Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/679

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము -II


మైనది కాదు. ఇందు అర్థశ్లేషయే పలుచోట్ల కానిపించును. అందందు వ్యాకరణదోషములుకూడ ఉన్నవి. ఇతడు పెక్కు చాటుపద్యములు చెప్పినట్లు తెలియుచున్నది.

లక్ష్మణకవికి సమకాలికుడని చెప్పదగిన శిష్టు కృష్ణమూర్తికవి సంస్కృతాంధ్రములందు మహాపండితుడై పెక్కు గ్రంథములు రచించెను. సంగీతశాస్త్రమునకూడ ఇతని కపారమైన పాండిత్యము కలదు. పురాణ ప్రవచనము నందును,ఆశుకవిత్వము నందును ఇతడారితేరి యుండెను. ఇతడు తన జీవిత కాలమున పలువు రధికారులను, భూస్వాములను దర్శించి, వారిచే గొప్పసత్కారములు పొందెను. సర్వకామదాపరిణయము, వేంకటాచల మాహాత్మ్యము, వీక్షారణ్య మాహాత్మ్యము, పంచతంత్రము, స్త్రీనీతి శాస్త్రము, వసుచరిత్ర వ్యాఖ్యానము మున్నగున వీతని తెలుగు రచనలు. సంస్కృతమునుకూడ ఇతడు రచించిన గ్రంథము లనేకము లున్నవి. అందు హరికారిక లను వ్యాకరణ గ్రంథము పేర్కొనదగి యున్నది. చిన్నయసూరి బాలవ్యాకరణమునకును దీనికిని చాల పోలిక యున్నది. చిన్నయసూరి బాల వ్యాకరణమునకు గల ప్రసిద్ధి చూచి దాని నపకీర్తిపాలు చేయుటకై కృష్ణమూర్తి కవియే ఈ కారికలను రచించి హరిభట్టకృత మను శంక కలిగించుటకై హరికారిక లను పేరు పెట్టె నని విమర్శకులు అభిప్రాయపడుచున్నారు.

మండపాక పార్వతీశ్వర కవి (1833-1897) శిష్టు కృష్ణమూర్తి కవి వలెనే గొప్ప విద్వాంసుడు. ఇతడు బొబ్బిలి సంస్థానమున ఆస్థానకవియైఉండెను. 'రాధాకృష్ణ సంవాదము, కాంచీపుర మహత్త్వము, అమరుక కావ్యము, శ్రీకృష్ణాభ్యుదయము మున్నగు కావ్యములే గాక పెక్కు శతకములు, దండకములు, వంశచరిత్రములు రచించెను. ఇతడు సుమా రెనుబది గ్రంథములు రచించెనని చెప్పుదురు. ఇతని గ్రంథములలోని కెల్ల రాధాకృష్ణ సంవాదము సుప్రసిద్ధ మైనది.

గోపీనాథము వేంకటకవి వేంకటగిరి సంస్థానమున ఆస్థానక విగా ఉండి పెక్కు గ్రంథములు రచించెను. అందు .వాల్మీకి రామాయణమున కాంధ్రీకరణమైన గోపీనాథ రామాయణము, కృష్ణజన్మ ఖండము, శిశుపాలవధాంధ్రీ కరణము ముఖ్యము లైనవి. కృష్ణజన్మఖండము బ్రహ్మ కైవర్త పురాణమునందలి భాగము, భాస్కరరామాయణాదులు యథామూలముగా లేవని వేంకటకవి దానిని మూలానుగుణముగా తెనిగించెను. ఇతని రచన సులభమును సరళమునై మనోహరముగా ఉండును.

ఈ యుగమున ఆంధ్ర దేశమున వర్తిల్లిన కవయిత్రులలో తరిగొండ వేంకమాంబ (1840) పేర్కొనదగినది. ఈమె వేంకటాచల మాహాత్మ్యము, జ్ఞానవాసిష్ఠ రామాయణము, రాజయోగసారము అను గ్రంథములను రచించి, తరిగొండ నృసింహస్వామి కంకితము కావించెను, జ్ఞానవాసిష్ఠము ద్విపద కావ్యము. తరణోపాయముగా తానీగ్రంథము రచించినట్లు కవయిత్రి చెప్పుకొన్నది. వైరాగ్య ప్రభావమును, ఆత్మానాత్మ వివేకమును తెలుపు కథ లిందనేకము లున్నవి. గూఢ వేదాంత విషయములను గూడ వెంకమాంబ మృదుమధురముగను, స్పష్టముగను వివరించియున్నది. మడికి సింగన అనుకవి ఈ గ్రంథము నింతకు పూర్వమే పద్య కావ్యముగా రచించియుండెను. రాజయోగ సారము కూడ ద్విపద కావ్యమే. ఇందు రాజయోగ విశేషములు చక్కగా వివరింపబడియున్నవి. వేంకమాంబ రచించిన గ్రంథములలో ప్రసిద్ధమైనది వేంకటాచల మాహాత్మ్యము. ఇది వేంకటగిరి క్షేత్ర మాహాత్మ్యమును వర్ణించు కావ్యము. వరాహ భవిష్యోత్తర పద్మ పురాణములందలి వేంకటాచల మాహాత్మ్యము లీ కావ్యమునకు మూలములు. క్షేత్ర మాహాత్మ్యమును వెల్లడించుటకై ఇందు చెప్పబడిన మాధవుడను బ్రాహ్మణ యువకుని కథ మిక్కిలి హృద్యముగా నున్నది. ఇట్లే ఇందలి పద్మావతీ శ్రీనివాసుల వివాహ వృత్తాంతము కూడ రమణీయమై యొప్పారుచున్నది. శ్రీనివాసు డెరుకసాని వేషమున అంతిపురము చొచ్చుటయు, అతనికిని లక్ష్మీదేవికిని, జరిగినసం వాదమును మిక్కిలి సహజముగా వర్ణింపబడినవి. తన భర్త ద్వితీయ వివాహము చేసికొనబోవునపుడు లక్ష్మి అనుభవించిన వేదనను వేంకమాంబ నిపుణతతో వర్ణించి స్త్రీ హృదయమును గ్రుమ్మరించినది. ఈమె శైలి వేదాంత విషయ వివరణ సందర్భములందు కూడ లలిత మధురమై వ్యవహారమునకు సన్నిహితముగా ఉండును. ఈమె రచనలో అచ్చటచ్చట వ్యాకరణ పాలిత్యములు గోచరించును.