ఆంధ్ర వాఙ్మయ చరిత్రము . II
సాగరసంగ మాహాత్మ్యము, సర్పపుర మాహాత్మ్యము శివలీలా విలాసము, సర్వలక్షణసార సంగ్రహము, సారంగధర చరిత్రము, కుక్కుటేశ్వర శతకము మున్నగునవి ఈతని కృతులు. ఇందు సర్పపుర మాహాత్మ్యము సర్పవరమునందలి భావనారాయణస్వామికిని, మిగిలినవి పిఠాపురమునందలి కుక్కుటేశ్వర స్వామికిని, అంకితము చేయబడినవి. ఈ కవి బమ్మెర పోతనవలె తన కావ్యములను నరులకు కృతియిచ్చుట కంగీకరింపక భగవంతునికే ఒసంగెను. ఇతడు శివభక్తి తత్పరుడయ్యును పరదైవతములను ద్వేషింపక అద్వైత భావముతో మెలంగెను.
ఇతని రాజశేఖర విలాసమునకే భూణరాజ చరిత్రమని నామాంతరము. జంగము లడిగిన దేదియైన నిత్తునని గురువు నెదుట ప్రతిజ్ఞ చేసి యుండుటచే, భళ్లాణరాజు మాయజంగమ వేషమున వచ్చిన శివునకు తన పట్టమహిషియైన చల్లమాంబ నర్పించుటయు, శివుడామె చేతిలో శిశువుగామారి ఆ దంపతుల ననుగ్రహించుటయు ఇందలి విషయములు. రసికజన మనోభిరామము శృంగార రస ప్రధానమైన ప్రబంధము. ఇందు స్త్రీవర్ణనము విపులముగా చేయబడినది. వసుచరిత్ర నాదర్శముగా గ్రహించి కవి ఈ ప్రబంధము రచించెను. ఋతుధ్వజుడను రాజు సుశ్యామ అను గంధర్వకన్యను మోహించి పరిణయమాడుటయు, వారికి జన్మించిన కుమార్తె గౌతమి మహర్షిని పెండ్లి యాడుటయు, ఇందలి ప్రథాన కథాంశములు. ఈ కావ్య వస్తువు బ్రహ్మ పురాణమందలి గోదావరి ఖండమునుండి గ్రహింపబడినదని తిమ్మకవి తెలిపియున్నాడు. తిమ్మకవి వర్ణన ప్రియుడే అయ్యును, ఔచిత్యము నెచ్చటను అతిక్రమించి యుండలేదు.
నీలాసుందరీ పరిణయము, అచ్చ తెనుగు రామాయణము అనునవి అచ్చతెనుగున వ్రాయబడిన కావ్యములు. నందుని బావ అగు కుంభకుని గోష్ఠమునందుండిన వృషభములు కొన్ని మదించి చెలరేగి గ్రామస్థులను బాధింప దొడగెను, వానిని నిగ్రహించువారికి తనకూతు నిచ్చెదనని కుంభకుడు ప్రకటించెను. కృష్ణుడు వానిని సంహరించి నీలను పెండ్లియాడెను. అచ్చతెనుగున రచింపబడినదయ్యు ఈ కావ్యము సరసమై మనోహరముగా నుండును, ఇందు మూడాశ్వాసములున్నవి. అచ్చతెనుగు రామాయణము కూడ ఇట్లే సహజమైన వర్ణనలకును, సరసమైన పద ప్రయోగమునకును నెలవై హృద్యముగా నుండును. ఈ అచ్చ తెలుగు కావ్యములు రచించుటచే ఇతనికి అభినవవాగనుశాసనుడను బిరుదము కలిగెనని చెప్పుదురు.
రుక్మిణీ పరిణయము తిమ్మకవి ప్రబంధరచన. ఇందలి శైలి సంస్కృతసమాస భూయిష్ఠమై ప్రౌఢముగానుండును. శివలీలావిలాసము ఇతని తుదిరచన. లక్షణ సారసంగ్రహము మూడాశ్వాసముల లక్షణగ్రంథము. పూర్వలక్షణ గ్రంథములలో లేని క్రొత్తవిషయములు కొన్ని తానిందు చేర్చితినని కవి చెప్పియున్నాడు. తిమ్మకవి గ్రంథములందు ప్రబంధయుగచ్ఛాయలే హెచ్చుగా గోచరించును. క్రొత్తదనమేదియు కానరాదు. ఇతని కవిత్వము మిక్కిలి ధారాళమైనది. పాండిత్య ప్రకర్షకై ఈత డచ్చటచ్చట శ్లేషయమకాదులను గర్భకవిత్వమును ప్రదర్శించి యుండెను. ఈతని తొలిరచనలలో స్త్రీవాచక అకార సంధులు మున్నగు కొన్ని దోషములు కన్పించినను తరువాతి రచనలు మిక్కిలి నిర్దుష్టములుగానే యుండును. బహుకావ్యరచనా ధురంధరుడయ్యు ఈ మహాకవి రాజాశ్రయము నాసింపక భగవంతుని నమ్మి స్వతంత్ర జీవితము సాగించెను.
కూచిమంచి తిమ్మకవి సార్వభౌముని రెండవ తమ్ముడు జగ్గకవి (క్రీ.శ. 1700-1760). జానకీ పరిణయము, ద్విపద రాధాకృష్ణ చరిత్రము, సుభద్రా పరిణయము, చంద్ర రేఖా విలాపము, సోమదేవ రాజీయము మున్నగు గ్రంథములను రచించెను. సుభద్రా పరిణయమున అర్జునుడు సుభద్రను పెండ్లియాడిన వృత్తాంతము చక్కగా వర్ణింపబడినది. ఇం దారాశ్వాసము లున్నవి. చంద్ర రేఖా విలాపము దూషణకావ్యము. పూసపాటి విజయరామరాజుగారి బావమరది అగు చింతలపాటి నీలాద్రిరాజ సత్కారము చేసెద నని కావ్యము వ్రాయించుకొని పిమ్మట తిరస్కారము చూపుటచే, కోపించి అతనిని దూషించుచు జగ్గకవి ఈ బూతు కావ్యమును రచించెను తిట్టు కవిత్వమున నీతనికి గల అసమానపాండిత్య మిందు గోచరించును. సోమదేవరాజీయము కాసెసర్వప్ప సిద్ధేశ్వర చరిత్రము ననుసరించి వ్రాయబడినది. ఇది కాకతిప్రతాపరుద్రుని వంశమును వర్ణించు మూఢాశ్వాసముల గ్రంథము