Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర లక్షణగ్రంథములు


చేర్పబడియుండుట చేతను విద్యార్థుల సహాయార్థము వారి యుపయోగమునకు చాలునంతటిదిగాను, లక్ష్యా విరుద్ధము గాను ఉండునట్లు తెనుగుపదములతో గూడ తద పేక్షితము లయిన సంస్కృత పదములను జేర్చి అకారాదిగా ఈ నిఘంటువును రచించుచున్నట్లు వారే పేర్కొనిరి. ఇంతకు పూర్వమందున్న సర్వాంధ్ర నిఘంటువులును వీరికి ఉప యోగపడినవి. ప్రామాణిక మును, సంపూర్ణ మును అయిన ఆంధ్రనిఘంటువు ఇప్పటికిని ఇది యొక్కటియే.

వైకృతదీపిక : ఇదికూడ శ్రీ బహుజనపల్లి సీతారామాచార్య కృతమే. ఇది క్రీ. శ. 1900 లో మూడవ ముద్రణము పొందినది. ఇందు అకారాది క్రమములో నున్న 2,400 వికృతిపదములకు అర్థములును, ఆద్య ప్రకృతులగు సంస్కృత పదములును వ్రాయబడినవి.

శబ్దరత్నాకరముకూడ సమగ్రము కాదనియు, ఇంకను తెనుగు శబ్దములును, అవసరమైన సంస్కృత శబ్దములును మిగిలియున్న వనియు శ్రీ వీరేశలింగము పంతులు మున్నగువారు తలచిరి. ఇట్టి తలంపుతోనే శబ్దరత్నాకరము తరువాత మరికొన్ని నిఘంటువులు చిన్నవియును, పెద్దవియును బయలు దేరినవి.

ఆంధ్రవాచస్పత్యము : కొట్ర శ్యామల కామశాస్త్రిగారు ఈ నిఘంటువును రచించి ప్రకటించిరి. (1934-1940 మధ్య) పర్యాయ పదాత్మక పద్యరూప నిఘంటువులు, నానార్థ నిఘంటువులు, అకారాది శబ్దక్రమముతో రచింపబడిన ఆధునిక నిఘంటువులును ప్రత్యేక మొక్కొక్క గుణము కలవగుటచేత ఆగుణములన్నియు గలిసివచ్చునట్లును, విశేషార్థములు, వ్యుత్పత్తులు తెలియునట్లును ఇది రచింపబడినది. ఇది ఆధునిక పద్ధతిలో నున్న సమగ్ర నిఘంటువు.

సూర్యరాయాంధ్ర నిఘంటువు  : 1911 వ సంవత్సర ప్రాంతమున స్థాపితమైన ఆంధ్రసాహిత్య పరిషత్తు ఆధ్వర్య వమునను, శ్రీ పీఠికాధీశుని ఔదార్యముతోను ఈ నిఘంటు నిర్మాణము ప్రారంభమైనది. ఆంధ్రదేశమునందలి అనేక సుప్రసిద్ధ పండితుల దీర్ఘకాల విశేష పరిశ్రమకు ఫలితముగా 1936-44 మధ్య ఈ నిఘంటు సంపుటములు నాల్గు ప్రకటితములైనవి. 'అ' మొదలు 'నస్థిమాలి' అను పదము వరకును ఇది ముద్రితమైనది. ఇది పూర్తి యగుటకు ఇంకను మూడు సంపుటములు ప్రకటితములు కావలసియున్నవి.

ఇది చాల శాస్త్రీయమగు పద్ధతిలో నిర్మితమైన నిఘంటువు. వీలైనంతవరకు సమానార్ధకములగు తమిథము, కన్నడము మొదలగు భాషాపదములుకూడ నొసగబడినవి. ఒకే పదమునకుగల భిన్నార్థములను వివరించుచు ప్రయోగములు ఉదాహృతములైనవి. జయంతి రామయ్య పంతులుగారు దీనికి సంపాదకులు. పిమ్మట డాక్టరు గిడుగు సీతాపతిగారు సంపాదకత్వమును వహించిరి.

వావిళ్ళ నిఘంటువు  :- సూర్యరాయాంధ్ర నిఘంటువు పెక్కు సంపుటములలో నుండుటచేత అందరకును అందు బాటులో నుండవలెన నెడి ఉద్దేశముతో వావిళ్ళసంస్థవారు దీనిని ప్రకటించుటకు పూనుకొనిరి. ఆదిలో దీనిని రెండు సంపుటములుగా ముద్రింప దలపెట్టిరి, కాని ఇప్పటికే ఇది మూడుసంపుటములుగా ముద్రితమైనది. ఇందుకూడ 'అ' మొదలు 'నస్థిమాలి' వరకు మాత్రమే పదములుకలవు. ఇది ఇంకను రెండు సంపుటములైనను పట్టును. సూర్య రాయాంధ్ర నిఘంటు పద్ధతీయే ఇందును అనుసరింపబడినది. అందులేని కొన్ని క్రొత్తపదములుకూడ ఇందుగలవు. అకారాది “ఇంచు" వరకును ఈ నిఘంటువును శ్రీ శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రిగారు రచించిరి. వారు పరమపదించుటచేత శ్రీ బులుసు వేంకటేశ్వర్లుగారు దీనిని పూర్తి చేసిరి.

లక్ష్మీనారాయణీయము  :- దీనిని శ్రీ కొట్ర లక్ష్మీనారాయణశాస్త్రిగారు రచించిరి (1907 లో ప్రకటితము). ఇది శుద్ధాంధ్రపద నిఘంటువు. ఇందు అచ్చ తెలుగు పదములకుమాత్ర మర్థములు వ్రాయబడినవి. అచ్చ తెలుగు పదముల కర్థము నెరుగ గోరువారికిని, అచ్చ తెలుగుపదము లేవియో తెలిసికొనదలచిన వారికిని ఇది యుపయోగించును. ఇదియు ఆధునిక పద్ధతి నిఘంటువే

ఆంధ్రపద పారిజాతము  : ఇది అకారాదిగా ప్రయోగ సహితముగ వ్రాయబడిన శుద్ధాంధ్రపద నిఘంటువు. దీనిని శ్రీ ఓగిరాల జగన్నాథకవి : శ్రీ గురుజాడ శ్రీరామమూర్తిగారలు రచించిరి; వారి మిత్రులగు పిడుగు సుబ్బరామయ్య, మరికొందరు పండితులు దీనిని పరిష్కరించి 1888 లో ప్రకటించిరి.