Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/678

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము II


రసవంతముగా ఉన్నది. ఇందు సందర్భానుసారముగా 'నా కాలమున వాడుకలో ఉన్న ఉరుదు పదములు పెక్కు ప్రయోగింపబడినవి.

మంగళగిరి ఆనంద కవి (1760 ప్రాంతము) బ్రాహ్మణు డయ్యును క్రైస్తవ మత మవలంబించి, వేదాంతరసాయన మను గ్రంథము రచించి, తనవలెనే క్రైస్తవమత మవలంబించిన నిడిమామిళ్ళ దాసామాత్యుని కంకితము చేసెను. ఈ గ్రంథమున క్రైస్తవ మతస్థాపకుడైన ఏసుక్రీస్తు చరిత్రము వర్ణింపబడినది. ఇందలి శైలి నిర్దుష్టమై మిక్కిలి ప్రౌఢముగా నుండును. వర్ణనలు ప్రబంధకవుల వర్ణనల ననుసరించుచుండును. పింగళి ఎల్లనార్యుడను కవికూడ ఇట్లే క్రైస్తవమత సంబంధియగు సర్వేశ్వర మాహాత్మ్యము అను తొభ్య చరిత్రమును మృదుమధుర పాకమున రచించి పేరు గాంచెను.

మహాకవి అను పేరు గడింపకపోయినను వేలకొలది పద్యములు రచించి సర్వాంధ్రజనుల హృదయములందు స్థిరనివాస మేర్పరచుకొన్నవాడు వేమనయోగి. ఇతడు క్రీ. శ. 18వ శతాబ్ది పూర్వభాగమున నివసించెనని శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు నిర్ణయించి యున్నారు. ఇతడు వ్రాసిన పద్యములలో పెక్కు ఆట వెలదులు. కొన్ని కందములును, వృత్తములునుకూడ ఉన్నవి. ఆట వెలదుల చివర “విశ్వదాభిరామ వినుర వేమ” nఅను మకుటము గోచరించును. ఈతడు రచించిన పద్యములు శతకసంఖ్యా నియమమునకు లోబడక పోయినను కథావస్తు వేమియు లేకుండుట, మకుటము గోచరించుట అను హేతువులచే శతక పద్యములుగానే పరిగణింపబడు చున్నవి. ఈ విషయమున ఈతని పద్యములను శివతత్త్వ సారమునందలి పద్యములతో పోల్చవచ్చును. ఈతడేదో గ్రంథమును వ్రాయవలెనను తలంపుతో పద్యములను వ్రాసినవాడుకాడు. దేశము నందలి వివిధ ప్రాంతములందు స్వేచ్ఛగా తిరుగుచు అడిగిన వారి కెల్ల ఆశువుగా ఆయాయి విషయములనుగూర్చి ఆత డాట వెలదులలో సమాధానములు చెప్పియుండెను. వాటిని శిష్యులు వ్రాసికొని ప్రచారముచేసి యుండిరి. వేమన మిక్కిలి స్వతంత్రుడు. సంఘమునందును, వ్యక్తులందును తనకు గోచరించిన దోషములనెల్ల ఆతడు నిళితముగా విమర్శించి యుండెను. ఆ కాలపు బ్రాహ్మణు లొనరించు దురాచారముల నతడు తీవ్రముగా ఖండించెను. మతము పేర జరుగు అత్యాచారములు చూచి ఆత డసహ్యించుకొనెను. అతని పద్యము లలో నీతులు కొల్లలుగా గోచరించును. ఆ నీతుల కాతని అనుభవమే మూలము. వేదాంత తత్త్వమును బోధించు పెక్కు పద్యములుకూడ అతడు చెప్పియుండెను. అందు కొన్ని గూఢ భావగర్భితములై యుండుటచే దురవగాహములుగా ఉండును. వేమన హాస్యప్రియుడు. ఇతని విమర్శనమునకు గురియగు వారుకూడ విచారము నొందక వికసిత హృదయములతో నేగుట కీతని పద్యములందుండు మృదుల నిర్మలమైన హాస్యమే కారణము. భావముల తీవ్రత, నీతి నిర్భరత, ధారాశుద్ధి, నిశిత విమర్శనము ఈతని పద్యములందలి గుణవిశేషములు. ఈత డెచ్చటను పాండిత్య ప్రదర్శనమునకై పాటుపడి యుండలేదు. సర్వజన సుబోధములు, జాతీయములు, సరళమంజులములు ఐన పదము లనే ఈతడు వాడియుండెను. పామరులు సైత మీతని పద్యములయెడ ప్రీతికలిగి యుండుట కీ సౌలభ్యమే ముఖ్య కారణము. ఇతడు జీవితము నందువలె కవిత్వమునకూడ ఆంతర్యమున కిచ్చినంత ప్రాధాన్యము బాహ్య విషయముల కిచ్చి యుండలేదు. అందుచే ఇతని రచనలో వ్యాకరణాది దోషము లచ్చటచ్చట గోచరించును. పండితు లెవ్వరును ఈతని మహాకవియని మన్నించక పోవుట కిదియే కారణము. కాని పండితులనక, పామరులనక, స్త్రీలనక, పురుషులనక, వృద్ధులనక, బాలురనక ఆంధ్రు లెల్లరును ఆప్యాయముతో పఠించు పద్యములు వేమన పద్యములే అని చెప్పినచో అత్యుక్తి ఉండనేరదు.

పిండిప్రోలు లక్ష్మణకవి రావణదమ్మీయము అను నామాంతరము కల లంకా విజయ మను ద్వ్యర్థి కావ్యమును రచించెను. ఇందు రెండే ఆశ్వాసము లున్నవి. రావు ధర్మారాయ డను వెలమకులజు డీతని లంకనేల కొంత అపహరింపగా ఇతడా గ్రహమున నతనిని రావణుని తోడను క్షేత్రాపహరణ వృత్తాంతమును రామాయణ కథతోడను పోల్చి ఈ ద్వ్యర్థి కావ్యమును రచించెను. తిట్టుకవితయం దీతడు దిట్ట. భీమకవి, శ్రీనాథుడు మున్నగువారుకూడ తనవలె తిట్టజాలరని ఈతడు చెప్పుకొని యుండెను. ఈతని కావ్యము రాఘవపాండవీయాదులంత ప్రౌఢ