Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/680

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము -1I


ఈమె గొప్ప విద్వాంసురాలయ్యును వినయవతి. శృంగార రసమును వర్ణించుట యం దీమె వై ముఖ్యము ప్రదర్శించెను. ఈమె రచనలు ఆత్మవిజ్ఞానమునకును ఔచిత్యమునకును ఆటపట్టులు.

ఈ యుగమున తెలంగాణమున వెలసిన కొందరు కవి పుంగవులను గూర్చి చెప్పవలసియున్నది. జటప్రోలు సంస్థానాధి పతియైన సురభి మాధవరాయలు చంద్రికా పరిణయ మను ప్రబంధము రచించెను. ఈతడు సర్వజ్ఞ సింగమనీని వంశమునకు చెందినవాడని ప్రతీతి. ఈ చంద్రికా పరిణయము పిల్లవసుచరిత్ర అని చెప్పదగినట్టిది. ఇందు చంద్రికా సుచంద్రుల ప్రణయము వర్ణింపబడినది. భట్టు మూర్తి వలెనే ఈ కవియు శ్లేష యమకాదు లందును. ఇతర శబ్దా లంకారములందును ప్రీతి ప్రదర్శించెను. ఈతని శ్లేషలు వసుచరిత్ర శ్లేషలంత భావపూరితములును, సుందరములును కాకపోయినను ఈతడు ప్రదర్శించిన పాండిత్య పాటవము అమేయమని చెప్పుటకు సందేహింపబని లేదు.

పరశురామ పంతుల లింగమూర్తి కవి ఓరుగల్లులో జన్మించెను. ఇతడు యౌవనమున రతీమన్మథ విలాసమనెడీ శృంగార ప్రబంధమును రచించినను క్రమముగా భక్తి వైరాగ్య భావములకు నిలయమై సీతారామాంజ నేయ సంవాద మను వేదాంత గ్రంథమును రచించెను. ఇందు జీవబ్రహ్మైక్య సిద్ధాంతము నిరూపింప బడినది. ఇందలి మూడాశ్వాసములలో వరుసగా తారక యోగము, సాంఖ్య యోగము, అమనస్క యోగము అను మూడు యోగములు వివరింపబడినవి. గూఢమైన వేదాంతమును కూడ రసవంతమైన కావ్యముగా చెప్పజాలుట ఈ కవి యందలి విశేషము, సందర్భోచితములును, అనుభవ సిద్ధములు నైన ఉపమానములను కూర్చి ఈ కవి వేదాంతమును కూడ సర్వ జనసుబోధముగా సంతరించెను. తెలుగున వెలసిన వేదాంత కావ్యములలో దీనికి సాటివచ్చునది వేరొకటి లేదు. ఈ కవి కుమారుడైన రామమూర్తికవి శుక చరిత్రమను వేదాంత గ్రంథమును రచించెనట! దీనినిబట్టి వేదాంత విచార మీ వంశమువారి కనుశ్రుతమని తెలియుచున్నది.

దేవరకొండ ప్రాంతములో నుండిన మరింగంటి వంశమున పలువురు పండిత కవు. లుదయించిరి. వీరు వైష్ణవులు, విశిష్టాద్వైతాచార్యులుగా చిరకాలమునుండి ప్రసిద్ధి వహించినవారు. వీరిలో మరింగంటి సింగరాచార్యులు అను కవి దశరథరాజనందన చరిత్ర మను పేర నిరోష్ఠ్య రామాయణమును రచించెను. ఈయనకు శతఘంటావధాని అను బిరుదు కలదు. ఈయన కవిత సలక్షణమై పలువురు పండితులయు, విమర్శకులయు ప్రశస్తులొందినది. మరింగంటి వేంకట నరసింహాచార్యు డను కవి శ్రీకృష్ణ శతానందీయము, చిలువపడి గెరేని ప్రేరణము అను రెండు కావ్యములు రచించెను. ఇందు మొదటి దానియందలి కథ భాగవతము నుండి గ్రహింపబడినది. ఈ కవి కళా పూర్ణోదయమును చూచి కాబోలు ఇందొక విచిత్రమైన కల్పన కావించెను. కృష్ణుడు మాయాబ్రహ్మయై సరస్వతీ కడనుండ సత్యబ్రహ్మ యటకరిగి అతనితో వాదించుట ఈ కల్పనయందలి ముఖ్యాంశము, రెండవది అచ్చ తెనుగు కావ్యము. ఇందు నాగకేతనుడైన దుర్యోధనుని వివాహము వర్ణింపబడినది. మరింగంటి వంశమునకు చెందిన మరియొక కవి నరసింహాచార్యులు. ఇతడు తాలాంక నందినీ పరిణయమును ప్రబంధముగా రచించెను. మేనరికపు వివాహములు పరిస్థితి ఇందు చక్కగా వర్ణింపబడినది.

పురాణ యుగమునందలి ఆంధ్రకవిత్వమున శబ్దార్థములకు సమప్రాధాన్యము కనిపించును. ప్రబంధయుగము నాటికి అర్థభావములపై కంటే శబ్దములపై కవులకు మక్కువ పెరిగినది. దక్షిణాంధ్ర యుగమున అది మరింత యభివృద్ధి యైనది. చివరకు క్రీ.శ. 19వ శతాబ్ది నాటికి ఆంధ్రకవిత రసభావములందు కొరవడి శబ్దార్థాలంకార ప్రధానమై ఔదాత్యమును కోల్పోవుట సంభవించినది. కవులు పలువురు స్వతంత్ర ప్రక్రియలకు పూనక పెద్దన,రామరాజభూషణాదుల ప్రబంధములను అనుకరించుటయే పరిపాటియైనది, ' ఈ కారణముచే ఆంధ్రసరస్వతి యమకశ్లేషానుప్రాసాద్యలంకార శృంఖలలో తగుల్కొని సహజ స్వచ్ఛంద సంచారమునకు దూరము కావలసివచ్చినది. శ్రీ వీరేశలింగం పంతులుగారు రచించిన సరస్వతీ నారద సంవాదమను ఖండకావ్యములో అప్పటి కవితా పరిస్థితి చక్కగా వర్ణింపబడినది. సాహిత్య రంగమున చైతన్యము లోపించి అనుకరణమే ఆధిపత్యము వహించుటచూచి ఆంగ్లభాషా నిష్ణాతులగు పండితులును, యువకులును