Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/682

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర విశ్వవిద్యాలయము

యావజ్జీవ సభ్యులు 24 మంది అనుబంధ సభ్యులు, 278 మంది స్థిరనివాస సభ్యులు, 3033 మంది స్థిరనివాసేతర సభ్యులు, 1954 వ సంవత్సరము తుదికి మండలి సభ్యుల సంఖ్య 757 వరకు హెచ్చినది. అనగా పై వివిధశాఖలకు చెందినవారి సంఖ్య వరుసగా 4, 40, 24, 315, 374 గా మారినది. మండలి యొక్క కార్యవర్గసభలు చెన్నపురి యందే గాక కర్నూలు, తిరుపతి మొదలగు ప్రదేశములలో కూడ జరుపబడి, ఆయా ప్రాంత వాసులకు మండలి కార్యక్రమమందు ఉత్సాహము కల్గించబడినది.

ఆంధ్ర వాణిజ్య మండలినుండి సభ్యులకు లభించు ప్రయోజనములను పేర్కొనవలసి యున్నది. వాణిజ్యమునకు అవసరమగు విషయములలో ముఖ్యమైనది విషయ విజ్ఞానము. ఏ వస్తు వెచ్చట లభ్యమగును? విదేశ స్వదేశ వాణిజ్యమునకు సంబంధించిన నిబంధన లెట్టివి ? పరిశ్రమలు, జనసంఖ్య, ఎగుమతి దిగుమతులు మొదలగు విషయములకు సంబంధించిన వివరము లెట్టివి? ఇత్యాది విషయములపై అవసరమైన అంశములను సభ్యులకు అందచేయుచున్నది. వర్తకపు ఒప్పందములు మున్నగు వానిలో ఇతర సోదర వాణిజ్య మండలుల సహకారముతో సభ్యులకు చేయూత నిచ్చుచున్నది. వివాదలు వచ్చినపుడు స ర్వేలు, మధ్యవర్తిత్వముచేసి వాటి పరిష్కారమునకై తోడ్పడుచున్నది. ప్రతి వారము వివరములు పత్రికను వెలువరించుచున్నది. జాతీయ, అంతర్జాతీయ, ఆర్ధిక వాణిజ్య పరిస్థితులను గూర్చియు, క్రమవిక్రయావకాశములను గూర్చియు విషయసామగ్రిని సభ్యుల కంద చేయుచున్నది. వాణిజ్యసంబంధమైన సాధక బాధకములను ప్రభుత్వపు దృష్టికి తెచ్చుచున్నది.

అంతేగాక ప్రాంతీయ సైన్యము, కార్మిక సమస్యలు, అమ్మకపు పన్ను, పరిశ్రమలు, రవాణా మున్నగు విషయములలో ఆంధ్రప్రభుత్వముచే నెలకొల్పబడిన సలహాసంఘములలోను, చట్టరీత్యా వేంకటేశ్వర విశ్వవిద్యాలయ సెనేటు సభయందును, ఆంధ్ర పరిశ్రమల బోర్డునందును ఈ మండలికి ప్రాతినిధ్య మొసగబడెను. పోస్టల్ శాఖ వారును, దక్షిణ రైల్వేవారును, మదరాస్ పోర్టు ట్రస్టు వారును ఏర్పాటు చేసిన సలహా సంఘములలో కూడ వాణిజ్య మండలికి స్థాన మివ్వబడినది. అందులో మండలి ప్రతినిధులున్నారు. విశాఖపట్టణము రేవునుండి ప్రభుత్వపు లెక్కలో దిగుమతియగు ఆహార ధాన్యములను సర్వేచేయు పనికి ఈ వాణిజ్యమండలిని భారతప్రభుత్వమువారు నియమించిరి. సర్వేచేసి యుత్పత్తిసంబంధమగు ధ్రువపత్రముల నిచ్చు కార్యక్రమము నింకను విస్తృతము చేయవలెనని మండలి యుద్దేశించు చున్నది.

అంతేగాక వివిధ పాశ్చాత్య ప్రభుత్వముల యొక్క వాణిజ్య ప్రతినిధులు, ఇంగ్లండు, అమెరికా మొదలగు విదేశములకు వెళ్ళనున్న భారతప్రభుత్వ వాణిజ్య ప్రతినిధులు ఆంధ్ర వాణిజ్య మండలివారితో సంప్రదింపులు జరిపియుండిరి. ప్రభుత్వము నియమించిన పెక్కు విచారణ సంఘముల ముందు మండలి ప్రతినిధులు వాగ్రూపమునను, లిఖితరూపము నను సాక్ష్య మొసగిరి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారకచిహ్న నిర్మాణమునకై వాణిజ్య మండలి 1116 రూప్యముల విరాళము ప్రకటించి యున్నారు.

ఇట్లు ఆంధ్ర వాణిజ్య మండలి పెక్కురీతుల ఆంధ్ర దేశములోని వర్తక వాణిజ్యములకు తోడ్పడుచున్నది. మండలియొక్క కర్నూలు కార్యాలయ వార్షికోత్సవములో ప్రసంగించుచు నాటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు చెప్పినట్లు వాణిజ్యాభివృద్ధికై ఒక మండలి స్థాపనయే క్లిష్టమైన కార్యముకాగా దానిని ప్రజానురంజకముగా ఉత్తమ సాంప్రదాయానుగుణ్యముగా నిర్వహించుట మరింత దుర్ఘటమైన కార్యము. ముఖ్యముగా ఆంధ్రదేశము పారిశ్రామికముగా వెనుకబడిన ప్రాంతము, ఇది ఇటీవలెనే నిర్మితమైన రాష్ట్రము. ప్రాంతములో పారిశ్రామికాభ్యుదయము పెంపొందించుట, ప్రజల జీవనప్రమాణము హెచ్చుటకు దోహదము చేయుట, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక జయప్రదముగా అమలు జరుగుటకు తోడ్పడుట యను పవిత్ర కార్యములోకూడ ఆంధ్ర వాణిజ్య మండలి ఉజ్వల పాత్ర నిర్వహించునని ఆశించెదము గాక.

ఆర్.ఎన్. ఎన్.

ఆంధ్ర విశ్వవిద్యాలయము  :- భారత స్వాతంత్య్రొద్యమమునకు పూర్వము మద్రాసు రాష్ట్ర పాలన