Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర లక్షణగ్రంథములు


శబ్దార్థ చంద్రిక  : - మహాకాళి సుబ్బారాయ రచితము (1906 ప్రాంతము). శబ్దరత్నాకరమున లేని కొన్ని శబ్దము లీ నిఘంటువున గలవు. ఇందు చక్కని యర్థము లీయబడినవి. ఇది విద్యార్థులకు మిక్కిలి ఉపయుక్తము.

శబ్దారచింతామణి  :- హైదరాబాదు రాష్ట్ర వాసియైన తాటికొండ తిమ్మా రెడ్డి దేశాయి దీనిని రచించెను. క్రీ.శ. 1906 లో ఇది ముద్రితమైనది. ప్రతిపదమునకును సులభమైన తెలుగర్థము, దానితో పాటు ఉర్దుపదము దీనియం దుండును. తెలుగుపదములకు ఉర్దుపదముల నెరుగని ఆంధ్రుల ఉపయోగార్థ మీ నిఘంటువు రచింపబడినది. ఉదాహరణము.

“అంతరాయము - విఘ్నము - ఖలల్
అందకత్తె - సౌందర్యవతి - హసీనా."

ఇట్లే గ్రంథమంతయు అకారాదిక్రమముతో నున్నది.

శంకరనారాయణ నిఘంటువు  :- ఇది ఇంగ్లీషు పదములకు తెలుగర్థములను దెలుపు నిఘంటువులలో బహుళ ప్రచారమును పొందిన ఉత్తమనిఘంటువు. తెలుగు పదములకు ఆంగ్లార్థముల నొసగెడి నిఘంటువును కూడ వీరు రచించిరి.

ఉర్దు తెలుగు నిఘంటువు  :- హైదరాబాదు వాస్తవ్యులయిన శ్రీ ఐతంరాజు కొండలరావుగారు ఈ నిఘంటువును వ్రాసిరి. ఇంగ్లీషుకు శంకరనారాయణ నిఘంటువు వలెనే, ఉర్దుపదముల అర్థము నెరుగ గోరిన ఆంధ్రుల కిది మిక్కిలి ఉపయోగకరమైన నిఘంటువు.

పారిభాషిక పదకోశములు  :- శ్రీ తిరుమల వేంకట రంగాచార్యులుగారు పదములను సేకరింపగా శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుగా రీనిఘంటువును బ్రకటించిరి. ఆంగ్లమునందలి వివిధశాస్త్రములకు సంబంధించిన ఇంగ్లీషు పదములకు తెలుగర్థము తీయబడినవి. దిగవల్లి వెంకట శివరావుగారును ఒక పారిభాషిక పద నిఘంటువును వ్రాసిరి. ఇందు వ్యవహారకోశము, శాస్త్రపరిభాష అను రెండు భాగములు కలవు.

విద్యార్థి కల్పతరువు  :- శ్రీ ముసునూరి వేంకటశాస్త్రి గారు దీనిని రచించిరి (1936 ప్రాంతమును). దీనికి వారే 'ఆంధ్రభాషా విషయ సర్వస్వము' అను పేరిడిరి. ఇది అతిశయోక్తి కాదు. ఇది ఆంధ్ర విద్యార్థిలోకమునకు అత్యంతోపకారి యగుటయేకాక పండితులకును సహాయకారి కాగలదు. శ్రీ శాస్త్రిగారు 'శబ్దార్థ దీపిక' అను మరొక తెలుగు - తెలుగు నిఘంటువును కూర్చిరి (1956). దీనిలో శబ్దముల రూపాంతరములును వివిధార్థములును, పర్యాయ పదములును, ఇయ్యబడుటయేగాక సంస్కృత న్యాయములు కూడ విశేషముగా చేర్చబడి సులభరీతిని అర్థవివరణము గావింపబడెను.

పంచభాషి  :- రెంటాల వెంకట సుబ్బారావుగారు దీనిని రచించిరి. ఒక తెలుగుపదమును గ్రహించి దానికి సరియైన కన్నడము, తమిళము, హిందూస్తానీ, ఇంగ్లీషు పదములు చేర్చబడినవి. ఐదు భాషలు ఒకేసారి నేర్చుకొను టకు ఉపయోగించునట్టి చిన్న నిఘంటువు. దీని రెండవ భాగమున ఇదేవిధముగా వాక్యములు సైత మైదుభాషలలో నీయబడినవి. ఇట్టిదే "షడ్భాషామంజరి" యును కలదు. దీనిని వెష్టువార్డు అండ్ కంపెనీవారు ప్రచురించిరి. పై ఐదు భాషలకు తోడు మరాఠీ భాషాపదములు కూడ ఇందున్నవి,

గెలిటి తెలుగు నిఘంటువు : అసిస్టెంటు కలెక్టర్లు, యువకోద్యోగులు, మిషనరీలు, వ్యాపారస్థులు మొదలగువారి ఉపయోగార్థం మిది శ్రీ ఎ. గెలిటి అను సివిలు సర్వీసు ఉద్యోగిచేత రచింపబడినది (1933). ఇందు తెలుగు పదములకు ఆంగ్లారము లియబడినవి. తెలుగువదములు రోమను లిపిలో వ్రాయబడుటయు వ్యవహారమునందు లేని పదములను విడిచి వేయుటయు ఇందలి విశేషములు.

తెలుగు సామెతలు  : దీనిని కెప్టెన్ కార్ అనునతడు రచించెను. 1185 తెలుగు సామెతలను అకారాదిగా కూర్చి, వాటిని ఆంగ్లమున వివరించియున్నాడు. తెలుగు సామెతలకు సమానార్ధకములయిన లాటిన్, రోమన్మొదలగు భాషల యందలి సామెతలనుగూడ తరచుగాపేర్కొనెను. గ్రంథాంతమున 32 సంస్కృత న్యాయములను గూడ ఆంగ్లమున వివరించియున్నాడు. సంస్కృత న్యాయములనుగూర్చి డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు ఒక గ్రంథమును; కూచిభొట్ల నరసింహశాస్త్రి, మట్టి లక్ష్మీనరసింహశాస్త్రి కలిసి ఒక గ్రంథమును ప్రకటించినారు. తెలుగు సామెతలను తెలుగునందే వివరించుచు శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రి యొక చిన్న