Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/685

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర విశ్వవిద్యాలయము


రము మరికొంత పెరిగినది. ధనాభావముచే ఇంతకంటె విస్తృతిచెందలేదు.

ద్వితీయ ఘట్టము  : బెజవాడ నుండి వాల్తేర్ నకు మారుటలోనే విశ్వవిద్యాలయ జాతకమునందే కొంత మార్పు కానిపించినది. రాయలసీమ కళాశాలలు ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి విడిపోయి మద్రాసులో చేరినవి. "హోటల్ సెసిల్" చుట్టుప్రక్కల నున్న 22½ ఎకరములను ప్రభుత్వమువారు సేకరించి, 3 లక్షల పై చిల్లర రూప్యములకు కొని విశ్వవిద్యాలయమున కొసంగినారు. ఇదే సమయమున గాంధీమహాత్ముని దండి సత్యాగ్రహము ప్రారంభమయినది స్వాతంత్రోద్యమము నణచుటకు ప్రభుత్వమువా రనుసరించిన విధానము పట్ల నిరసనము తెలుపుచు శ్రీ రామలింగా రెడ్డిగారు తమ పదవీ త్యాగము చేసినారు. విశ్వవిద్యాలయపు సెనేటు వారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారిని శ్రీ రెడ్డిగారి స్థానే ఎన్నుకొనిరి. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణపండితులు పదవీ స్వీకార మాదిగా తమ కార్యాచరణ దక్షతను, దూరదృష్టిని, దృఢ సంకల్పమును కార్యరూప మొందించిరి. విశ్వవిద్యాలయములో తెలుగునందు, చరిత్రయందు ఆనర్సు కోర్సులను స్థాపించిరి. 1939 సంవత్సరము జులై నెలలో 6 గుకు అధ్యాపకులతో విశాఖపట్టణము మహారాణీ పేటలోని బొబ్బిలి హాలులో ఆంధ్ర విశ్వకళా పరిషత్కళాశాల యవతరించినది. భౌతిక విజ్ఞాన శాఖలతో పాటు ఇటు ఆర్ట్సుకళాశాలలో వేదాంత శాఖ, గణిత శాఖ గూడ నెలకొల్పబడినవి. 1933 నాటికి ఉపాధ్యాయ వర్గము 17 వరకు పెరిగినది. 1934 లో "బ్రిటానియా బిల్డింగ్ అండ్ ఐరన్ కంపెనీ" వారు విశ్వవిద్యాలయ భవన నిర్మాణమును ప్రారంభించిరి. సమున్నతమైన వాల్తేరు కొండలపై ఇరుపార్శ్వములు బంగాళాఖాతము, ఎదుట ఋషి కొండ, డాలిఫిన్సోనోస్ పర్వతములు కన్పట్టుచు నున్న విశాల ప్రదేశములో భవన నిర్మాణము ప్రారంభమైనది. ఇదే వత్సరములో జయపురాధీశ్వరులగు శ్రీ శ్రీ విక్రమదేవ వర్మగారు 50 వేల రూప్యముల భూరి విరాళ మొసంగిరి, మరుసటి సంవత్సరము దానిని 75 వేలకు పెంచిరి. తదనంతరము ఏటేట ఒక లక్ష రూప్యముల నొసంగుటకు అనుమతించిరి. వారి అనంతరము వారి వారసులు ఏటేట ఒక లక్షగాని దానికి బదులుగా ఒకేమారు 15 లక్షల రూప్యముల నొసంగుటకు గాని ఏర్పాటు నొనర్చిరి. ఇట్టి మహాశయుని విద్యాపోషణాభిలాషకు గాని వారివారి ఔదార్యమునకు గాని ఆంధ్ర దేశములో సాటిలేదు. అప్పటినుండియు వారిపేర సైన్స్ కళాశాల 'జయపూర్ విక్రమదేవ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండు టెక్నాలజీ' అను పేర విలసిల్లుచున్నది. ఈ సుందర భవనమునకు పైన ముందు భాగమున 30 వేల రూప్యములు వ్యయమొనర్చి నిర్మించిన గడియార స్తంభమున్నది. శ్రీ విక్రమదేవ వర్మగారిపై గల భక్తి విశ్వాసములను ప్రకటించుటకు గాను ఆ కళాశాలావరణలో శ్రీవారికంచు విగ్రహమును ప్రతిష్టాపనము చేసిరి. కళాశాల పుస్తక భాండాగారము, పరిశోధనాలయములు నానాటికి అభివృద్ధి చెందినవి. తొలుదొల్త విస్తృతమగుచున్న కళాశాలలకు ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ (సర్) జె.సి.కొయాచే అను విఖ్యాత అర్థశాస్త్రవేత్తను నియమించిరి. డాక్టర్ లుడ్ విగ్ వుల్ఫ్ అనువారు సైన్సు కళాశాలాధ్యతులైరి. 1938 నాటికి శ్రీ సూరి భగవంతముగారు ఉభయ కళాశాలలకు ప్రిన్సిపాల్ అయినారు. అప్పటి కప్పుడే విశ్వవిద్యాలయము బహుముఖ వ్యాప్తిని బొంది పేరు ప్రతిష్ఠలు నందినది. చెప్పుకోదగిన పరిశోధనము భౌతిక విజ్ఞానశాఖలయందు సాగినది. అంతేగాక శ్రీ రవీంద్రులు “మానవుడు” అను శీర్షిక పైనను, శ్రీ సి. వై. చింతామణిగారు "సిపాయీల కలహానంతరము నుండి భారత రాజకీయములు" అను శీర్షిక పైనను ఘనమగు ఉపన్యాసముల నొసంగిరి. ఈ ఉపన్యాసావళి శ్రీ అల్లాడి కృష్ణ స్వామయ్య గారి భూరి విరాళ ఫలితముగ వ్యవస్థాపితమైనవి. విశ్వవిద్యాలయ ప్రచురణ శాఖవారు ఎన్నియో ఉద్గ్రంథములను ప్రచురించినారు. ఈ రచయితలలో రామలింగా రెడ్డిగారు, ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్యగారు, బ్రహ్మశ్రీ వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రులుగారు, డాక్టర్ కె.ఆర్. సుబ్రహ్మణ్యం గారు మున్నగువారు ఎందరెందరో విద్యాధికులున్నారు. శ్రీ రాధాకృష్ణయ్యగారి పదవీకాలమున పసిబిడ్డయైన ఆంధ్ర విశ్వవిద్యాలయము సుందర స్వరూపమును దాల్చి నవ విలాసముతో ప్రత్యేకతనుగడించి విద్యా సేవ యొనర్చినది