటకును ఆయా కార్యనిర్వాహక వర్గములు చేసిన విజ్ఞప్తులను విశ్వవిద్యాలయపు అధి కారులు సానుభూతితో పరిశీలించిరి. సుప్రసిద్ధ ఆంధ్ర చిత్రకారులగు శ్రీ కౌతా రామమోహన శాస్త్రిగారు శ్రీ రెడ్డిగారి సూచనల ప్రకారము విశ్వవిద్యాలయ ముద్రను చిత్రించిరి. ఈ ముద్ర ఆంధ్రజాతి ఔన్నత్యమును, ఆశయములను ప్రస్ఫుట మొనరించుచున్నది. 64 కోణములుగల చక్రమున్నది. దాని కిరు కెలంకుల రెండు సర్పరాజము లున్నవి. లోపల స్వస్తిక, "తేజస్వీ నావధీతమస్తు" అను సూక్తి తెలుగు లిపిలోను ఉన్నవి. చక్ర మధ్యమునందు సంద్రము, సప్తకిరణు డగు ఉదయ భానుడు, పద్మము కలవు. ఈ చక్రమున కడుగున రేఖా మాత్రముగా బాలచంద్రు డున్నాడు. బాలచంద్రునకు దిగువున, నాగుబాముల తోకలకు పైనగల చోటులో తెలుగు లిపిలో “ఆంధ్ర విశ్వకళా పరిషత్" అని లిఖింప బడియున్నది. ఈ ముద్ర అత్యంత సుందరము ప్రతిభా సమన్వితము అయి కన్పట్టుచున్నది.

విశ్వకళాపరిషత్తు స్థాపించునాటికి ఆర్ట్సు, సైన్సు, బోధనాభ్యసనము(Teaching), వైద్యము మొదలగు శాఖలు మాత్రమే గలవు. గణితము, భౌతిక శాస్త్రము, పదార్థ విజ్ఞాన శాస్త్రము, వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, భూగర్భ శాస్త్రము, మానవశరీర శాస్త్రము మున్నగు శాఖలలో బి.యస్.సి. డిగ్రీని నెలకొల్పుటకు వలయు ప్రయత్నములను చేసిరి. బెజవాడ పురపాలక సంఘము కృష్ణా, గుంటూరు జిల్లాబోర్డులు ఒసంగిన విరాళముల నుండి విద్యార్థులకు ఉపకార వేతనముల నెలకొల్పిరి ఆనర్సు డిగ్రీ కోర్సులను స్థాపించుటకు వలయు ప్రయత్నము లన్నిటిని చేయ నారంభించిరి. ఇంతలో మంత్రివర్గము మారినది. శ్రీ పానగల్లు రాజావారి స్థానే డాక్టర్ సుబ్బరాయన్ గారు మద్రాసునందు మంత్రిగా నాయకత్వము వహించిరి. 1927 వ సం. డిశంబరు 5వ తేదీన ఆచార్య శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణయ్యగారు ప్రథమ పట్ట ప్రదానోత్సవ సందర్భమున స్నాతకోపన్యాసము. నొసంగినారు. 1928 లో శ్రీ సి. ఆర్. రెడ్డిగారు ప్రథమ ఉపాధ్యక్షులుగా ఎన్నికయినారు. ఈ ప్రథమ దశ పెక్కు బాలారిష్టములతో గూడియుండెను. ఉన్నత విద్యయందు శిక్షణము నొసంగు సంస్థలు ఒకేచోట కేంద్రీకరించుటయా లేక, వివిధ శాఖలను వివిధ కేంద్రములయందు నెలకొల్పుటయా అను విషయముపై తర్జనభర్జనలు సాగెను. 1929 సం. జనవరి నెలలో మద్రాసు కౌన్సిల్ వారు ఉన్నత విద్య యావత్తు ఒకే కేంద్రమునందు గరపవలయునని తీర్మానించిరి.

ఇక విశ్వవిద్యాలయ కార్యస్థాన మెక్కడ అను విషయముపై ఎడతెగని చర్చలు జరిగినవి. తుదకు ఈ కార్యస్థానమును విశాఖపట్టణములో నెలకొల్పుటకు నిశ్చయించిరి, వైద్యకళాశాల యుండుటవలనను, హార్బర్ నిర్మాణము కొనసాగుట వలనను విశాఖపట్టణమునకు రానున్న ఆధిక్యమును గుర్తించి వాల్తేరు కొండలపై ఆదర్శ విద్యా సంస్థా నిర్మాణమునకు తగిన వాతావరణ ముండుటను గమనించి 1930 సంవత్సరము సెప్టెంబరు 5వ తేదీన "హోటల్ సెసిల్" భవనమును అద్దెకు గైకొని విశ్వకళా పరిషత్కార్యాలయమును వాల్తేరులో స్థాపించిరి. ప్రభుత్వము వారు ఇంతకుముందు కంటె ఈపైన ఏటేట ఎక్కువ ధన మొసంగుట కంగీకరించుటయే గాక భవన నిర్మాణమునకుగాను 7½ లక్షల రూప్యముల నొసంగిరి. 1928-29 నాటికి విశ్వవిద్యాలయ పుస్తకళాండాగారముగూడ ఒక విధముగ చెప్పుకోదగిన స్థితికి వచ్చినది. 'రావుబహద్దర్ శ్రీ డి. లక్ష్మీనారాయణగా రొసంగిన 5400 ప్రతులతో పుస్తక భాండాగా