Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/623

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర లక్షణగ్రంథములు


గ్రంథమును, శ్రీ నాళం కృష్ణారావు మరియొక గ్రంథమును ప్రకటించియున్నారు.

ఆంధ్ర విజ్ఞానసర్వస్వములు :- ఇవికూడ నిఘంటువుల వంటివే అయినను విషయ విస్తృతినిబట్టి వీటిని ప్రత్యేక జాతిగా గ్రహింపవలసియున్నది. పాశ్చాత్య దేశములందలి విజ్ఞానసర్వస్వములు (Encyclopaedias) ఈజాతి గ్రంథములకు మార్గదర్శకములైనవి.

ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము  :- ఆంధ్ర వాఙ్మయములో ఇది మొట్టమొదటి విజ్ఞానసర్వస్వము. శ్రీ కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావుగారు, వారి మిత్రులును కలిసి దీనిని రచింప ప్రయత్నించిరి. ప్రథమగంపుటము 1915 లోను; ద్వితీయ, తృతీయ సంపుటములు 1916-17 లలోను ప్రకటితములైనవి. ఈమూడు సంపుటములందును 'అ' నుండి 'ఆహ్రి'వరకును అకారాదిక్రమణికలోగల పదములకు సంబంధించిన వ్యాసములుకలవు; నాల్గవసంపుటమును ఆంధ్రసంపుటముగ ప్రకటింప ప్రయత్నము చేయు చుండగా, 1923 లో లక్ష్మణరావుగారు చనిపోయిరి. అంతటితో ఈ మహత్తర కార్య మాగిపోయినది. దీనిని పునరుద్ధరింపవలెనను తలంపుతో, ప్రథమ ముద్రణ ప్రతులు శీఘ్రకాలమునకే అలభ్యములగుటచే, శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుగారు ఈమూడు సంపుటములను రెండుగా భాగించి నూతనాంశముల ననేకములచేర్చి రెండుసంపుటములుగా 1932, 1934 లలో ప్రకటించిరి. పిమ్మట నాగేశ్వరరావుగారి మరణముతో ఈ ద్వితీయ ప్రయత్నమును నిలిచిపోయినది. విశ్వవిజ్ఞానమును భారతీయ దృక్పథమునుండి సందర్శించి వివరించుటయే దీనిలక్ష్యము. ఇది అసమగ్రమైనను ఉన్నంతలో ఆంధ్రులకు కల్పవృక్షము వంటిది.

పురాణనామచంద్రిక  : దీనిని రచించిన వారు ఎనమండ్రం వేంకటరామయ్యగారు. ఇది ప్రాచీన ఆంధ్ర గ్రంథ పఠన మందు అభిరుచిగల విద్యార్థులకును, ఉపాధ్యాయులకును తోడ్పడుటకు ఉద్దిష్టమైనది. ఇందు హిందువులు దేవతలు, సిద్ధపురుషులు, రాజులు, తీర్థయాత్రాస్థలములు, షద్దర్శనములు మున్నగువాటిని గురించిన విశేషములు వివరింపబడినవి. పురాణములందలి ప్రధాన పురుషుల వంశవృక్షములుకూడ అనుబంధముగ ఇందు చేర్పబడినవి. ఇందలి విషయము సమగ్రము గాకున్నను ప్రాచీన గ్రంథములను చదువువారికి మిక్కిలి ఉపకరించునదిగా నున్నది. దేవతలు, ఋషులు, రాజులు, కవులు, దేశములు, పట్టణములు, నదులు, గ్రంథములు, మతాచార వ్యావహారిక పదములు మున్నగునవి ఇందు అకారాదిక్రమమున కాననగును. పురాణగాథలను వివరించు గ్రంధములలో ఇది మిక్కిలి ప్రాచీనమయిన దనవచ్చును (సం. క్రీ.శ.1879).

పూర్వగాథాలహరి  : దీనిని శ్రీ వేమూరి శ్రీనివాసరావుగారు రచించిరి. దీని రచన 1917 లో ప్రారంభ మయినది. ఇది 1928 నాటికి పూర్తియై ముద్రితమైనది. ప్రారంభమునుండి అంతమువరకును అనన్యసహాయులై, పదునెనిమిది పురాణములందును, రామాయణ భారతాది కావ్యేతిహాసములందును గల కథల సారాంశములను సేకరించి అకారాది క్రమములో ఆయానామములక్రింద వివరించియున్నారు. ఇది మిక్కిలి ఉపయోగకరమైన గ్రంథము.

ఆంధ్ర విజ్ఞానము  :- 'దేవిడి' జమీందారైన శ్రీ ప్రసాద భూపాలుడు దీనిని ఏడు సంపుటములుగా రచించెను. దీని ముద్రణము 1938 లో ప్రారంభమై 1941 లో పూర్తియైనది. విజ్ఞాన సర్వస్వములు సాధారణముగా పలువురు మేధావులచే రచింపబడి, ఒక వ్యక్తి చేత క్రోడీకరింపబడును. కాని ఇది శ్రీ ప్రసాదభూపాలుని ఒక్క చేతిమీదుగానే ఆదినుండి అంతమువరకును వ్రాయబడి సంపుటీకరింప బడినది. ఇట్లు విశ్వతోముఖ విజ్ఞానమయ మగు గ్రంథరాజమును ఒకవ్యక్తి రచించి పూర్తిచేయుట అత్యంత విశిష్ట విషయము. మనకున్న విజ్ఞాన సర్వస్వములలో ఇప్పటికి సంపూర్ణమైనది ఇది యొక్కటియే.

ఆంధ్రసర్వస్వము  :- దీనికి శ్రీ మాగంటి బాపినీడు గారు సంపాదకులు. ఆంధ్రదేశమునకును, ఆంధ్రులకును సంబంధించిన అన్ని విషయములను అందించుటకు చేసిన ప్రథమ ప్రయత్నమిది (1943).

తెలుగు విజ్ఞాన సర్వస్వము  :- 'తెలుగుభాషా సమితి'(మద్రాసు) వారి ఆధ్వర్యవమున ఈ తెలుగు విజ్ఞాన సర్వస్వము రచింపబడుచున్నది. ఇప్పటికి సంపుటములు- (1) చరిత్ర - రాజనీతి 1954; (2) భౌతిక రసాయనిక శాస్త్రములు (1955) అనునవి ప్రకటితములైనవి.