Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/674

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము . II


ములై నీతిబాహ్యములుగ నున్నవి. పూర్వ కావ్యము లందలి కథలుకూడ కొన్ని ఇందు కానవచ్చును. లీలావతి అను రాజకుమారి కథ గౌరన నవనాథ చరిత్ర నుండి గ్రహింపబడినది. చపలయను విప్రయువతి కథకును కళా పూర్ణోదయము నందలి సుగాత్రీ శాలీనుల కథకును పోలిక ఉన్నది. వసుమంతుడను వణిజుని కథ నీతిమయమై రమ్యముగా నున్నది. కదిరీపతి కథాకథనమున మిక్కిలి నేర్పరి. క్రీ. శ. 15 వ శ తాబ్దిలో కొరవి గోపరాజు వ్రాసిన సింహాసన ద్వాత్రింశిక యందలి కథలకంటె ఈతని కథలు సహజతరములుగ ఉన్నవి. సులభమైన శైలిలో సహజ వర్ణనములు కావించుట యందును, స్త్రీ పురుషుల చిత్త వృత్తులు వర్ణించుటయందును ఇతడు చాల సమర్థుడు. ఈతని గ్రంథము వలన తత్కాల ప్రవృత్తులను లోక స్వభావమును చక్కగా తెలియవచ్చును.

మైసూరు రాజ్యమున పద్య గ్రంథములకన్న గద్య గ్రంథము లెక్కువగా వెలసినవి. వీనిని రచించిన కళువ వంశపు దండనాథులు పేర్కొన దగినవారు. అందు కళువె వీరరాజు భారతమును వచనముగా వ్రాసెను. ఇతని తండ్రి దొడ్డరాజు. చిక్క దేవరాయలకడ దళ వాయిగా నుండెను. (క్రీ. శ. 1673-1704). వీరరాజు కన్నడమునను, సంస్కృతమునను కూడ గ్రంథరచన కావించెను. ఇతని వచన భారతమునందలి సభా భీష్మ పర్వములు మాత్రమే ఇప్పుడు లభించుచున్నవి. ఈతని రచన సంస్కృత భారతమునకు సరియైన అనువాదము. ఇందలి వాక్యములు కొంచెము దీర్ఘ తరములుగా నున్నను ఇతని శైలి సరళమై మనోహరముగా నుండును. ప్రథమా విభక్తియందలి మువర్ణకమును బిందుపూర్వక బు వర్ణముగా వ్రాయుట ఈతనికి అలవాటు. భారత వచన రచనమున వీరరాజునకు విష్ణుపురాణ వచన కర్తయగు తుపాకుల అనంత భూపాలుడు తోడ్పడియుండెను. వచన భారతము మైసూరు రాజ్యమందలి కళువె గ్రామ మందలి గోపాల కృష్ణుని కంకితము చేయబడినది.

వీరరాజు కుమారుడైన నంజరాజుకూడ ఆంధ్ర కర్నాట భాషలలో కావ్యములు వ్రాసెను. ఇతడును తండ్రివలెనే మైసూరు రాజ్యమున దండనాథుడుగా ఉండెను (క్రీ.శ. 1724). ఇతని కన్నడ వచన భారతమును, తెలుగు హాలాస్య మాహాత్మ్యమును లభించుచున్నవి. హాలాస్య మాహాత్మ్యము శైవ గ్రంథము. దక్షిణ మధురావురి మహిమ వర్ణింపబడినది. ఇందలి రచన సులభమై సలక్షణముగా నుండును.

ఇంత వరకును దక్షిణాంధ్ర యుగమున దక్షిణ దేశమున రచింపబడిన ఆంధ్రవాఙ్మయమును గూర్చి చెప్పబడినది. ఈ కాలమున తెలంగాణమునను, ఆంధ్రదేశమునను కూడ పలువురు కవులు పలురకములైన కావ్యములను రచించి యుండిరి.

దామెర్ల వేంగళనాయకుడు (క్రీ. శ. 17వ శతాబ్ది నడుమ) కృష్ణ చరిత్రము, బహుళాశ్వ చరిత్రము అను గ్రంథములను రచించెను. ఇందు బహుళాశ్వ చరిత్రము ప్రౌఢ మైన ప్రబంధము. ఇందలి కథ కడు స్వల్పము, శ్రీకృష్ణుడు తన భక్తుడైన బహుళాళ్వుని ఇంటికి విందార గింప బోవుట ఇందలి ఇతివృత్తము. కృష్ణుని పరోక్షమున ద్వారక యందలి గోపికలు పొందిన విరహమును కవి విపులముగ వర్ణించెను. ప్రబంధోచితములైన వర్ణన లన్నియు ఇందు కనుపించును. బహుశాశ్వుడు చేసిన విందును వర్ణించు సందర్భమున ఆ కాలమునందలి రాజ కుటుంబములలోని భోజన మర్యాదలు వివరింపబడినవి. పంచమాశ్వాసమునందలి కళానిధి అను వైశ్య యువకుని కథలో వేశ్యాలోలతవలని యనర్థములు వర్ణితములైనవి. కళానిధి వలపుకత్తెయైన మణిమంజరి నృత్య నైపుణ్యమును వర్ణించుపట్ల కవికి కల నాట్యకళాపరిచయము వెల్లడి యగుచున్నది. కవి రామభక్తుడగుటచే కావ్యమున నెట్లో ప్రసక్తిని కల్పించి రామభక్తిని వర్ణించెను. ఈ కావ్యము శ్రీరామునకే అంకితము చేయబడినది. వేంగళ నాయకుడు సంస్కృతాంధ్రములందు మంచి పండితుడు, కవిత్వమున కాళిదాసాదులు తప్ప ఇతరులు తన కీడు కారని ఈతడు వ్రాసికొనెను. శ్లేష శబ్దాలంకార ఘటనమున ఈతనికి ప్రీతి మెండు.

ఈ కాలపు కవులలో బహు గ్రంథములు రచించి కవి సార్వభౌముడని ప్రశస్తిగాంచినవాడు కూచిమంచి తిమ్మకవి (క్రీ. శ. 1700-1756). రుక్మిణీ పరిణయము, రాజశేఖర విలాసము, నీలాసుందరీ పరిణయము, అచ్చ తెలుగు రామాయణము, రసికజన మనోభిరామము,